బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Apr 12, 2020 , 23:59:59

క్వారంటైన్‌ ఖాళీ!

క్వారంటైన్‌ ఖాళీ!

  • రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఆరు క్వారంటైన్‌ కేంద్రాల్లో నిల్‌
  • రావిర్యాల కేంద్రంలో 11 మంది అనుమానితులు 
  • హోంక్వారంటైన్‌లో ఉన్నవారిపై నిఘా..
  • ఇంటి నుంచి బయటకు రావొద్దు: జిల్లా అధికారులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలు ఖాళీ అయ్యాయి. వారి శాంపిల్స్‌ సేకరించి సీసీఎంబీ, ఇతర పరీక్ష కేంద్రాలకు పంపగా.. నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో వారిని అధికారులు ఇంటికి పంపించారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సీటీలో 6 చోట్ల క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇందులోని ఆరు కేంద్రాలు ఖాళీ కాగా.. నాలుగు రోజుల క్రితం రావిర్యాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో 11 మంది అనుమానితులు మాత్రమే ఉన్నారు. హోం క్వారంటైన్‌కు వెళ్లిన వారిపై అధికారులు నిఘా పెట్టారు. 

అప్రమత్తంగా జిల్లా యంత్రాంగం

జిల్లాలో 37 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత నెల నుంచి ఇక్కడ ఏర్పాటు ఆరు కేంద్రాల్లో దశల వారీగా చికిత్సలు పొందిన వారందరి రిపోర్టులు నెగిటివ్‌ రావడంతో వారిని ఇంటికి పంపించారు. అయినప్పటికీ వారిలో కొందరు 21, మరికొందరు 28 రోజులు వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉండాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజులు నుంచి ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ విస్తృతికి అడ్డుకట్ట వేసేందుకు ముందు నుంచి జిల్లా యంత్రాంగం కీలకంగా పనిచేశారు. ఢిల్లీ వెళ్లిన వారి నుంచి స్పీడ్‌గా పాజిటివ్‌ కేసులు పెరుగడంతో అధికారులు కొంత ఆందోళన చెందినప్పటికీ ఢిల్లీ యాత్రికులను గుర్తించడంలో ఆలస్యం చేయకుండా వారిని కట్టడి చేశారు. ఎక్కడిక్కడ మర్కజ్‌ యాత్రికులను గుర్తించి వారి నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా  నిరోధించడంలో అధికారులు లక్ష్యం చేరుకున్నారు. జిల్లాలో 109 మంది మర్కజ్‌ యాత్రికులను గుర్తించి వారు ఎవరితో కాంటాక్ట్‌ అయ్యారో వారందరినీ గుర్తించి జిల్లా క్వారంటైన్‌ కేంద్రాలకు పంపారు. మరికొంతమందిని హోం క్వారంటైన్‌ చేయడంతో వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో సఫళీకృతులయ్యారు. ఈనెల 2 నుంచి 392 మంది శాంపుల్స్‌ సేకరించగా కేవలం 9మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. కాగా ఆదివారం వరకు 372 మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇంకా 11మంది రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఈ 11 మందికి సంబంధించిన రిపోర్టులు నేడు వచ్చే అవకాశాలున్నాయి. వీరితో జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నీ క్వారంటైన్‌ కేంద్రాలు ఖాళీ కానున్నాయి. ప్రతి నిత్యం కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, అడిషనల్‌ కలెక్టర్లు డాక్టర్‌ హరీశ్‌, ప్రతీక్‌ జైన్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ, ఇతర జిల్లా శాఖల అధికారులు కరోనా కట్టడిలో అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు కాకుండా నిరంతరం పర్యవేక్షించారు.