మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - May 01, 2020 , 01:22:57

నారు.. రూపాయికే

నారు.. రూపాయికే

  • రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు 
  • కొత్త విధానానికి ఉద్యానవనశాఖ శ్రీకారం

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రైతులు నారు కోసం ఇబ్బందులు పడకుండా జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఉన్న సందర్భంగా ప్రైవేట్‌ నర్సరీల్లో కూరగాయల నారు పెంచడంలేదు. ఇందుకు సంబంధించి నాణ్యమైన నారును జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లో సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. 

సాంకేతిక సాగు పద్ధతులు

వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన విధానాలు, సాంకేతిక పద్ధతులు, సాగు రూపురేఖలను మార్చేస్తున్నాయి. కూరగాయల నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడులు అంత నాణ్యంగా ఉంటాయి. గతంలో మడుల్లో నారు పెంచి పొలంలో నాటుకునే వారు. ఈ విధానంలో ఇబ్బందులను అధిగమిస్తూ, ఆరోగ్యవంతమైన మొక్కలను ఉత్పత్తి చేయడానికి షేడ్‌ నెట్లను ఏర్పాటుచేశారు. ఇప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకుని పంట సాగును ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లోని జీడిమెట్ల సెంట్రల్‌ ఎక్సలెన్సీ, సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, ములుగులో హైటెక్‌ నర్సరీని ఏర్పాటుచేశారు. ఆటోమిషన్‌ సీడింగ్‌ మెషిన్‌ ద్వారా నారును ఉత్పిత్తి చేస్తున్నారు. షేడ్‌నెట్లలో పెంచే నారు మొక్కలతో పోలిస్తే ఇవి ఆరోగ్యంగా, ధృడంగా ఉండి, చీడ పురుగుల నుంచి తట్టుకునే శక్తి, వైరస్‌ రాకుండా ఉంటుంది. ఇందులో టమాట (యూఎస్‌440, పీహెచ్‌ఎస్‌ 448 రకం), వంగ (కీర్తి, ఉత్కర్ష రకం), పచ్చిమిర్చి (ఉజాల, జ్వాల రకం), క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ తదితర నారు పెంచి రైతులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతే విత్తనాన్ని ఇస్తే నియంత్రిత పరిస్థితుల్లో నారు పెంచి ఇవ్వనున్నారు. టమాట, వంగ నారుకు రూ.1 చొప్పున ఎకరా 8వేల మొక్కల నారు పెంచనున్నారు. రైతు విత్తనాన్ని ఇస్తే మొక్కకు 75 పైసల చొప్పున ఇవ్వనున్నారు. పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ రూ.1.25 పైసల చొప్పున ఎకరాకు 6400మొక్కల నారును పెంచనున్నారు. రైతు విత్తనాన్ని ఇస్తే మిర్చి, క్యాప్సికం నారుకు రూ.1చొప్పున, క్యాబేజీ, కాలీఫ్లవర్‌కు 75 పైసలు చార్జి చేయనున్నారు. నారు సీడ్‌ ప్యాకెట్‌పై చూపిన జెర్మీషన్‌ శాతం ప్రకారం ఇస్తారు. రైతు ముందుగానే దరఖాస్తుతోపాటు కావాల్సిన నారు ధరలో 25 శాతం డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్‌ సునందరెడ్డి తెలిపారు. 

30 నుంచి 45 రోజుల్లో సరఫరా

హైటెక్‌ నర్సరీలో పెంచి నారు ఇండింట్‌ పెట్టిన తర్వాత కనీసం 30నుంచి 45రోజుల్లో నారు సరఫరా చేయనున్నారు. హార్టికల్చర్‌ అధికారి కనకలక్ష్మి (79977 25239)కి మహేశ్వరం, బాలాపూర్‌, సరూర్‌నగర్‌, శంషాబాద్‌, కందుకూరు, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్‌, హార్టికల్చర్‌ అధికారి స్వరూప్‌కుమార్‌ (7997725424)కు చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గండిపేట, హార్టికల్చర్‌ అధికారి ఉషారాణి (7997725243)కి షాద్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌదరిగూడ, కొందుర్గు, తలకొండపల్లి తదితర మండలాల రైతులు సంప్రదించాలని పేర్కొన్నారు.