శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Apr 11, 2020 , 02:30:19

బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

  • త్వరలోనే ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రిని కలుస్తాం
  • ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి,  జైపాల్‌యాదవ్‌
  • వడగండ్ల వానతో నష్టపోయిన  ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ / ఇబ్రహీంపట్నంరూరల్‌/ ఆమనగల్లు, నమస్తే తెలంగాణ/మాడ్గుల/కొత్తూరు : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులందరిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక అంతంతమాత్రంగానే పంటలు వేశారని, అవి కూడా వడగండ్ల వానతో పాడయిపోయాయని అన్నారు. నియోజకవర్గంలో 7650 ఎకరాల్లో వరి వేయగా సుమారు వెయ్యి ఎకరాల్లో చేతికొచ్చిన పంట నేలపాలైందన్నారు. దీంతో వరి వేసిన రైతులు 608 మంది, కూరగాయలు వేసిన 500 మంది నష్టపోయారన్నారు. మూడు రోజులుగా కురిసిన వడగండ్ల వానతో నియోజకవర్గంలో వరి, మామిడి, కూరగాయల పంటలకు అపార నష్టం కలిగిందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్‌ వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రవంతి, వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు సుధాకర్‌, ప్రసన్నలక్ష్మీ నరేశ్‌, సుజాత రవీందర్‌, వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ, ఏఓ వరప్రసాద్‌రెడ్డి, ఏఈఓలు శ్రావణ్‌, రఘు పాల్గొన్నారు. 

ఆమనగల్లులో..

ఆకాల వర్షం రైతులకు అంతులేని నష్టం చేకుర్చిందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మూడు రోజులుగా ఆమనగల్లు బ్లాక్‌ మండలాల్లో వడగండ్ల వానతో వరిపంట తీవ్రంగా దెబ్బతిన్నది. గురువారం రాత్రి కురిసిన వడగండ్లకు ఆమనగల్లు మండలంలోని రాంనుంతల, కోనాపుర్‌, కడ్తాల మండలంలోని ఏక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామ శివారుల్లోని వరిపంట దెబ్బతిన్నది. శుక్రవారం ఎమ్మెల్యేతో కలిసి ఎంపీపీ అనితావిజయ్‌, జడ్పీటీసీ అనురాధ, ఎంపీటీసీ సరిత క్షేత్రస్థాయి పర్యటన చేసి వరి పంటను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న వరి కంకులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.  సీఎం కేసీఆర్‌ రైతులకు ఇబ్బందులు కలుగకుండా నష్టపరిహారం అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో దెబ్బతిన్న వరిపంట పూర్తి వివరాలు సేకరించి నష్టపరిహారంపై కలెక్టర్‌కు నివేదించాలని వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు అర్జున్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు తోట గిరి, శ్రీను, పంతూ, విజయ్‌, రాములు, నరేందర్‌, రమేశ్‌ పాల్గొన్నారు. మాడ్గుల మండలంలోని సుద్దపల్లిలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటను ఏఈఓ భూదేవి, సర్పంచ్‌ వెంకటేశ్వర్లుగౌడ్‌ రైతులు పరిశీలించారు. కొత్తూరు మండలంలో మొత్తం 120 మంది రైతులకు చెందిన 93 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారి గోపాల్‌ తెలిపారు. ఇన్ముల్‌నర్వ, కొత్తూరు, పెంజర్ల గ్రామాలను జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి గోపాల్‌, సర్పంచ్‌ వసుంధర, ఎస్బీపల్లి మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్‌ భీమయ్య, ఏఈఓ దీపిక సందర్శించారు.