శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - May 14, 2020 , 01:10:58

‘ఆత్మ నిర్భర్‌'తో భారీ ఉపశమనం

‘ఆత్మ నిర్భర్‌'తో భారీ ఉపశమనం

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదుకునేందుకు రుణాలు
  • జిల్లాలో 3450 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 
  • 12 నెలల వరకు రుణాలపై తిరిగి చెల్లింపులు లేవు
  • ఎంఎస్‌ఎంఈలకు మరో మూడు నెలల పీఎఫ్‌ చెల్లింపు
  • ఉద్యోగులు నెలనెలా చెల్లించే ఈపీఎఫ్‌ 12 నుంచి 10 శాతానికి తగ్గింపు 
  • 1.50 లక్షల మంది ఉద్యోగుల చేతికి మరింత నగదు

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ: జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం మారింది. కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ కొత్త నిర్వచనం ప్రకారం రూ.కోటి పెట్టుబడి కలిగిన సంస్థ రూ.5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. రూ.10 కోట్ల పెట్టుబడి కలిగిన సంస్థ రూ.50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. రూ.20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ.100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా మార్పు చెందనున్నది. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 3450 ఉన్నాయి. వీటిలో 1750 పరిశ్రమలు పనులు ప్రారంభించగా.. ఇంకా 1700 పరిశ్రమలు ప్రారంభించాల్సి ఉంది. 

ఉత్పత్తి ప్రారంభించేందుకు ..

ఆర్థిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, కుటీర, గృహ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలకు రూ.3లక్షల కోట్లు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలుగా ఇవ్వనున్నారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది ఉపయోగపడుతుందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. ఎంఎస్‌ఎంఈలోని ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు సైతం ప్యాకేజీ ఉపయోగపడుతుంది. 12 నెలల వరకు రుణాలపై చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించడంతో పరిశ్రమలకు భారీ ఉపశమనం లభించింది. ఎన్‌పీఏ ముప్పు ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు ఈ సదుపాయం కల్పించారు. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎంఈలకు మరో మూడు నెలలు భవిష్య నిధి (పీఎఫ్‌) ప్రభుత్వమే చెల్లించనున్నది. ఉద్యోగులు నెలనెలా చెల్లించే ఈపీఎఫ్‌ను 12 నుంచి 10 శాతానికి తగ్గించడంతో జిల్లాలో 1.50 లక్షల మంది చేతికి మరింత నగదు అందనున్నది. సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి పరిధిని రూ.25 లక్షల నుంచి రూ.కోటికి పెంచారు. రూ.5కోట్ల టర్నోవర్‌ చేసే కంపెనీలను కూడా సూక్ష్మ పరిశ్రమలుగా గుర్తించారు.