గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 15, 2020 , 02:54:57

‘నంది’ కుండలకు భలే గిరాకీ..

‘నంది’ కుండలకు భలే గిరాకీ..

యాచారం : నందివనపర్తి గ్రామం మట్టి కుండల తయారీకి ప్రసిద్ధి. కుమ్మరులు ఏడాది పొడవునా కుటుంబ సభ్యులతో కలిసి కుండల తయారీలో నిమగ్నమవుతారు. వేసవిలో మార్కెట్‌కు తరలించి మంచి లాభాలను పొందుతారు. వివిధ ఆకృతులతో లభ్యమవుతున్న కుండలు, మట్టి పాత్రలకు నేడు నగరాల్లో మంచి డిమాండ్‌ ఉంది.  చెరువు నుంచి తెచ్చిన ఒండ్రుమట్టిని జల్లెడ పడుతారు. ఆ మట్టిని బాగా తొక్కుతూ. మెత్తగా చేసి.. రెండురోజుల పాటు వస్త్రం కప్పి ఉంచి. ఆ పై ముద్దలుగా కుమ్మరి సారెపై ఉంచి వారి కళానైపుణ్యంతో వివిధ ఆకృతులలో మట్టి కుండలను తయారు చేస్తారు. వాటిని ఆరబెట్టి కొలిమిలో పొట్టువేసి కాల్చుతారు. రెండ్రోజులపాటు వాటిని చల్లార్చి, శుభ్ర పర్చి మార్కెట్లో విక్రయించి లాభాలను పొందుతారు. చిన్న, పెద్ద సైజుల్లో కుండలు, కూజాలు, సురాయిలు, గల్లగురిగిలు, ప్రమిదలు, మట్టి గ్లాసులు, గురిగిలు తయారు చేసి జిల్లాతో పాటు హైదరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో విక్రయిస్తారు. ఫ్రిజ్‌లు వచ్చినా మట్టి కుండల స్థానం నేటికీ పదిలంగానే ఉంది. బాటసారులకు నీరందించే చలివేంద్రం కుండలు సైతం మార్కెట్లోకి రావడంతో వీటికి మంచి డిమాండ్‌ సంతరించుకుంది. 

కుల వృత్తినే నమ్ముకున్నం

కుమ్మరి వృత్తిని నమ్ముకొని కుండలను తయారుచేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నాం. కుండల తయారీకి కుంటల్లో మట్టి దొరకక పోవడంతో పట్టా భూములలో డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నాం. ప్రభుత్వం కుమ్మరులకు ఉచితంగా మట్టి సరఫరా చేయాలి. రుణసదుపాయం కల్పించాలి. 

- కొండాపురం హంసమ్మ, నందివనపర్తి


గ్రామీణ కుమ్మరులను  ఆదుకోవాలి

కులవృత్తులు అంతరించి పోతున్న తరుణంలో నేటికి గ్రామీణ ప్రాంతాలలో కుండల తయారీతోనే జీవనోపాధి పొందుతున్నాం. కుమ్మరులు నమ్ముకున్న వృత్తిని వదిలిపెట్టకుండా అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కుమ్మరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, కుమ్మరులకు తగిన రుణసదుపాయం కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి.

- శ్రీకాంత్‌, నందివనపర్తి


logo
>>>>>>