శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 16, 2020 , 00:26:43

మేడిపల్లిలో శిథిలమవుతున్న శిల్పసంపద

మేడిపల్లిలో శిథిలమవుతున్న శిల్పసంపద
  • శిథిలావస్థలో నర్సింహస్వామి ఆలయం
  • వీరన్న గుడిలో శిల్పసంపద ధ్వంసం
  • గుప్త నిధుల కోసం ఆలయాల్లో తవ్వకాలు
  • కనుమరుగవుతున్న శిల్ప సంపద
  • పూర్వవైభవానికి భక్తులు వినతి

యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామంలో వందల ఏండ్లనాటి  పురాతన ఆలయాలు క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అక్కన్న మాదన్నల, కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలు తమ ఉనికిని కాపాడమంటూ నిరీక్షిస్తున్నాయి. భవిష్యత్తుతరాలకు వాటి ఆనవాళ్లు కూడా చిక్కని పరిస్థితి నెలకొంది. గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే అతి పురాతన ఆలయాలు, నిర్మాణాలను లక్ష్యం చేసుకోని వాటిని తవ్వడం, విగ్రహలను పెకిలించడం, అవసరమైతే వాటిని ధ్వంసం చేయడంతో అలనాటి విలువైన శిల్పసంపదను నాశనం చేస్తున్నారు. దీంతో వాటి రూపురేఖలను కోల్పోతున్నాయి. కొన్ని ప్రధాన ఆలయాలు సైతం నిత్య పూజలకు నోచుకోకుండా పోతున్నాయి. గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకొచ్చి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

పూజలకు నోచుకోని నర్సింహస్వామి

మేడిపల్లి గ్రామ శివారులో నరసింహస్వామి గుట్ట ఒకప్పుడు నిత్యపూజలతో విరాజిల్లేది. గుట్టపై జాతర నిర్వహించడంతో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం గుట్టపై బండ చరియలో నర్సింహస్వామి కొలువుదీరినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.  పూజలు, దీపదూప నైవేద్యాలు లేకపోకపోవడంతో.. ప్రస్తుతం గబ్బిలాలకు నిలయంగా మారింది. బండపై రాజులు చెక్కించిన పాతకాలం నాటి ఆనవాళ్లు, ఆంజనేయస్వామి విగ్రహలు గుట్టపై భక్తులకు  దర్శనమిస్తాయి. పురాతన లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయాన్ని గ్రామస్తులు, భక్తులు పట్టించుకోవడంలేదు. ఆలయాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కాదు కదా గుట్టవైపు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు.ఆలయం సమీపంలో మల్లన్న దేవాలయాన్ని నిర్మించినప్పటికి నర్సింహ్మస్వామి ఆలయాన్ని పట్టించుకోక పోవడం గమనార్హం.

శిథిలావస్థలో వీరన్నగుడి

లక్ష్మినర్సింహ్మ స్వామి ఆలయానికి ఎదురుగా పురాతన వీరన్నగుడి ఉంది. ఆలయం రాతితో నిర్మించినప్పటికి ఇప్పటికే సగం ధ్వంసమైంది. ఆలయం ముందున్న భారీ శివలింగాన్ని గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు గతంలో పెకిలించినట్లు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ముందున్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో దీపదూప నైవేద్యాలు కరవయ్యాయి. పురాతన కాలంలో నిర్మించిన ఆలయంలో వీరన్న విగ్రహం, వినాయకుడు, నంది విగ్రహలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శివలింగాన్ని పెకిలించడం, నంది విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం కళ తప్పింది. శివరాత్రి మినహా మళ్లీ భక్తులు అటువైపు చూసిన రోజులు లేవు. వీరన్న ఆలయానికి మరమ్మతులు జరిపి, గుట్ట పరిసరాలను అభివృద్ధి చేసి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. గ్రామంలోని అటవీ ప్రాంతంలో రాజులకాలంలో నిర్మించిన అతి పురాతనమైన జానాల గుడిది ఇదే దుస్థితి. మేడిపల్లిలో ఉన్న దొరల గడీల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతూ కొందరు ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. గ్రామంలో రాజుల కాలంలో నిర్మించిన కోటబురుజులు కూలిపోయి శిథిలావస్థకు చేరగా కొన్ని ఇప్పటికే నేలమట్టమయ్యాయి. ఇలా చారిత్రాత్మక ఆలయాలు, కట్టడాలు శిథిలావస్థకు చేరుకొని క్రమంగా కనుమరుగవుతున్నాయి.  పురాతన ఆలయాలు, కట్టడాలు, అలనాటి శిల్పసంపదను సంరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 

పూర్వవైభవం తీసుకురావాలి 

గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న నర్సింహస్వామి గుట్ట, వీరన్నగుడిని అభివృద్ధి చేసేందుకు గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకురావాలి. పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి లక్ష్మినర్సింహ్మ స్వామి ఆలయాన్ని పునర్‌ నిర్మించడం ఎంతో సంతోషం. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో గ్రామంలోని పురాతన లక్ష్మినర్సింహ్మస్వామి గుట్టను  అభివృద్ధి చేసుకోవాలి. 

- పొద్దుటూరి రవీందర్‌గుప్త, మేడిపల్లి 


logo