గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - May 01, 2020 , 01:26:24

నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు

నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: నల్లబెల్లం క్రయవిక్రయాలు చేసినా, నాటుసారా కాసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ సీఐ వేణుకుమార్‌ హెచ్చరించారు. గురువారం మాడ్గుల మండలంలోని కొలుకులపల్లి చౌరస్తాలో నల్లబెల్లం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌ నుంచి మండలంలోని సండ్రగడ్డ తండాకు  తరలిస్తున్న 1200కిలోల నల్లబెల్లం, 90 కిలోల పటికను స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న ఆయూబ్‌ఖాన్‌, నరేశ్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

చేవెళ్లలో వంద కిలోల ముడి సరుకు

చేవెళ్ల: సారా తయారీలో ఉపయోగించే వంద కిలోల ముడిసరుకును నగరం నుంచి తరలిస్తున్న నలుగురు వ్యక్తుల ను చేవెళ్ల ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. చేవెళ్ల ఎక్సైజ్‌ సీఐ రాకేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఠా సభ్యులు నలుగురు సారా తయారీలో ఉపయోగించే నవసారం, పటిక వంటి ముడి సరుకులను హైదరాబాద్‌లో కొనుగోలు చేసి వాహనంలో టమాట, ఉల్లిగడ్డల బాక్సుల్లో తరలిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి ఎక్సైజ్‌శాఖ అధికారులు, స్థానిక అధికారులకు సమాచారం అందించడంతో అంతారం చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు, వాహనాన్ని కోస్గి ఎక్సైజ్‌శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎక్సైజ్‌ సీఐ రాకేశ్‌ తెలిపారు.