ఆదివారం 29 మార్చి 2020
Rangareddy - Mar 19, 2020 , 13:22:29

ఆల్‌ ది బెస్ట్‌..నేటి నుంచి పది పరీక్షలు

ఆల్‌ ది బెస్ట్‌..నేటి నుంచి పది పరీక్షలు

  • నేటి నుంచి పది పరీక్షలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖాధికారులు
  • గంట ముందే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి 
  • గ్రేస్‌ పీరియడ్‌ ఐదు నిమిషాలే..
  • అమలులో నిమిషం నిబంధన 
  • జిల్లాలో మొత్తం కేంద్రాలు 208, హాజరుకానున్న విద్యార్థులు 47,155 మంది

 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం నుంచి ప్రారంభమై పరీక్షలు ఏప్రిల్‌ 6వ తేదిన ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. కేవలం ఐదు నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ సమయం మాత్రమే విద్యార్థులకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఈ మేరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ హరీశ్‌కుమార్‌, డీఈఓ విజయలక్ష్మి విద్యార్ధులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. కరోనా మూలంగా విద్యార్ధులు మాస్క్‌లు ధరించి పరీక్షలకు హాజరుకావాలని కోరారు. 

హాజరుకానున్న 47,155 మంది విద్యార్థులు

  జిల్లావ్యాప్తంగా 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 47,155 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలో మొత్తం 208 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 201 రెగ్యులర్‌ సెంటర్లు కాగా 7 ప్రైవేట్‌ సెంటర్లో పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు ఉంటుంది. పరీక్షలకు మొత్తం 47,155 మంది విద్యార్థులు హాజరు కానుండగా.. ఇందులో 45,705 మంది రెగ్యులర్‌, 1,450 మంది ప్రైవేట్‌ విద్యార్థులు ఉన్నాయి. ప్రైవేట్‌ సెంటర్లలో పరీక్ష రాయనున్న వీరు గతేడాది ఒకటి, రెండు లేదా మూడు సబ్జెక్టుల్లో తప్పిన వారున్నారు. పరీక్షల నిర్వహణకు 208 డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు, 208 చీఫ్‌ సూపరింటెండెంట్లు, 2025 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి 20 మందికి ఒక ఇన్విజిలేటర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  10 ప్లయింగ్‌ స్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించారు.పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ విధించారు. 

నిమిషం నిబంధన లేదు. 

 పదో తరగతి పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వస్తే...అనుమతి నిరాకరణ నిబంధన ఉంటుందని గతంలో అధికారులు ప్రకటించారు. కానీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు అధికారులకు అందలేదు. దీంతో ఒక నిమిషం నిబంధన ఇక లేనట్లే. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.logo