గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 16, 2020 , 00:10:18

ప్రగతిలో పల్లెలు

ప్రగతిలో పల్లెలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. రెండు విడుతల్లో చేపట్టిన ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సంపూర్ణ పారిశుద్ధ్యం, పచ్చదనం దిశగా ప్రతి పల్లె అడుగులు వేస్తున్నది. రూ. 36 కోట్లతో ఊరూరా సీసీ రోడ్ల నిర్మాణం ఊపందుకున్నది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ ఉండడంతో ప్రజల ఇండ్ల వద్ద సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లోని 560 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. కంపోస్టు షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

  • సంపూర్ణ పారిశుద్ధ్యమే ప్రభుత్వ లక్ష్యం
  • 560 పంచాయతీల్లో చురుకుగా కొనసాగుతున్న పనులు
  • గ్రామాల్లో జోరుగా వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణం
  • జిల్లాలోని 21 మండలాల్లో రూ.36 కోట్లతో సీసీ రోడ్ల పనులు
  • కంపోస్టు ఎరువుల కోసం ప్రత్యేకంగా షెడ్ల ఏర్పాటు
  • అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు

షాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాలన్నీ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండు విడుతల్లో చేపట్టిన పనులతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా ప్రతి పల్లె అడుగులు వేస్తున్నది. ఊరురా సీసీ రోడ్ల నిర్మాణం ఊపందుకుంది. ప్రజల ఇండ్ల వద్ద సేకరించిన చెత్తను పంచాయతీల్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 560 పంచాయతీల్లో వైకుంఠధామాల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే  జిల్లాలోని ఫరూఖ్‌నగర్‌, కొత్తూర్‌, మొయినాబాద్‌, శంకర్‌పల్లి మండలాల్లో 30 వరకు వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేశారు. కంపోస్టు షెడ్లు కూడా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రూ.36 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్థల సమస్యల కారణంగా వైకుంఠధామాలు, కంపోస్టుయార్డుల పనులు ఆలస్యంగా ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మార్పులు వస్తున్నాయి. 

జిల్లాలో 560 పంచాయతీల్లో పనులు

జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లోని 560 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. వాటిలో ఇప్పటికే 30 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. 25 వరకు చివరి దశలో ఉన్నాయి. కొన్నింటికి ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవని, ఇంతకాలం పనులు డీలాపడ్డాయి. గతంలో వైకుంఠధామాలకు రూ.10 లక్షలు ఉంటే, ప్రస్తుతం వాటిని రూ.12.60 లక్షలకు అంచనా వ్యయం పెంచారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల గతంలో పెండింగ్‌లో పడ్డ పనుల్లో కదలిక వచ్చింది. వైకుంఠధామాల్లో బర్నింగ్‌ షెడ్లు, విశ్రాంతి గది, స్నానపు గదులు నిర్మిస్తున్నారు. దీనివల్ల అంతిమ సంస్కారాల ప్రక్రియ గ్రామాల్లో సజావుగా సాగడానికి ఆవకాశం ఉంది. 

సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యం

గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో 560 కంపోస్టు షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేయించింది. దాని ద్వారా గ్రామాల్లో సేకరించిన చెత్తను కంపోస్టుయార్డుల్లో పారబోయిస్తున్నది. సంబంధిత అధికారులు స్థల సేకరణ చేసి కంపోస్టుయార్డులను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో డంపింగ్‌యార్డుల నిర్మాణానికి రూ.1.50 లక్షల ఇస్తుండగా ప్రస్తుతం దానిని రూ.2.50 లక్షలకు పెంచింది. తడి, పొడి చెత్తను వేరుగా చేసి సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రతి గ్రామంలో కంపోస్టు ఎరువుల షెడ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కంపోస్టు షెడ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 

రూ. 36 కోట్లతో సీసీ రోడ్లు

జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 799 పనులకు రూ.36 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ప్రతి గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలను స్వచ్ఛత దిశగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయా గ్రామాలకు కోట్లాది రూపాయలతో ప్రభుత్వం బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నది. గ్రామాల్లోని ప్రతి కాలనీకి సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు నిధులు కేటాయిస్తున్నది. 

అన్ని గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి

జిల్లాలోని 21 మండలాల్లోని 560 పంచాయతీల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. వైకుంఠధామాలు, కంపోస్టు యార్డులకు నిధులు పెంచారు. దీంతో పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లో కూడా పనులు చురుకుగా సాగుతున్నాయి. త్వరలో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, కంపోస్టు యార్డులు పూర్తి కానున్నాయి. 

- వెంకటరమణ, అదనపు పీడీ ఉపాధిహామీ 


logo