మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Mar 23, 2020 , 00:07:22

కరోనాను ఖతం చేద్దాం..

కరోనాను ఖతం చేద్దాం..

  • జిల్లా అంతటా ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ
  • ప్రధాని, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఇండ్లలోనే ఉన్న జిల్లా ప్రజానీకం
  • నిర్మానుష్యంగా మారిన రోడ్లు
  • ఖాళీగా దర్శనమిచ్చిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
  • కరోనాను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు
  • పట్టణాలు మొదలుకొని గ్రామాల వరకు ప్రజలంతా చప్పట్లతో సంఘీభావం
  • కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద గట్టి భద్రత

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా ప్రజానీకం తమ ఐక్యతను చాటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో దేశ ప్రధాని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు జిల్లా ప్రజలంతా ఇండ్లకే పరిమితమై దేశం కోసం మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా జిల్లా ప్రజలంతా వంద శాతం ఇండ్లలోనే ఉండి సంపూర్ణ కర్ఫ్యూ పాటించారు. జిల్లాలోని పట్టణాలు మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రజలంతా బయటకు రాకుండా కరోనా మహామ్మారిని తరిమికొట్టడంలో ఏకతాటిపై నిలిచారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మినహా ఏ ఒక్కరూ బయటకు రాకుండా జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, పల్లెల్లో కూడా కరోనా వైరస్‌పై ప్రజలు తమ ఐక్యతను చాటి యుద్ధం ప్రకటించారు. మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఎంతగానో కృషి చేస్తున్న వైద్యసిబ్బందికి జిల్లా ప్రజలు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. అయితే కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో  కలెక్టర్‌ పౌసుమి బసు, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, పరిగి పట్టణంలో ఎస్పీ ఎం.నారాయణ, నగరంలోని తన నివాసంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, అలాగే జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి తన నివాసంలో చప్పట్లతో వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాలు మొదలుకొని మారుమూల గ్రామాల ప్రజలు కూడా సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఇంటి బయటకు వచ్చిన గంటా బజాయించి హర్షం వ్యక్తం చేశారు. అలాగే జనతా కర్ఫ్యూ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌  మోతీలాల్‌ దోమ మండల కేంద్రాన్ని సందర్శించారు. అదేవిధంగా జనతా కర్ఫ్యూతో జిల్లాలోని రహదారులన్నీ నిర్మూనుష్యంగా మారాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఖాళీగా దర్శనమివ్వగా, ఏ ఒక్క ప్రైవేట్‌ వాహనం కూడా బయటకు రాలేదు. అంతేకాకుండా కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన రావులపల్లి, కొత్లాపూర్‌, మైల్వార్‌ చెక్‌పోస్టుల వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. ఏ ఒక్క వాహనం జిల్లాలోకి ప్రవేశించకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తూ అక్కడక్కడా బయటకు వచ్చిన వారికి ఇండ్లలోకి వెళ్లాలని సూచించారు.