మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Mar 20, 2020 , 00:41:59

ఎయిర్‌పోర్టులో.. హై అలర్ట్‌

 ఎయిర్‌పోర్టులో.. హై అలర్ట్‌

  • క్వారంటైన్‌లో..1493 మంది విదేశీయులు వారి  నుంచి పాస్‌పార్టులు స్వాధీనం
  • ప్రత్యేక వార్డులో చికిత్స, తర్వాతే  అప్పగింత 
  • ప్రయాణికుల చేరవేతకు ఆర్టీసీ, బస్సులు, లగేజీకి డీసీఎంలు, లారీలు ఏర్పాటు
  • పోలీస్‌ పహారాలో ఎయిర్‌పోర్టు పరిసరాలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ‘కరోనా వైరస్‌'తో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న ప్రస్తుత తరుణంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టింది. ఎయిర్‌ పోర్టు పరిసరాలు పోలీస్‌ పహారాలోకి ఉన్నది. విదేశీ ప్రయాణికులు లేక ఎయిర్‌ పోర్టు బోసిపోయినప్పటికీ, విదేశాల నుంచి స్వరాష్ట్రంకు వచ్చే ప్రయాణికులతో ఎయిర్‌ పోర్టు కిటకిటలాడుతున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జామున 5.30 వరకు 1019 మంది విదేశాల నుంచి రావడంతో వారి పాస్‌ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఒక్కరోజే (రాత్రి 8.30 గంటల వరకు) వివిధ దేశాల నుంచి నాలుగు విమానాలు రావడంతో 474 మంది ప్రయాణికులు వచ్చారు. వీరందరిని (మొత్తం 1,493 మంది) రాజేంద్రనగర్‌ డివిజల్‌లో ఏర్పాటు చేసిన ‘క్వారంటైన్‌' కేంద్రాలకు తరలించారు. 

గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ భవనంలో..

గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ భవనంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రానికి 110 మందిని అధికారులు గురువారం సాయంత్రం తరలించారు. దుబాయ్‌, ఒమన్‌ దేశాల నుంచి వచ్చిన 110 మంది ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చారు. జిల్లాకు వస్తున్న విదేశీ ప్రయాణికుల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు సేకరించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు పర్యవేక్షణను జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సమర్థులైన అధికారులకు అప్పగించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని వారిని ‘క్వారంటైన్‌' కేంద్రాలకు తరలిస్తున్నారు. 

కరోనా వైరస్‌' కలవరపాటు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో విసృత్తస్థాయిలో అవగాహన కల్పించేందుకు శ్రమిస్తోంది.జిల్లా కేంద్రం ఆసుపత్రి కొండాపూర్‌ ఆసుపత్రితో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. జిల్లాలో 22 కేంద్రాలు ఏర్పాటు చేసి 12 వాటిలో పడకలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి 25 మంది ప్రత్యేకాధికారులను నియమించారు.జిల్లాలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం స్క్రీనింగ్‌ కోసం జిల్లా వైద్యాధికారులు వివిధ ప్రాంతాల నుంచి కొందరు స్వయంగా,మరికొందరు వైద్య సిబ్బంది కౌన్సిలింగ్‌లో భాగంగా వస్తున్నారు. 

ఎయిర్‌పోర్టుకు 19 మంది ప్రత్యేకాధికారులు 

జిల్లాలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ‘క్వారంటైన్‌'కేంద్రాలకు తరలించేందుకు వీరిని నియమించారు. వీరిలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి, 12 ఎంపీడీవోలు,4 తహసీల్దార్లను ఇన్‌చార్జీలుగా నియమించారు. ఎయిర్‌ పోర్టులో ఫ్లయింట్‌లో దిగిన ప్రయాణికులకు సంబంధించి పాస్‌ పోర్టు స్వాధీనం చేసుకుని వారిని  108,ఆర్టీసీ బస్సులలో ‘క్వారంటైన్‌'కేంద్రాలకు తరలించి వారి 14 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం వారి పాస్‌పోర్టు వారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 ప్రయాణికుల కోసం బస్సులు.. లగేజీకి లారీలు..

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం 108, ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. వారు విమానం దిగ్గగానే జిల్లాలో ఏర్పాటు చేసిన  ‘క్వారంటైన్‌' కేంద్రాలకు తరలించారు. అలాగే వారి వెంట తెచ్చుకున్న లగేజీని లారీలు, డీసీఎంలలో రెవెన్యూ అధికారులు తరలిస్తున్నారు. 

అందుబాటులో 15 కేంద్రాలు..

ఎయిర్‌పోర్టుకు వచ్చేవారికోసం 15 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఐసోలేషన్‌ ‘క్వారంటైన్‌' కేంద్రాలన్ని జిల్లాలోని రాజేంద్రగనర్‌ డివిజన్‌లో ఏర్పాటు చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు రాజేంద్రనగర్‌ డివిజన్‌లో ఉండటం, ఇదే ప్రాంతంలో పెద్ద పెద్ద బంగ్లాలు ఉండటంతో  ‘క్వారంటైన్‌' కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు. 1060 గదుల్లో 2060 పడకలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల నుంచి 1,493 మందిని తరలించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టులను రెవెన్యూ అధికారులు భద్రపరుస్తున్నారు. 


logo
>>>>>>