శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 23, 2020 , 00:00:37

31 వరకు లాక్‌డౌన్‌

31 వరకు లాక్‌డౌన్‌

  • ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని ప్రభుత్వ ఆదేశం
  • ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు తిరగొద్దు
  • వ్యాపార సముదాయాలు, వైన్స్‌ షాపులు, మాల్స్‌ మూసేయాల్సిందే
  • నిత్యావసరాలు, అత్యవసర సేవలకు మినహాయింపు
  • జిల్లాలో 4వేల పరిశ్రమలు.. 7 లక్షల మందికి పైగా విధుల నిర్వహణ
  • ప్రైవేటు ఉద్యోగులకూ వేతనం చెల్లించాల్సిందే..
  • గర్భిణులకు అందుబాటులో వైద్యసేవలు
  • అత్యవసర శస్త్రచికిత్సలు మినహా అన్ని బందే..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 31 వరకు జిల్లాను లాక్‌డౌన్‌ ప్రకటించారు. జిల్లా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించింది. అత్యవసరా వస్తువుల కోసం బయటకు వేళ్లేందుకు కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన జిల్లా ప్రజలు వచ్చే వారం రోజులు కూడా కీలకంగా మారాయి. చప్పట్లతో అద్భుతంగా సంఘీభావం సంకేతాన్ని, ఐక్యతను, విజ్ఞతను చాటి చెప్పిన జిల్లా ప్రజలు మార్చి 31 వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక నుంచి జిల్లాలో ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. మనం కోసం మనం.. జనం కోసం. అందరి కోసం అందరమన్నారు. ఆదివారం చూపెట్టిన పట్టుదలనే 31 వరకు కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు అందరూ హాజరు కావాలని సూచించింది. వారం రోజుల పాటు ఒప్పంద,అవుట్‌ సోర్స్‌ కార్మికులకు వేతనం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్‌ కాలంలో ప్రైవేట్‌ ఉద్యోగులకు  కూడా వేతనం చెల్లించాల్సిందేనని పేర్కొంది.1897 యాక్ట్‌ ప్రకారం బిల్డింగ్‌, ఇతర ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు,కూలీలకు ప్రభుత్వం,యజమాని జీతం చెల్లించాలని ఆదేశించింది. అయితే విద్యుత్‌, వైద్యశాఖ, ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ నెలలో కాన్ఫులు జరిగే మహిళలకు సదుపాయాలు ఏర్పాటు చేశారు. అత్యవసర శస్త్రచికిత్సలు తప్ప మిగతావి చేయవని ప్రభుత్వం పేర్కొంది. జిల్లాలో 4వేలకు పైగా  పరిశ్రమలు ఉన్నాయి.వీటిలో 7లక్షల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఫైన్షానియల్‌ డిస్ట్రిక్‌, ఐటీ కారిడార్‌, పీబీవో, కేపీవో వీటితో పాటు జిల్లాలో చిన్న, పెద్ద తరహా పరిశ్రలు సైతం ఉన్నాయి. వీరందరికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వేతన జీవులకు ఊరట లభించింది.  ఇంటి అవసరాల కోసం కావాల్సిన పాలు,కూరగాయలు కోసం మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లాక్‌ డౌన్‌తో ఆఫీసులు,పరిశ్రమలు, దుకాణాలు,వైన్‌షాపులు,మాల్స్‌, అన్ని మూతపడనున్నాయి. ఎప్పటిలాగానే స్కూళ్లు, కాలేజ్‌లు, జీమ్స్‌, పబ్‌లు, బార్లు, స్విమ్మింగ్‌పుల్‌ తెరుచుకోవు. మద్యం షాపులు  మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోనుంది. ఆర్టీసీతో పాటు ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేట్‌ వాహనాలు  రోడ్డెక్కవు. ఇన్ని రోజులు బంద్‌ ఉంటే ప్రజలు ఇబ్బందులు పడుతారని ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు,అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. వాటి విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియేట్‌ పేపర్‌ వాల్యూవేషన్‌ చేసేవారిని కూడా రిలీవ్‌ చేశారు. 

ప్రజా రవాణా బంద్‌ 

జిల్లాలో లాక్‌డౌన్‌తో ప్రజారవాణా వ్యవస్థ బంద్‌ కానుంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు,రైళ్లు,ప్రైవేట్‌ బస్సులు, లారీలు, డీసీఎంలు,ఆటోలు,ట్యాక్సీలు ఎటువంటి వాహనాలు రోడ్డు ఎక్కొద్దని ఆదేశాలు జారీ చేశారు. 31 వరకు అన్ని రకాల వాహనాలు బంద్‌ చేయనున్నారు. ఐదుగురు కంటే ఎక్కువ ఎవరూ రోడ్డు మీద కు రాకూడదు.కేవలం నిత్యావసర సరుకులు తెచ్చే గూడ్స్‌ వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లినా మనిషికి, మనిషికి మధ్య 3 ఫీట్ల దూరం పాటించాలని ఆదేశాలిచ్చారు. ప్రింట్‌,ఎలక్ట్రానిక్‌ మీడియాకు అనుమతించారు.జిల్లాలో నిత్యావస సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టిస్తే..ఎక్కడైనా,ఎవరైనా ధరలు పెంచి సరుకులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు. లాక్‌ డౌన్‌ ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. నిత్యావసర సరుకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌,జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌కుమార్‌,ప్రతీక్‌జైన్‌,ఇతర శాఖల అధికారులు లాక్‌డౌన్‌ సిద్ధం అయ్యారు. 

4వేలకు పరిశ్రమలు..7లక్షల కుటుంబాలు..

జిల్లాలో 4వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి.వీటిలో 7లక్షల మందికి పైగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఫైన్షానియల్‌ డిస్ట్రిక్‌,ఐటీ కారిడార్‌,పీబీవో,కేపీవో వీటితో పాటు జిల్లాలో చిన్న,పెద్ద తరహా పరిశ్రలు సైతం ఉన్నాయి. వీరందరీకి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఊరట లభించింది. 

జిల్లాలో జనతా కర్ఫ్యూ ప్రశాంతం

షాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో జనతా కర్ప్యూ విజయవంతంగా కొనసాగింది. ఆదివారం ఉదయం గ్రామాల్లో పోలీసులు సైరన్‌ మోగించి ఇండ్ల నుంచి ఎవరు కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.  జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, కల్వకుర్తి, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో బస్టాండ్‌లన్ని బోసిపోయాయి. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. రోడ్లపైన జనాలు కనిపించకపోవడంతో రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఇండ్ల వద్దనే టీవీలు చూసుకుంటు కాలక్షేపం చేశారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో పోలీసులు మరోసారి సైరన్‌ వేయడంతో 5గంటలకు కరోనా వైరస్‌ నివారణకు నిరంతరం పనిచేస్తున్న వారికి మద్ధతుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు ఇండ్ల ముందు నిలబడి చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటిస్తామని ప్రజలు తెలిపారు. 

ఇదే తరహా స్ఫూర్తితో ముందుకెళ్లాలి : సబితారెడ్డి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలను ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వైద్యులకు సంఘీభావంగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో కలిసి మంత్రి సబితారెడ్డి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం మంత్రి సబితారెడ్డి ఇంటికి  పరిమితం అయ్యారు. సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన హైలెవల్‌ మీటింగ్‌కు హాజరై అనంతరం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌, సహచర మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టారు. మార్చి 31వరకు ఇదే తరహా స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వ్యాధి ప్రబల కుండా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన లాక్‌డౌన్‌ను ప్రజలు సహకరించాలని అన్నారు. రోజు వారీ కూలీలకు నెలరోజులకు సరిపడే బియ్యం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. 12 కిలోల బియ్యాన్ని ఒక్కొక్కరికి అందజేస్తారని మంత్రి తెలిపారు. ప్రతి రేషన్‌ కార్డుకు రూ.1500లను ఇవ్వనుండటంతో ఈ  కాలంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో ప్రైవేట్‌ సంస్థలల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ,ఆదివారం లాగే రానున్న 31 వతేదీ వరకు ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి బయటకు రావొద్దని మంత్రి సబితారెడ్డి కోరారు.

జనహితం కోసం జనతా కర్ఫ్యూ

  • డాక్టర్‌ రంజిత్‌రెడ్డి , చేవెళ్ల ఎంపీ 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు స్వచ్ఛందంగా జిల్లా ప్రజలు కర్ఫ్యూలో పాల్గొనడం అభినందనీయమని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారించేందుకు కృషి చేస్తున్న వైద్యులకు,పోలీస్‌ అధికారులకు,పారిశుద్ధ్య కార్మికులకు,ఆశా వర్కర్లకు పేరు పేరునా కృతజ్ఞతాభినందనలు తెలుపున్నట్లు ప్రకటించారు.logo