శుక్రవారం 05 జూన్ 2020
Rangareddy - Apr 03, 2020 , 01:33:28

ఉపాధి .. రెండింతలు

ఉపాధి .. రెండింతలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పనుల ప్రణాళిక 2020-21ను జిల్లా యంత్రాంగం విడుదల చేశారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరానికి 80.33 లక్షల మేర పని దినాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 50.48 లక్షల పని దినాలు ఉంటే ఇప్పుడు రెండింతలు పెరిగింది. అంటే దాదాపుగా 29.85 లక్షల పనిదినాలు అధికంగా కల్పించారు. గతేడాది 75% లక్ష్యాన్ని సాధించారు. 90% వరకు అవకాశాలు ఉన్నప్పటికీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె, కరోనా వైరస్‌ వ్యాప్తితో గతేడాది పని దినాల లక్ష్యం మార్చి 31తో ముగిసింది. జిల్లాలో 1.39 లక్షల జాబ్‌ కార్డులుండగా.. 2.50లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. 

ప్రతి కూలీకీ వందల రోజుల పని

ప్రతి ఒక్క కూలీకి వంద రోజులు పని కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో 20, మార్చిలో 25, ఏప్రిల్‌, మేలలో 30, జూన్‌లో 20% అదనపు కూలీ చెల్లించనున్నది. జిల్లాలో నెల రోజులుగా ఆశించిన స్థాయిలో పనులు జరుగకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడ్డారు. వేసవి ప్రారంభంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెకు దిగడం, వారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం లాంటి ఘటనలు జరిగాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేసిన తర్వాత వారి పనిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. కరోనా నేపథ్యంలోనే మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో పనులు మందగించాయి. ఉపాధి హామీ పనులకు హజరయ్యే కూలీలకు రోజుకు రూ.211 అందజేస్తున్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో దీనికి అదనంగా మరో రూ.20లను కేంద్రం ప్రభుత్వం పెంచింది. 

టార్గెట్‌  .. పని దినాలు 

ఈ ఆర్థిక సంవత్సరానికి 80.33 లక్షల పని దినాలు కల్పించాలని జిల్లా డీఆర్‌డీఏ అధికారులకు ప్రభుత్వం టార్గెట్‌గా నిర్ణయించింది. గతేడాది 50.48 లక్షల పని దినాలు కల్పించాలని అనుకుని, 75% పనులు చేశారు. గతేడాదితో పోల్చితే 29.85 లక్షల పనిదినాలు అధికంగా కేటాయించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గణనీయంగా పెరుగడంతో ప్రభుత్వం జిల్లాలో పని దినాల టార్గెట్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం రెండేండ్లుగా పని దినాలు పెంచుతూ వస్తున్నది. కూలీ డబ్బును గతంలో ఉన్న రూ.205 నుంచి 211లకు పెంచిన విషయం తెలిసిందే. 

132 మంది ఫీల్డ్‌ అసిసెంట్లు సస్పెండ్‌..

జిల్లాలోని 21 మండలాల్లో కూలీలకు పనులు కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం 18 మండలాల్లోనే పనులు జరుగుతున్నాయి. ఇటీవల ఫీల్డ్‌ అసిసెంట్లు సమ్మెకు దిగ్గారు. 15 రోజులకు పైగా వారు విధుల్లో చేరకపోవడంతో జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో 132 మందిని విధుల్లో నుంచి తొలగించారు. వారం రోజుల క్రితం తాము విధుల్లో చేరుతామని ఎంపీడీవోలకు రాత పూర్వకంగా వారు రాసి ఇచ్చారు. ఇంకా వీరి చేరికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీరి పనులను పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో చేయిస్తున్నారు. 

మందకొడిగా పనులు 

కరోనా వ్యాప్తితో ఉపాధి హామీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. గ్రామాల్లో ఉపాధి పనులు చేయాడానికి కూలీలు ఆసక్తి చూపుతున్నారు. కానీ వైరస్‌ భయంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మాస్క్‌లు ధరించి పనులు చేస్తున్నారు. డీఆర్డీఏ తరఫున మాస్క్‌ల పంపిణీ, ఇతర చర్యలు తీసుకోకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. సామాజిక దూరం పాటించి పనులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. రెండు రోజులుగా కూలీలు ఉదయం, సాయంత్రం వేళ్లలో పనులు చేస్తున్నా కొన్ని చోట్ల పోలీస్‌ యంత్రాంగం నిలిపేయాలని సూచిస్తున్నారు. 

ప్రతి కూలీకి పని కల్పించడమే లక్ష్యం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కూలీలందరికీ ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది చెరువుల పూడికతీత, భూ అభివృద్ధి పనులు, హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత నివ్వనున్నాం. అర్హులైన ప్రతి కూలీకి వంద రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. వేసవిలో కూలీలకు అదనంగా వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.


- ప్రశాంత్‌కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి 


logo