గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - May 14, 2020 , 01:10:57

పాజిటివ్‌ ఐతే కంటైన్‌మెంటే..

పాజిటివ్‌ ఐతే కంటైన్‌మెంటే..

  • ఆ జోన్లలో సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారీ 
  • స్థానికులకు ఫీవర్‌ పరీక్షలు తప్పనిసరి
  • ఆయా ప్రాంతాల్లో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పర్యటన

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన అన్నిప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి, ఆ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌తో పిచికారీ చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశించారు. సరూర్‌నగర్‌ మండలంలోని పలు ప్రాంతాలను కలెక్టర్‌ విస్తృతంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. నిన్న పాజిటివ్‌ కేసు నమోదైన మీర్‌పేట్‌లో బుధవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, రెవెన్యూ, పోలీస్‌ తదితర అధికారులతో కలసి కలెక్టర్‌ పర్యటించారు. మీర్‌పేటలో ఒక మహిళకు పాజిటివ్‌ రావడంతో ఆమె నివాస ప్రాంతంతోపాటు పరిసరాలను కంటైన్‌మెంట్‌గా చేశారు. ఈప్రాంతంలోని నివాసితులకు ఫీవర్‌ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో వనస్థలిపురం, ద్వారకానగర్‌, హుడా సాయినగర్‌, సచివాలయ నగర్‌, ఎస్‌.కే.డీ నగర్‌, లింగోజిగూడ, నాగోల్‌, జింకలబావి, విజయపురి కాలనీ తదితర కాలనీల్లో ఇటీవల పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా సరూర్‌ నగర్‌ మండలంలోని ఎన్టీఆర్‌ నగర్‌ కూరగాయల మార్కెట్‌, కొత్తపేట రైతు బజార్‌, పండ్ల మార్కెట్‌, వనస్థలిపురం రైతు బజార్లలో కరోనా వ్యాప్తికి అవకాశాలున్నందున వాటిని మూసివేశారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుచేయడంతో పాటు రాత్రి పూట కర్ఫ్యూను పక్కాగా పోలీసులు అమలుచేస్తున్నారు.