బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Apr 24, 2020 , 02:27:19

ఎవరికెవరు... ఈ లోకంలో...

ఎవరికెవరు... ఈ లోకంలో...

  • నలుగురి ఆత్మహత్యలపై చలించని బంధువులు
  • పోలీసులు ఫోన్లు చేసినా స్పందించని వైనం
  • ముందుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసిన గ్రామస్తులు

బడంగ్‌పేట, నమస్తే తెలంగాణ: నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.. అనగానే వారెవరో తెలియకపోయినా, కనీస పరిచయం లేకపోయినా.. అయ్యో! ఎంత కష్టమొచ్చిందోనని ఆవేదన చెందడం సహజం. కానీ వారి బంధుమిత్రులెవరూ కించిత్‌ విచారాన్ని వ్యక్తం చేయకపోవడం.. నిస్సిగ్గుగా వారెవరో మాకు తెలియదు. వాళ్లు మాకు దగ్గరోళ్లు కాదు. వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు మేం రాలేం! మాకు ఎలాంటి సంబంధం లేదంటూ పోలీసుల ఫోన్లకు సమాధానం వచ్చింది. ఫోన్లంటే.. వారి సూసైడ్‌ లేఖలోతాము చనిపోయిన తర్వాత ఈ నంబర్లకు ఫోన్‌ చేయ్యండంటూ రాసుకున్నారు. అంటే మరణించిన తర్వాతైనా స్పందిస్తారేమోనని ఆశించారు. కానీ వారి కడసారి చూపునకు కూడా ఆ బంధుగణం రాలేదు. ఇక పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది కలిసి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. చివరగా వారి ఊరోళ్లకు ఫోన్‌ చేస్తే మాజీసర్పంచ్‌, మరికొందరు దహన సంస్కారాలు చేస్తామంటూ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటారు. ఇదీ బాలాపూర్‌ మండలం అల్మాస్‌గూడలో ఆర్థిక ఇబ్బందులు, మూఢనమ్మకాలకు బలై ఆత్మహత్య చేసుకున్న నలుగురి కుటుంబ సభ్యుల కథ. అల్మాస్‌గూడ బీఎస్‌ఆర్‌నగర్‌ కాలనీలోని శ్రీసాయి తేజ అపార్ట్‌  మెంట్‌లో నివాసముండే సువర్ణబాయి(55), ఆమె ముగ్గురు పిల్లలు.. హరీశ్‌(30), గిరీశ్‌(27), కూతురు స్వప్న (25) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందే వారి బంధువుల ఫోన్‌ నంబర్లను లేఖలో రాశారు. కాగా పోస్టుమార్టం అనంతరం పోలీసులు బంధువులకు ఫోన్లు చేయగా, మృతదేహాలను తీసుకోవడానికి ఎవరూ ముందు కు రాలేదు. దీంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేసే క్రమంలో చివరిగా గ్రామస్తులకు ఫోన్‌ చేయగా మాజీసర్పంచ్‌తో పాటు కొందరు గ్రామస్తులు ముందుకు వచ్చి మృతదేహాలను దోర్నాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.