శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 21, 2020 , 23:23:01

24 గంటలు ఇంట్లోనే ఉందాం..

24 గంటలు ఇంట్లోనే ఉందాం..

  • కరోనా వైరస్‌ వ్యాప్తిని సంకల్పబలంతో  కట్టడి చేద్దాం
  • నేడు ఉదయం 6 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 6 వరకు జనతా కర్ఫ్యూ
  • చాటింపు, ఫ్లెక్సీలు, ర్యాలీలతో అవగాహన
  • వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేతకు నిర్ణయం
  • వారాంతపు సంతలూ బందే
  • ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపుతో స్పందిస్తున్న ప్రజలు 
  • అన్ని పార్టీలు.. ప్రజాసంఘాల మద్దతు 

కరోనాను నివారించేందుకు స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష, ఇంట్లోనే ఉందాం కరోనాను తరిమికొడదాం అని ప్రధానమంత్రి నరేంద్రమోడి, సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో నేటి ఉదయం 6 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 6 వరకు  జనతా కర్ఫ్యూకు మద్దతిచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు, పార్టీలు, ప్రజాసంఘాలు సబ్బండవర్గాలు బంద్‌ను స్వచ్ఛందంగా పాటించాలని నిర్ణయించాయి. కర్ఫ్యూ సందర్భంగా ఒక రోజు ముందుగానే నిత్యావసర సామగ్రిని కొనుగోలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో ఎవరైనా అనుమానితులుంటే ఇండ్లలోనే ఉంచి 14 రోజులు హోం క్వారంటైన్‌ చేస్తున్నారు. కరోనా వ్యాధి నివారణకు కృషి చేస్తున్న వారికి నేటి సాయంత్రం 5 గంటలకు ఇంటి వాకిళ్ల ఎదుట, కిటికీలు, బాల్కానీ వద్ద నిల్చొని చప్పట్లు కొట్టి   కృతజ్ఞతలు తెలుపాలని పీఎం, సీఎం సూచించారు. 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆదివారం ఉదయం 6నుంచి సోమవారం ఉదయం 6వరకు కుటుంబ సభ్యులతో సహా ప్రజలు ఇండ్లలోనే ఉండి, కరోనాపై స్వీయనియంత్రణ పాటించేందుకు అందరూ ఏకమయ్యారు. దీనికితో డు వ్యాపార, వాణిజ్యవర్గాలు జిల్లా మొత్తం బంద్‌ను పాటించాలని నిర్ణయించాయి. ఇప్పటికే గ్రామ గ్రామాన జిల్లా అధికా ర యంత్రాంగం చాటింపు చేయించి, అవగాహన కల్పిస్తున్నది. ప్రజలను అప్రమత్తం చేసింది... దేశ, విదేశాల నుంచి వచ్చిన వారిపై అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిం చి, వైరస్‌ సోకకుండా గుంపులుగా ఉండొద్దని పెండ్లిండ్లు, ఇతర ఫంక్షన్లకు  దూరంగా ఉండి స్వీయ నియంత్రన పాటించాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు ఇలాంటి స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష ..అని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా సై.. అంటూ కదం తొక్కుతున్నారు. జిల్లా పరిధిలోని వ్యాపార, వాణిజ్యవర్గాలు బంద్‌ను పాటించి జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలుపాలని నిర్ణయించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో సహా బీజేపీ, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు సబ్బండవర్గాలు మద్దతు తెలిపాయి. మానవాళి మనుగడకు పెనుముప్పుగా మారిన కరోనా వైరస్‌ దరి చేరకుండా ప్రతి పౌరుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రధాని, ముఖ్యమంత్రి ప్రజలకు వివరించిన విషయం తెలిసిందే. ప్రతి పల్లె, పల్లెనా జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాతో అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది.

ముఖ్యంగా ప్రజలెవరికివారే స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు ప్రజలను మేల్కొలిపింది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ జిల్లా దరిచేరకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని ఇండ్లలోనే ఉంచి ‘14రోజులు హోం క్వారంటైన్‌' చేస్తున్నారు. ప్రతి వ్యక్తి సమాచారం సేకరించి ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటికే జిల్లా, మండలస్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటయ్యాయి. మరోవైపు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఇంటలిజెన్స్‌ అధికారులు గ్రామాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. గ్రామానికి ఒక పోలీస్‌ అధికారిని నియమించారు. కొత్త వ్యక్తుల గ్రామానికి వచ్చిన వెంటనే సమాచారం సేకరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించి సంబంధిత జిల్లా అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. వెంటనే వైద్య, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని సందర్శించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరిని గాంధీ దవాఖానకు పంపించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామ, గ్రామాన పారిశుద్ధ్య పను లు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వశాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ప్రజలు గుమికూడి ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నెల 31వరకు బార్లు, సినిమా థియేటర్లు బంద్‌ పొడిగించింది. దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేశారు. యథాతథంగా ఆలయాల్లో పూజలు నిర్వహించి బంద్‌ను పాటిస్తున్నారు. కేవలం ఇండ్లలో మాత్రమే నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ఇలా సబ్బండవర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునకు స్పందించి సహకరిస్తున్నాయి. 

జనతా కర్ఫ్యూతో అందరికీ మేలు చేస్తున్నది. ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడదాం.. ఉదయం 6గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు 24 గంటలు మనమంతా ఇంట్లోనే ఉండాలి. దేశ ప్రధాని..రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో ఇచ్చిన పిలుపు.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జనతా కర్ఫ్యూ విధించడం ఇదే మొదటిసారి. దీన్ని ప్రతిఒక్కరూ తప్పకపాటించాల్సిన సందర్భం. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని సంకల్ప బలంతోనే సమిష్టిగా కట్టడి చేయగలమని ఇప్పటికే ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. సెలవు వచ్చిందంటే చాలు పిల్లలు మొదలుకొని అందరూ ఉదయం మొదటగా వెళ్లేది ఆట స్థలం పార్కు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బయటికి వెళ్లే పరిస్థితి లేదు. కరోనా అందరినీ భయపడుతోంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లోనే మాస్కులు ధరించడం...ఇతర ముందస్తు స్వీయ రక్షణ తీసుకుంటుండగా..పల్లెలోనూ దీని నివారణకు ముందస్తు తీసుకున్నారు. ఉరుకులపరుగుల జీవితంలో కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఎవరి ఉద్యోగ బాధ్యతల్లో వారు, చదువుల పేరుతో పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడున్నా సెలవులు, ఇంటినుంచే పని అనే వెసులుబాటు నేపథ్యంలో అందరూ ఇండ్లకే చేరుకున్నారు. కరోనా భయంతో అం దరూ అప్రమత్తంగా ఉంటున్నారు. బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యులు, దవాఖాన సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, రైలు, బస్సులు, ట్యాక్సీలు, హోం డెలీవరీ తమ ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి ఇతరుల సేవలో మునిగిపోతున్నారు. వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నప్పటికీ వారు సమాజంలో పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాలని జిల్లాకలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. పెట్రోల్‌ బంక్‌లు, బస్సులు, రైళ్లు, వైన్‌షాపులు, మటన్‌ షాపులు బంద్‌ పాటించనున్నాయి. అలాగే ఇంటర్‌ స్పాట్‌ వాల్యూవేషన్‌కు వెళ్లాల్సిన 500మంది సిబ్బందిలో 200మంది మాత్రమే పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు కూడా సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా కర్ఫ్యూను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 


logo