బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - May 11, 2020 , 01:37:23

పరిశుభ్రంగా ఉంచుకుందాం

పరిశుభ్రంగా ఉంచుకుందాం

  • ఇండ్లు, పరిసరాలను శుభ్రపర్చుకోవాలి
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • మంత్రి కేటీఆర్‌ పిలుపుతో పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి, ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్లు

షాబాద్‌, నమస్తే తెలంగాణ: సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఇండ్లు, పరిసరాలను శుభ్రపర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. చికున్‌గున్యా, డెంగ్యూ తదితర సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆదివారం ఆర్‌కే పురం డివిజన్‌లోని తన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు పది నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లు, పరిసరాలను శుభ్రపర్చుకోవాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. దోమల లార్వా పెరుగకుండా నిలిచిన నీటిని పారబోయాలన్నారు. శానిటేషన్‌ విషయంలో రాష్ర్టానికి మంచి పేరు వచ్చిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని సూచించారు. మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. విశాఖ ప్రమాద ఘటన దృష్ట్యా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పెంపుపై అధికారులు చర్యలు తీసుకోవాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. 

ఇంటిని శుభ్రం చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తమ ఇండ్లల్లో పరిసరాలను శుభ్రం చేశారు. ఎమ్మెల్యే తన సతీమణి ముకుందమ్మ, మనుమరాళ్లతో కలిసి పూలతొట్లు, పరిసరాలను శుభ్రం చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌చైర్మన్‌ యాదగిరితో పాటు పలువురు కౌన్సిలర్లు ఇంట్లో నీరు నిల్వ లేకుండా వస్తువులను శుభ్రం చేశారు.

ఆమనగలుల్లో..

ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాలు, పట్టణాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, కౌన్సిలర్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.