మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - May 12, 2020 , 00:33:31

1564 హెక్టార్లలో అకాల నష్టం

1564 హెక్టార్లలో అకాల నష్టం

  • వడగండ్లు, ఈదురు గాలులతో వర్షాలు 
  • జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు
  • అత్యధికంగా నేలకొరిగిన వరి

షాబాద్‌ : అకాల వర్షాలు కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలకు వరి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటల రైతులు భారీగా నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లోని 117 గ్రామాల్లో 1564 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసుకుంటే, చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో నష్టం వాటిల్లుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులకు వరి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. మే చివరి వారంలో పడాల్సిన వర్షాలు ఈ ఏడాది ముందుగానే కురుస్తున్నాయి. దీంతో యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడంలేదు. పంట పెట్టుబడి, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందిస్తూ రైతులకు నష్టాలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. కానీ అకాల వర్షాలు తమను నిండా ముంచుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. 

ప్రాథమిక నివేదిక తయారు..

జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 117 గ్రామాల్లో 1564 హెక్టార్లల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికలు తయారుచేశారు. మార్చి 20 నుంచి మే 5వ తేదీ వరకు వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాల ప్రాథమిక నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. షాబాద్‌ మండలంలో ఒక గ్రామంలో 3.6 హెక్టార్లలో, ఇబ్రహీంపట్నంలోని 13 గ్రామాల్లో 185.4 హెక్టార్లలో, మాడ్గుల రెండు గ్రామాల్లో 39.2, మంచాల 17 గ్రామాల్లో 222 , యాచారం 16 గ్రామాల్లో 110, అబ్దుల్లాపూర్‌మెట్‌ రెండు గ్రామాల్లో 27, అమనగల్లు రెండు గ్రామాల్లో 59, కడ్తాల్‌ ఏడు గ్రామాల్లో 92 , కందుకూరు 11 గ్రామాల్లో 270, కొత్తూరు మూడు గ్రామాల్లో 53, మహేశ్వరం 13 గ్రామాల్లో 154, ఫరూఖ్‌నగర్‌ ఐదు గ్రామాల్లో 25, కేశంపేట 11 గ్రామాల్లో 73, నందిగామ రెండు గ్రామాల్లో 32, తలకొండపల్లి 9 గ్రామాల్లో 203, శంషాబాద్‌ రెండు గ్రామాల్లో 5 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నాయి. కందుకూరు మండలంలో 4హెక్టార్లలో, కేశంపేటలో ఒక గ్రామంలో 2 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటల వివరాలు సేకరించారు. వీటితో పాటు కూరగాయల పంటలు, మామిడి తోటలు సైతం దెబ్బతిన్నాయి. 


ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశాం

జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాల ప్రాథమిక నివేదిక తయా రు చేసి ప్రభుత్వానికి అందజేశాం. మొత్తం 18 మండలాల్లోని 117 గ్రామాల్లో మార్చి 20 నుంచి మే 5 వరకు కురిసిన అకాల వర్షాలకు యాసంగిలో బోరుబావుల కింద సాగు చేసుకున్న పంటల్లో 1564 హెకార్టలో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా వరిపంటకు నష్టం జరిగింది. కొద్దిపాటిగా మొక్కజొన్న పంట దెబ్బతింది. పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేశాం.  

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి