శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - May 10, 2020 , 01:12:13

హెల్త్‌ సర్వే ముమ్మరం

హెల్త్‌ సర్వే ముమ్మరం

  • వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తం
  • కంటైన్మెంట్‌ జోన్‌లో విస్తృతంగా పారిశుధ్ధ్య పనులు 
  • పర్యవేక్షిస్తున్న అధికారులు 

రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా ప్రభావిత ప్రాంతాలైన కంటైన్మెంట్‌ జోన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హెల్త్‌ సర్వే కొనసాగుతున్నది. వైరస్‌ నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, వైద్య, పంచాయతీ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజులుగా వైద్యసిబ్బంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య లోపం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

వనస్థలి పురంలోనే అధిక కేసులు

వనస్థలిపురం ఏరియాలోనే 20కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ వెంటనే అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 96 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 40 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 50 మంది డిశ్చార్జి అయ్యారు. నలుగురు మృతి చెందిన విషయం విదితమే. వనస్థలిపురంలోనే ఒకే ఇంట్లో తండ్రి, కొడుకు మృతిచెందారు. వీరి ఇంట్లోనే పదిమందికిపైగా పాజిటివ్‌ అని తేలింది. అద్దె ఇంట్లో ఓ కుటుంబానికి(5గురికి) పాజిటివ్‌ నమోదైంది. నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 34 కరోనా పాజిటివ్‌ కేసులు కాగా.. 8 మంది గాంధీలో చికిత్స పొందుతున్నారు. 24 మంది డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మృతిచెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 60 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 32 మంది గాంధీలో చికిత్స పొందుతున్నారు. 26 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక్కడ కూడా ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. 

నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో ..

ఇద్దరు విదేశీ ప్రయాణికులకు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారి ప్రైమరీ కాంటాక్టు కేసులు 3, మర్కజ్‌ ట్రావెలర్‌ పాజిటివ్‌ కేసులు 4 కాగా.. వారి ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు 16, ఇతర పాజిటివ్‌ కేసులు 4, ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు 3, కొవిడ్‌ డ్యూటీ చేస్తున్న వారిలో ఒకరికి, వారి ప్రైమరీ కాంటాక్ట్‌ ఒక్క కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. మొత్తం 34 మందికి  పాజిటివ్‌ వచ్చింది. కాగా 24 మంది డిశ్చార్జి అయ్యారు. 

నిబంధనలు తప్పక పాటించాలి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరుగురు విదేశీ ప్రయాణికులకు పాజిటివ్‌ నమోదు కాగా.. వారి ప్రైమరీ కాంటాక్టు 1, మర్కజ్‌ యాత్రికులు 10 మందికి పాజిటివ్‌ అని తేలింది. వారి ప్రైమరీ కాంటాక్ట్‌ ఐదుగురికి కరోనా వచ్చింది. ఇతరుల నుంచి ఆరుగురికి సోకింది. ఇతరుల ప్రైమరీ కాంటాక్ట్‌ కేసులు 32గా నమోదైంది. మొత్తం 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 26 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక్కడ కూడా ఇద్దరు మృతిచెందారు. మొత్తంగా అర్బన్‌, గ్రామీణం కలిపి 8మంది విదేశీ ప్రయాణికులకు, వారి ప్రైమరీ కాంటాక్ట్‌ నలుగురు, మర్కజ్‌ యాత్రీకులు 14మందికి వారి ప్రైమరీ కాంటాక్ట్‌ 21, ఇతరుల నుంచి 10, ఇతరుల ప్రైమరీ కాంటాక్ట్‌ 35, డ్యూటీ చేస్తున్నవారిలో ఒకరికి, వారి కాంటాక్ట్‌ 1 చొప్పున జిల్లావ్యాప్తంగా 96 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 50 మంది డిశ్చార్జి కాగా.. మిగిలిన 44 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కొందరి గడువు ఇప్పటికే పూర్తయింది. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని క్వారంటైన్‌ కేంద్రాలు ఖాళీ అయ్యాయి. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటున్నది.