సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - May 01, 2020 , 01:24:18

కళకళలాడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కళకళలాడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు

  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కళకళాడుతున్నాయి. ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో సింగిల్‌విండో ద్వారా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ నెల 15న ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో ప్రారంభించిన ఈ కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో యాసంగి కాలంలో పండించిన పంటను రైతులకు ఇబ్బందులు కలుగకుండా విక్రయించేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యల వల్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్లాల వద్దనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి మద్దతు ధర కల్పిస్తున్నది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆయా మండల కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు సద్వినియోగం చేసుకునేలా చేస్తున్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, ముద్విన్‌, మాడ్గుల, అర్కపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొంటున్నారు. డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌ పర్యవేక్షణలో కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయి. ఆయా మండలాల్లో రైతుబంధు సమితి సభ్యులు, సింగిల్‌ విండో డైరెక్టర్లు ఈ కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన 5 కొనుగోలు కేంద్రాల్లో  15వేల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్‌ తెలిపారు. దళారుల మాటలకు రైతులు మోసపోవద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన వారికి నేరుగా ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు తెలిపారు.