శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 20, 2020 , 00:53:20

కోళ్ల పరిశ్రమకు కరోనా దెబ్బ

కోళ్ల పరిశ్రమకు కరోనా దెబ్బ

  • 20వేల కోళ్లు పూడ్చివేత

యాచారం: కరోనా ఎఫెక్ట్‌ కోళ్ల పరిశ్రమకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నది. కరోనా వైరస్‌ కోళ్ల పరిశ్రమ రైతులను కోలుకోకుండా చేస్తున్నది. మార్కెట్లో కోళ్లు, గుడ్ల ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టాలను జీర్ణించుకోలేక చివరకు చేసేదేమిలేక ఆరోగ్యంగా బతికున్న కోళ్లను గోతులు తీసి పూడ్చి పెడుతున్నారు. మండలంలోని తమ్మలోనిగూడ గ్రామంలో కోళ్ల ఫారాలు అధికంగా ఉన్నాయి. బ్యాంకు రుణాల ద్వారా కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకొని రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ విజృంభించడంతో కోళ్ల పరిశ్రమల యజమానులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. మార్కెట్‌లో చికెన్‌ కేజీ రూ.20 ధర పలుకడంతో కోళ్ల పరిశ్రమ విలవిల్లాడుతున్నది. మార్కెట్లో కోళ్లు, గుడ్ల కొనుగోళ్లు లేకపోవడంతో కోళ్లను సాకలేక బతికుండగానే ట్రాక్టర్‌ ద్వారా దూరంగా తీసుకెళ్లి గోతితీసి పూడ్చి పెడుతున్నారు. గ్రామానికి చెందిన దెంది లక్ష్మారెడ్డి, దెంది రాజేందర్‌రెడ్డి, పాల లింగం, మూలి యాదమ్మ.. మరో 20రోజులు పెంచితే అమ్మకానికి సిద్ధమవుతున్న సుమారు 20వేల కోళ్లను గురువారం గోతితీసి పూడ్చిపెట్టారు. దీంతో ఆర్థికంగా ఎంతో నష్టపోయినట్లు పేర్కొన్నారు. బ్యాంకు రాయితీ ఎలా కట్టాలని రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కోళ్ల పరిశ్రమ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


logo