శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Apr 11, 2020 , 02:32:26

బయటకొస్తే జరిమానా..

బయటకొస్తే జరిమానా..

  • బయటకొస్తే జరిమానా..
  • కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌
  • వేర్వేరుగా జిల్లాలో పర్యటించిన కలెక్టర్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/నందిగామ : జిల్లా ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని, ఇంట్లోనే క్షేమంగా ఉండాలని, ఇక నుంచి డ్రోన్‌ కెమెరాల పహారా ఉండనున్నదని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వేర్వేరుగా జిల్లాలో పర్యటించి ప్రజలంతా ఇండ్లల్లోనే ఉండాలని సూచించారు. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇక్కడి నిత్యావసర సరుకులకు మాత్రమే దగ్గరలోని షాపులకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇక కూరగాయలకు మాత్రం మొబైల్‌ వాహనం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే  నార్సింగి రాజపుష్ప పరిధిలో పాజిటివ్‌ కేసు నమోదైన సమయంలో కేవలం కొద్ది మందిని మాత్రమే అనుమతించి నిత్యావసర సరుకులు తెచ్చుకునేలా ఏర్పాట్లుచేశారు. ఆ వాహనం వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయనున్నారు. క్లస్టర్‌ జోన్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ నోడల్‌ అధికారిగా నియమించి ఇంటింటి సర్వే పూర్తి చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీస్‌, వైద్య శాఖ సంయుక్తంగా కంటైన్‌మెంట్‌ జోన్లను పర్యవేక్షిస్తున్నారు. క్వారంటైన్‌లో చికిత్స పొందిన వారు ఇంటి దగ్గర మరో 14 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి సూచించారు. నందిగామ మండలంలో కరోనాతో మహిళ మృతి చెందడం, మరో వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో మరో 56 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో 17మందికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రావడంతో వారి గ్రామానికి పంపించారు. కలెక్టర్‌ చేగూరును శుక్రవారం సందర్శించి, పారిశుద్ధ్య పనులు, లాక్‌డౌన్‌ వివరాలు సర్పంచ్‌ సంతోష విఠల్‌ను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు పాటించకుండా ఎవరైన ఇంటి నుంచి బయటకొస్తే రూ. 500నుంచి రూ. 1000వరకు జరిమానా విధించాలని ఆదేశించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని డిప్యూటీ డీఎమ్‌హెచ్‌ఓ చందు నాయక్‌కు సూచించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.