శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 17, 2020 , 00:15:43

కరోనాపై అప్రమత్తం

కరోనాపై అప్రమత్తం

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. విస్తృత ప్రచారంతోనే జనజీవనంలో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని నిర్ణయించింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దవాఖానల్లో ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు త్వరలో కళాబృందాలతో గ్రామాల్లో కళాజాతలు నిర్వహించనున్నారు. వైరస్‌ సోకిన తర్వాత బాధపడడం కంటే రాకముందే అప్రమత్తంగా ఉండాలని సూచించనున్నారు. సాంస్కృతిక సారథి కళాబృందాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, జన సామర్థ్యం అధికంగా ఉన్న సంతలు, కూడళ్లల్లో చైతన్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కాగా సోమవారం పట్నం మహేందర్‌రెడ్డి దవాఖానలో ఐసోలేషన్‌ వార్డును ‘కాళోజీ’ వర్సిటీ వైద్యుడు పరిశీలించారు. వైరస్‌ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీచైర్‌పర్సన్‌ అనితారెడ్డి అధికారులను ఆదేశించారు.

  • ప్రజల్లో అవగాహన పెంచేందుకు కదిలిన కళా బృందాలు
  • జిల్లాలోని మొత్తం 560 గ్రామాల్లో ప్రదర్శనలు
  • నేడు ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సమావేశం
  • ‘పట్నం’ దవాఖానలో ఐసోలేషన్‌ వార్డును పరిశీలించిన వరంగల్‌ ‘కాళోజీ’ వర్సిటీ వైద్యుడు ప్రవీణ్‌కుమార్‌

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నిరో ధానికి తగిన చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మిని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలను మూసివేయాలని మండలస్థాయి విద్యాధికారులు గ్రామస్థాయి  పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలన్నారు. మండలంలోని సీఎస్సీ, పీహెచ్‌సీ సెంటర్లలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. చాలా రోజులుగా ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే వైద్యులకు సెలవులు ఇవ్వకూడదని ప్రజలకు కష్ట సమయంలో అందుబాటులో ఉండాలన్నారు. 

ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న కళా బృందాలు

కరోనా వైరస్‌పై ప్రజలను చైతన్యపర్చడంలో జానపద కళా రూపాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండడంతోపాటు నివారణ చర్యలపై చైతన్యపర్చేందుకు సాంస్కృతిక సారథి కళాబృందాలు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఉపయోగించుకుంటోంది జిల్లా సమాచార, పౌర సంబంధాలశాఖ. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో సాంస్కృతిక సారథి బృందాలు కరోనా వ్యాప్తి చెందే విధానం, వ్యాధి నివారణకు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధి లక్షణాలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై కళా ప్రదర్శనలతో చైతన్యపరుస్తున్నారు. జిల్లాలో మొత్తం 14 మంది సాంస్కృతిక సారథి కళాకారులున్నారు. వీరిని రెండు బృందాలుగా విభజించి ప్రతి రోజూ రెండు గ్రామాల్లో కళాప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె.వెంకట రమణ తెలిపారు. 

కరోనాపై కదిలిన యంత్రాంగం..

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాధిపట్ల ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని ప్రభుత్వశాఖల అధికారులు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు కరోనావ్యాధి నివారించడానికి తీసుకోవల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానాకు ప్రతిరోజు నాలుగు నుంచి ఐదువందల మంది ఔట్‌ పేషెంట్లు వచ్చిపోతుంటారు. వీరిలో జలుబు, దగ్గు, జ్వరం తదితర వ్యాధులు సోకినవారు వస్తున్నారు. వీరందరికి కరోనా పట్ల ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనేదానిపై ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి, ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానను సందర్శించారు. ఆయన దవాఖానకు వచ్చిన రోగులతోపాటు డ్యూటీ డాక్టర్‌తో వ్యాధి నివారణపట్ల ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దానిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నివారించడంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచే అంశంపై మంగళవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డాక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  

డిజిటల్‌ క్లాస్‌ల ద్వారా అవగాహన ...

కరోనావ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తల కోసం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డిజిటల్‌ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామాల్లో వాల్‌పోస్టర్లు అందించడంతోపాటు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకో గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

మహేందర్‌రెడ్డి దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు పరిశీలన 

చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలోని మహేందర్‌రెడ్డి మెడికల్‌ కళాశాలలో సోమవారం ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. వార్డులో ఉండాల్సిన సదుపాయాలు, బెడ్స్‌ తదితర వాటిని పరిశీలించేందుకు వరంగల్‌ జిల్లాలోని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం వైద్యుడు ప్రవీణ్‌కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు మహేందర్‌రెడ్డి దవాఖానను సందర్శించడం జరిగిందన్నారు. వైరస్‌ ప్రభావం రాకుండా దవాఖానలో ముందస్తుగా ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశారని తెలిపారు. 


logo