గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 21, 2020 , 00:41:14

వన్యప్రాణుల దాహం తీర్చేలా

వన్యప్రాణుల దాహం తీర్చేలా

  • అటవీ ప్రాంతంలో సాసర్‌ ఫిట్‌ల నిర్మాణం
  • ట్యాంకర్లతో నీటిని నింపుతున్న అధికారులు
  • వేసవిలో దాహం తీర్చుకుంటున్న మూగజీవాలు

వేసవి కాలం మూగజీవాల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాచారం మండలం తాడిపర్తి ఫారెస్టులో సాసర్‌ ఆకారంలో నీటి గుంతలను నిర్మించి వాటిలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపుతున్నారు. ఎక్కువ లోతు లేకుండా, జీవాలు అందులో దిగినా ఎటువంటి ప్రమాదం జరుగుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

యాచారం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఫారెస్ట్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. మండలంలోని తాడిపర్తి ఫారెస్ట్‌లో సాసర్‌ పిట్‌లు నిర్మించారు. సాసర్‌ పిట్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. నింపిన నీటిని నిత్యం తాగుతూ పక్షులు, జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే అటవీ ప్రాంతాల్లో జీవించే మూగ జీవాలు నీటికోసం అల్లాడుతాయి. ఎక్కడ చెరువులు, కుం టలు, బావులున్నాయో అక్కడికి వలసవెళ్తాయి. కానీ మండలంలో సరిపడా వర్షాలులేక నీటి సమస్య జఠిలమైంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మూగజీవాలకు తాగునీటి సమస్య తలెత్తుతుంది. దీంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను సంరక్షించడానికి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. అటవీ జంతువులు సంచరించే స్థలాలు, నివసిం చే ప్రాంతాల్లో నీటి నిల్వ గుంతలను నిర్మిస్తున్నారు. వన్య ప్రాణులకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా, అందులోకి దిగినా ఆపద తలెత్తకుండా సాసర్‌ మాదిరిగా నీటి గుం తను ఏర్పాటు చేశారు. పాతవాటికి సైతం మరమ్మతులు చేసి నీటితో నింపుతున్నారు. మొత్తం 38 సాసర్‌ పిట్‌లను అధికారులు నిర్మించారు. తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ట్యాంకర్‌ ద్వా రా నీరు నింపుకుని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి గుంతల్లో నింపుతున్నారు. తాడిపర్తి, కుర్మిద్ద అటవీ ప్రాంతం లో తాటికుంట, చిన్నతాటికుంట, వెంకటాయకుంట, పందికుంట, గండికుంటలో ప్రస్తుతం నీళ్లున్నప్పటికీ అదనంగా 16 సాసర్‌పిట్లను నిర్మించారు. ఒక్కో సాసర్‌పిట్‌లో 3వేల లీటర్ల నీటిని నింపుతున్నారు. వారానికి 20ట్యాంకర్ల నీటిని వన్యప్రాణుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో వన్య ప్రాణులు వేసవిలో నీటికోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ దాహాన్ని తీర్చుకుంటున్నాయి. మండలంలో తాడిపర్తి, నానక్‌నగర్‌, కుర్మిద్ద, గున్‌గల్‌, గడ్డమల్లాయగూడ, నల్లవెల్లి, కొత్తపల్లి, మేడిపల్లి, మంథన్‌గౌరెల్లి తదితర గ్రామాలు శివారులో వేల ఎకరాల్లో ఫారెస్టు ఉంది.  ఫారెస్టు శివారులో ఉన్నాయి. ముఖ్యంగా తాడిపర్తి క్లసర్‌ తాడిపర్తి, కుర్మిద్ద, కడ్తాల్‌, ఎక్వాయపల్లి గ్రామాలలో 16,220 హెక్టార్లలో అటవీ భూములున్నాయి. 


logo
>>>>>>