ఆదివారం 29 మార్చి 2020
Rangareddy - Mar 20, 2020 , 00:37:03

ముమ్మరంగా ఇంటి పన్ను వసూలు

ముమ్మరంగా ఇంటి పన్ను వసూలు

  • మార్చి 31 నాటికి టార్గెట్‌ పూర్తి చేయాలని ఆదేశాలు
  • ఇప్పటి వరకు మండలంలో 87.3 శాతం పన్నులు వసూలు
  • మొత్తం టార్గెట్‌ రూ.3.36 కోట్లు
  • మార్చి16 నాటికి 2.93కోట్లు వసూలు

మొయినాబాద్‌ : 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు మార్చి 31 నాటికి వంద శాతం వసూలు చేయాలని ప్రభుత్వం పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  దీంతో పంచాయతీ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇప్పటి వరకు మండలంలో 87.3 శాతం వరకు పన్నులు వసూలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. మార్చి 16 నాటికి 87.3 శాతం పన్నులు వసూలు కాగా మిగతా 13 శాతం వసూలు కావాల్సి ఉంది. అయితే టార్గెట్‌ను చేరుకోవడాని 11 రోజులు మాత్రమే ఉండడంతో పంచాయతీ కార్యదర్శులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో ఉండి పన్నులు వసూలు చేస్తున్నారు. 

మండల టార్గెట్‌ రూ. 3.36 కోట్లు.. 

మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి రూ.3.36 కోట్లు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయడానికి పంచాయతీ అధికారులు గ్రామాలకు చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఎవరెవరు ఎంత పన్నులు చెల్లించాలో  నెల రోజుల క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. కాని ప్రజలు కొంత మంది పన్నులు చెల్లించిన మరి కొంత మంది మాత్రం పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఇంటింటికీ తిరిగి పన్నులు చెల్లించాని కోరుతున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. ఒక వైపు ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తుంటే, మరో వైపు ప్రజలు పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్నారు. 28 గ్రామ పంచాయతీల్లో కలిసి టార్గెట్‌ రూ.3.36 కోట్లు ఉండగా అందులో మార్చి 16 నాటికి  అధికారులు 2.93 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నారు. అధికారులు ఇంకా రూ. 43 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. 

వంద శాతం పన్నులు వసూలు చేసిన జీపీలు మూడు..

మండలంలో  28 గ్రామ పంచాయతీల్లో మేడిపల్లి, చందానగర్‌, ఎల్కగూడ గ్రామ పంచాయతీలు ఈ నెల 16 వరకు డిమాండ్‌ ప్రకారం వంద శాతం  పన్నులను పూర్తిగా వసూలు చేశారు. కేతిరెడ్డిపల్లి, నాగిరెడ్డిగూడ గ్రామ పంచాయతీలు 82 శాతం. తోలుకట్టా 84 శాతం, అప్పోజిగూడ, బాకారం, చిలుకూరు, చిన్నమంగళారం, హిమాయత్‌నగర్‌, మొయనాబాద్‌, ఎన్కేపల్లి గ్రామ పంచాయతీలు   85 శాతం మాత్రమే వసూలు చేశాయి.  

87.3 శాతం పన్నులు వసూలు చేశాం.

పెట్టుకున్న లక్ష్యం ప్రకారం మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. మార్చి 16 తేదీ వరకు 87.2 శాతం వసూలు చేశాం.  కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన 13 శాతం పన్నులు పూర్తి చేసి వంద శాతం పూర్తి చేయడానికి పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ గ్రామాల్లో తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పన్నులు కట్టని వారు పన్నులు కట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. -యాదగిరిగౌడ్‌, ఎంపీఓ, మొయినాబాద్‌


logo