గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - May 14, 2020 , 01:10:58

రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కళకళ..

రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కళకళ..

  • ఊపందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 
  • లాక్‌డౌన్‌ మినహాయింపుతో సదావకాశం 
  • తెరుచుకున్న డాక్యుమెంట్‌ రైటర్‌ కేంద్రాలు 
  • ఉమ్మడి జిల్లాలో బుధవారం 524 దస్తావేజులు
  • రూ.2.95 కోట్లకు పైగా ఆదాయం 

గండిపేటలో అత్యధికంగా రూ.51.92 లక్షలురంగారెడ్డి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌లో స్థిరాస్తి రంగానికి మినహాయింపు, రిజిస్ట్రేషన్‌ శాఖ పూర్తిస్థాయి సిబ్బంది విధులతో స్థిరాస్తి దస్తావేజుల నమోదు ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ఊపందుకుంటున్నది. వారం రోజులుగా మందకొడిగా సాగినప్పటికీ రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలోని 23 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజుదారుల సందడి ప్రారంభమైంది. డాక్యుమెంట్‌ రైటర్ల కేంద్రాలు తెరుచుకోవడంతో స్థిరాస్తి కొనుగోలు అమ్మకందారుల లావాదేవీలతో హడావుడి నెలకొన్నది. దీంతో బుధవారం ఒక్కరోజే దస్తావేజుల నమోదు, చలాన్ల చెల్లింపులతో దాదాపు రూ.2.95కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 45 రోజుల తర్వాత దస్తావేజుల నమోదుపై నెలకొన్న సందిగ్ధతపై కదలిక వచ్చినట్లయ్యింది. తాజాగా గత వారం సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ తర్వాత అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. కార్యాలయాల్లో దస్తావేజులు, స్టాంపుల అమ్మకం, ఈసీ తదితర సేవలను అందిస్తున్నారు. సోమవారం 23 రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 380 దస్తావేజులకుగాను రూ.4.32 కోట్లు, మంగళవారం 464 దస్తావేజులకు రూ.2.15 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా రిజిస్ట్రార్‌ మందల సంతోశ్‌ ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. 

పబ్లిక్‌ డాటా ఎంట్రీ ద్వారా దస్తావేజుల వివరాలు నమోదు

రిజిస్ట్రేషన్‌ చేసుకునేవారు registration.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో పబ్లిక్‌ డాటా ఎంట్రీ ద్వారా దస్తావేజుల వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టాంపు డ్యూటీ తదితర రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించి, వారు ఏ రోజు రిజిస్ట్రేషన్‌ చేసుకోదల్చుకున్నారో ఆ రోజు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని ఆ సమయంలో సంబంధిత కార్యాలయానికి వెళ్లాలని రిజిస్ట్రేషన్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయంలో సంబంధిత కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి పత్రం (పాస్‌) కూడా ఆన్‌లైన్‌లో లభిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పాస్‌ను ఆయా పోలీస్‌ చెక్‌ పోస్టుల వద్ద చూపిస్తే వెళ్లడానికి అనుమతి ఇస్తారు. దస్తావేజులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, స్టాంపు డ్యూటీ తదితర సుంకాలు చెల్లించాలి. ఏవైనా కారణాల వల్ల కార్యాలయానికి వెళ్లలేకపోతే మళ్లీ తదుపరి కాలంలో కూడా ఆ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భార ధ్రువీకరణ పత్రం (ఈసీ), దస్తావేజు నఖలు ‘మీసేవ’ నుంచి మాత్రమే పొందాలని.. లేకపోతే registration.telangana. gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి కూడా భార ధ్రువీకరణ పత్రం (ఈసీ), దస్తావేజు నఖలు పొందవచ్చు. కరోనా నేపథ్యంలో కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడానికి నీరు, సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే రిజిస్ట్రేషన్‌ శాఖ ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005994788కు ఫోన్‌ చేసి, వాట్సప్‌ సెల్‌ నంబర్‌ 91212 20272కు సందేశం పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేసేందుకు మినహాయింపు..

భవన నిర్మాణ రంగానికి ప్రభుత్వం నుంచి మినహాయింపు లభించగా.. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపు శాఖ కార్యాలయాలు పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేయడంతో స్థిరాస్తి లావాదేవీలు ఊపందుకుంటున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా లాక్‌డౌన్‌లో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 30 కంటే తక్కువ మందితో పని చేసినప్పటికీ దస్తావేజుదారుల రాకపోకల కట్టడి కారణంగా కనీస రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు కొన్ని రోజులుగా స్థిరాస్తి డాక్యుమెంట్ల నమోదు బోణీ కొట్టలేదు. కరోనా లాక్‌డౌన్‌ స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో లావాదేవీలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు దస్తావేజుదారుల తాకిడి లేక కొద్ది రోజులుగా బోసిపోయాయి. మళ్లీ వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే దస్తావేజులు జోరందుకుంటున్నాయి. 

స్థిరాస్తి విక్రయాలు జోరందుకుంటున్నాయి 

ఉమ్మడి జిల్లాలో స్థిరాస్తి విక్రయాలు జోరందుకుంటున్నాయి. భూమి, ఇండ్ల విక్రయాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. అన్ని కార్యాలయాల్లో కరోనా నేపథ్యంలో చేతులు కడుక్కోవడానికి సబ్సు, శానిటైజర్లు  అందుబాటులో ఉంచాం. రిజిస్ట్రేషన్లకు వచ్చే వారు సహకరించాలి.

- మందల సంతోశ్‌, జిల్లా రిజిస్ట్రార్‌