బుధవారం 03 జూన్ 2020
Rangareddy - Mar 30, 2020 , 00:28:15

నిశ్శబ్దం.. సడలని సంకల్పం

నిశ్శబ్దం.. సడలని సంకల్పం

  • గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
  • పేదలకు నిత్యావసర వస్తువుల అందజేత
  • స్వీయ  నిర్బంధంలో ప్రజలు

ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ / ఇబ్రహీంపట్నంరూరల్‌/ మంచాల : లాక్‌డౌన్‌ను కఠితరం చేస్తూ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం మరింత కట్టడి చేశారు. సాగర్‌ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్‌, ఆదిబట్ల, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీల పరిధిలో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన వాహనాల నంబర్లను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఒక్కసారి కంటే ఎక్కువ రోడ్డుపైకి అదే వాహనం వచ్చినట్లయితే సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్‌ స్నేహామెహరా ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు అంబేద్కర్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. అత్యవసరమైన వాహనాలు తప్ప ఇతరులు ఎవరు రోడ్ల మీదకు వచ్చినా వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు.  ఆదివారం వాహనాల తనిఖీని పకడ్బందీగా అమలు చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన శ్రీనివాస్‌గుప్త పోలీసు, మున్సిపల్‌ సిబ్బందికి ఆదివారం భోజన సౌకర్యం కల్పించారు. 

ఆదిబట్ల : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వీలు లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో అన్ని గ్రామాలు, కాలనీల్లో నిశ్శబ్దం నెలకొంది. ఆదిబట్ల మున్సిపాలిటీ, ఐటీ కారిడార్‌లో వేలాది వాహనాలతో ప్రతి నిత్యం వాహనాలు, ప్రజలతో కిటికిటలాడుతూ ఉండేది.ఎనిమిది రోజులుగా ఎక్కడా చూసినా నిశ్శబ్దం నెలకొంది. టీసీఎస్‌, టాటాఏరోస్సేస్‌, టాటాలాకిడ్‌ మార్టిన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు మూతపడ్డాయి. బొంగుళూర్‌ ఔటర్‌ రింగు రోడ్డు, టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కానరావడం లేదు.పోలీసులు బొంగుళూర్‌ వద్ద చెక్‌పోస్టును ఏర్పాటు చేసి అవసరం లేకున్నా బయటకు తిరిగేందుకు వచ్చే వాహనాలను కట్టడి చేస్తున్నారు. ఆదిబట్ల, బొంగుళూర్‌, కొంగరకలాన్‌, ఎంపీపటేల్‌గూడ, మంగల్‌పల్లి, రాందాస్‌పల్లి గ్రామాల్లో  ముమ్మరంగా పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. గ్రామాలు, కాలనీల్లో రోడ్లపై తిరుగుతున్న, కూర్చున్న వారికి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. ఎలిమినేడు, ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లో  జనసంచారం కన్పించడం లేదు. ఉదయం వేళ పాలు, కూరగాయలు, నిత్యావసర సరకులు తెచ్చుకుంటున్నారు. కిరాణ దుకాణాల ఎదుట సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. 

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని ఏసీపీ శ్యామ్‌బాబు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇండ్ల నుంచి బయటకు వచ్చి వ్యక్తిగత పనులు పూర్తయిన వెంటనే ఇంటికి చేరుకోవాలని ఏసీపీ కోరారు. ఆదివారం ఆమనగల్లు పట్టణంలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమనగల్లు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయలు,పండ్ల మార్కెట్‌ను ఆయన సందర్శించి, చిరువ్యాపారులకు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి క్రయవిక్రయాలు జరపాలని, తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు. అనంతరం పట్టణంలో పెట్రోలింగ్‌ను పర్యవేక్షించారు. శాంతిభద్రతలు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్‌ఐ ధర్మేశ్‌కు సూచించారు.ఆమనగల్లు -హైద్రాబాద్‌ శ్రీశైలం ప్రధాన రహదారి బోసిపోతుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తమ ఇంటికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం కాలనీల్లో ముమ్మరంగా క్రిమిసంహారక మందులను పిచికారి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ శుచి, శుభ్రత పాటించాలని, శానిటేషన్‌, మాస్కులను వినియోగించాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్‌పౌడర్‌ను వేసి శుభ్రం చేస్తున్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీలు క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించి  ప్రజలను చైతన్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

కడ్తాల్‌ : కరోనా వైరస్‌ నివారించేందుకు ప్రజలు ఇండ్లలో స్వీయ నిర్బంధంలో ఉండాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ కోరారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీటీసీ పర్యటించి, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. 

మాడ్గుల : ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం కొనసాగించాలని ఎంపీఓ లక్ష్మారెడ్డి కోరారు. గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు పాటించాలని కోరారు. జర్పులతండాలో సర్పంచ్‌ హీరాదేవి, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్‌ ఆధ్వర్యంలో రెండు వేల కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. 


logo