బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 21, 2020 , 00:33:58

ఎవరెవరొచ్చారు.. ఎక్కడున్నారు..?

ఎవరెవరొచ్చారు.. ఎక్కడున్నారు..?

 • జిల్లాకు వచ్చిన విదేశీయుల వివరాలు సేకరిస్తున్న అధికారులు
 • ప్రతి రోజూ సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది 
 • శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పర్యటన
 • అనుమానిత ఇండ్ల చుట్టూ 50 ఇండ్లలో సర్వే, అవగాహన
 • 14 రోజులు హోం క్వారంటైన్‌లోనే.. 
 • సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా చేతిపై ముద్ర 
 • వైన్‌ షాప్‌ పర్మిట్‌ రూంలు మూసివేయాలి 
 • వైరస్‌ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి
 • మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌
 • అన్ని మతాల వారు ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి 
 • క్షేత్రస్థాయిలో జోరుగా పారిశుద్ధ్య పనులు
 • మైకులు, ఫ్లెక్సీలు, కరపత్రాలతో ప్రజలకు అవగాహన

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 1వ తేదీ తరువాత జిల్లాకు వచ్చిన వారు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను రంగంలోకి దించారు. జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చిన వైద్య సిబ్బంది ప్రతి రోజూ సర్వే నిర్వహించి, గుర్తించిన వారి సెల్‌ ఫోన్‌ నెంబర్లు, చిరునామా నమోదు చేసుకుంటున్నారు. బయట నుంచి  శంషాబాద్‌కు వచ్చిన వారితో పద్నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటామని ఎయిర్‌పోర్టులో హామీ పత్రం రాయించుకున్నాకే ఇండ్లకు పంపిస్తున్నారు. మరోవైపు వైద్యాధికారులు,మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా వైరస్‌ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైర స్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన (ఎన్‌ఆర్‌ఐ) వారిని గుర్తించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జల్లెడ పడుతోంది. ఒక వైద్యాధికారి, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎం ఆశాలతో కూడిన రాపిడ్‌ రెస్పా న్స్‌ టీమ్‌లను ఇందుకు నియమించారు. ఇవి ఎన్‌ఆర్‌ఐలను గుర్తించి వారికి వైద్య పరీక్షలతోపాటు బయటకు రా కుండా ఐసోలేషన్‌ చేస్తోంది. ప్రధానంగా జిల్లాలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో ప్రతి రోజూ వందలమంది విదేశీ ప్రయాణికులు జిల్లాకు వస్తున్నారు. మార్చి 1నుంచి వివిధ దేశాల నుంచి వచ్చినవారి వివరాలను జిల్లావ్యాప్తంగా సేకరించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. వారికి వ్యాధి నిర్ధారణ కాకున్నా 14రోజుల పాటు ఇల్లు వదిలి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. పల్లెల్లో ఇంకా ఎక్కడైనా ఉన్నారో కనిపెట్టడానికి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, ఆశావర్కర్లు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతున్నారు. ఎవరైనా విదేశాల నుంచి వచ్చినవారు ఉంటే తెలుపమని గ్రామస్తులను అడుగుతున్నారు. వచ్చినవారి వివరాలను జిల్లా సర్వేలెన్స్‌ విభాగానికి చేరవేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్నవారికి ఎవరికీ వ్యాధి సోకలేదని, వారంతా బాగానే ఉన్నారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వ్యాధి నివారణకు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఆశావర్కర్లతో ఇంటిం టా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఆరా తీస్తున్నారు. జిల్లాలోని శేరిలింగంపల్లి, నార్సింగి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఎల్బీ నగర్‌, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, సరూర్‌నగర్‌, మన్సూరాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జిల్లాకు డిప్యూటేషన్‌పై వచ్చిన వైద్య సిబ్బంది ప్రతిరోజూ ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నారు. అనుమానిత కేసులు నమోదైతే ఆ పరిధిలో ఉన్న చుట్టూ 50ఇండ్లలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారి సెల్‌ఫోన్‌ నెంబర్లు, వారి చిరునామా రికార్డు చేస్తున్నారు. దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు.

14 రోజులు హోం క్వారంటైన్‌లోనే.. 

జిల్లాలో ఇప్పటివరకు 22చోట్ల క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి విదేశాల నుంచి వస్తున్న వారిని గురువారం వరకు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించగా.. శుక్రవారం నుంచి విదేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించకుండా వారి నుంచి అఫిడవిట్‌ తీసుకుని 14రోజులు హోం క్వా రంటైన్‌లో ఉంటామని విమాన ప్రయాణికులు హామీ ప త్రం రాసిస్తున్నారు. ఇలా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చినవారికి ప్రత్యేకంగా చేతిపై ముద్ర వేసి ఇంటికి పం పిస్తున్నారు. ఇప్పటికే గురువారం రాత్రి నుంచి శుక్రవారం 864మంది హోం క్వారంటైన్‌కు పంపంచగా.. నలుగురిని దవాఖానకు పంపించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దాదాపుగా 5 విమానాలు విదేశాల నుంచి వచ్చాయి. కరోనా అనుమానితులను పరీక్షించిన అనంతరం నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన వారిని హోమ్‌ క్వారంటైన్‌ ముద్రవేసి ఇంటికి పంపిస్తున్నారు. 

మున్సిపాలిటీల్లో, గ్రామాలకు ఎవరైనా విదేశాల నుంచి వచ్చారా.. వస్తే వారు ఎక్కడెక్కడ తిరిగారు. వారికి ఏమైనా కరో నా వైరస్‌ లక్షణాలు ఉన్నాయా..? అనే విషయాన్ని తెలుసుకునేందుకు తగిన జా గ్రత్తలు తీసుకునేందుకు స్థానిక పంచాయ తీ సెక్రటరీ, ఏఎన్‌ఎంలు, పంచాయతీ అధికారులు వెళ్లి వారి వివరాలను సేకరించాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. వారికి కరోనా లక్షణాలు తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తే వారిని ఐసోలేషన్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 104నెంబర్‌కు సమాచారం అందించాలి. పంచాయ తీ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు స్థానిక ఎస్‌ఐ, సీఐలతో కలిసి చర్చి, మసీ దు, దేవాలయాల మత పెద్దలతో కలిసి తాత్కాలికంగా వాటిని  మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలందాయి. ఉగాది, శ్రీరామ నవమి, జగనేకి రాత్‌ తదితర ముఖ్య పండుగలను సమాజ రక్షణ (కరోనా వైరస్‌ నివారణకు) కోసం జరుపకుండా మత పెద్దలతో కలిసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని వైన్‌షాప్‌ల పర్మిట్‌ రూంలు మూసివేయాలని ఆదేశాలిచ్చా రు. వారాంతపు జరిగే సంతల్లో ఉదయం 6 నుంచి 7గంటలకు క్లోరినేషన్‌ చేయాలని, ముఖ్యంగా సర్దార్‌నగర్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల మార్కెట్‌లలో క్లోరినేషన్‌ చేయాలని, కరోనా వైరస్‌ నివారణ జాగ్రత్తలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విధంగా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. 

కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి కోవిడ్‌ -19 కరోనా వైరస్‌ నివారణ చర్యలపై మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలెక్టర్‌ అమ య్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ మాట్లాడుతూ ...ఇంటింటికీ సమాచారం కోసం వెళ్లే అధికారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. అదేవిధంగా రోడ్డుపక్కన ఉండే టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లలో సరైన పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే తాత్కాలికంగా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఉన్న అను మానితులను హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించి వైద్యసేవలు అందించాలని అన్నారు. మార్చి 1నుంచి జిల్లాకు వచ్చిన విదేశీ ప్రయాణికులను గుర్తించి వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని అన్నా రు. వైద్యాధికారులు, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనావ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తమ పరిధిలోని వివిధ మతాల పెద్దలతో సమావేశం నిర్వహించి ప్రార్థనాలయాలలో పెద్ద సమూహాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కాకుండా దేశంలోని ఇతర ఎయిర్‌పోర్టుల ద్వారా జిల్లాకు చేరుకున్న వారి వివరాలను అందజేస్తామని, వారి ఇళ్లకు వెళ్లి పూర్తిస్థాయిలో పరీక్షించాలని కోరా రు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్లు పన్నులపై దృష్టి సారించాలని అన్నారు. పన్నులు వసూలుచేసి నిర్దేశిత లక్ష్యాలను మార్చి 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ పద్మజారాణి, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, పీడీడీఆర్డీ ప్రశాంత్‌కుమార్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


logo