శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Apr 20, 2020 , 00:56:33

కొంపముంచుతున్న నిర్లక్ష్యం..

కొంపముంచుతున్న నిర్లక్ష్యం..

  • అవగాహన లేమితో కరోనా వైరస్‌ వ్యాప్తి 
  • సామాజిక దూరం పాటించడం తప్పనిసరి
  • రెడ్‌ జోన్‌లోనే చేగూరు, తాళ్లగూడ గ్రామాలు

నాకేం అవుతుందిలే.. అని అతిగా పోయేవాళ్లు కొందరు. నా ఒక్కడితో ఎవరికి వస్తుందిలే అనే నిర్లక్ష్యంతో మరికొందరు.. అతి నమ్మకంతో గుంపులు కట్టేవాళ్లు ఇంకొందరు.. ఇలా ఎవరికి వారు భౌతిక దూరం పాటించకుండా, ఇష్టారీతిలో ప్రవర్తించడంతో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌తో ప్రభుత్వం కృషి చేస్తుంటే, కొంతమంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. 

షాద్‌నగర్‌, నమస్తే తెలంగాణ: నియోజక వర్గంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో ప్రయాణించిన  బీహార్‌, ఉత్తరాఖండ్‌ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు షాద్‌నగర్‌ ప్రాంతంలో కరోనా వైరస్‌కు వాహకాలుగా పనిచేశారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన మహిళకు వైరస్‌ సోకడంతో ఆమె మృతి చెందింది. అనంతరం ఆమె భర్తకు ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రభుత్వ సూచన మేరకు సామాజిక దూరం పాటించి ఉంటే వ్యాధి ఈ ప్రాంతంలో వెలుగు చూసేది కాదని వైద్యులు చెపుతున్నారు. ఫలితంగా ఈ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. వందల సంఖ్యలో వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా షాద్‌నగర్‌ డివిజన్‌లో 94 వైద్య బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. 426 మంది వైద్య సిబ్బంది, వైద్యులు నిత్యం సేవలు అందిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్ని జల్లెడపడుతూ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికీ 252 మందిని క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు చేశామని, మరో 26 మంది అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య అధికారులు తెలిపారు. తాజాగా తాళ్లగూడలోని కరోనా బాధితురాలికి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ దవాఖాన సిబ్బం ది నుంచి వైరస్‌ సోకి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక దూరం పాటిస్తే కచ్చితంగా వైరస్‌ను జయించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జిల్లాలో 56 కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నందిగామ: జిల్లాలో ఆదివారం ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో మొత్తం 56 పాజిటివ్‌ కేసులకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం ఫలితాలు 674 మంది శాంపుల్స్‌ సేకరించగా, 56 పాజిటివ్‌, 618 నెగిటివ్‌ కేసులు వచ్చాయి. ఇంకా 35 మందికి సంబంధించిన శాంపుల్స్‌ రిపోర్ట్సులు రావాల్సి ఉన్నది. 65 మంది రావిర్యాలలోని క్వారంటైన్‌లో ఉన్నారు. 72 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్‌ 870 కేసులుగా గుర్తించారు. ఒకరు జిల్లాలో మరణించిన విషయం తెలిసిందే. 

తాళ్లగూడలో మరో పాజిటివ్‌

నందిగామ మండలంలోని తాళ్లగూడ గ్రామంలో మహిళ (35)కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె భర్త(42)కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. క్వారంటైన్‌కు తరలించిన వారిలో ఇంకా ఐదుగురికి సంబం ధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఎవరి ద్వారా వచ్చింది, ఎవరెవ రిని కలిశాడు అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతనితో కలిసి వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.