శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 15, 2020 , 02:41:48

అనుమతులు లేకుంటే నేలమట్టమే..

అనుమతులు లేకుంటే నేలమట్టమే..

ఎటువంటి అనుమతులు లేకుండా.. నిబంధనలను పాటించకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. శనివారం షాబాద్‌ మండలంలోని నాగరగూడ, షాబాద్‌, హైతాబాద్‌, రుద్రారం, పటేల్‌గూడ, సోలీపేట్‌, మద్దూర్‌ తదితర గ్రామాల్లో వెలసిన 38 వెంచర్లను జేసీబీలతో కూల్చివేశారు. హెచ్‌ఎండీఏ అనుమతి ఉంటేనే లే అవుట్లు చేసుకోవాలని, ఇలాంటి స్థలాలు కొనుక్కుని ప్రజలు మోసపోవద్దని సూచించారు. కూల్చివేసిన వెంచర్లలో మళ్లీ నిర్మాణాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

  • నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు నిర్మిస్తే చర్యలు తప్పవు
  • లేఆవుట్‌ చేయాలంటే హెచ్‌ఏండీఏ అనుమతి తప్పనిసరి
  • చేవెళ్ల డివిజన్‌ పంచాయతీ అధికారి శ్రీకాంత్‌రెడ్డి
  • షాబాద్‌ మండలంలో ఒకే రోజు 38 వెంచర్ల కూల్చివేత

షాబాద్‌, నమస్తే తెలంగాణ : నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని చేవెళ్ల డివిజన్‌ పంచాయతీ అధికారి శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం షాబాద్‌ మండలంలోని నాగరగూడ, షాబాద్‌, హైతాబాద్‌, రుద్రారం, పటేల్‌గూడ, సోలీపేట్‌, మద్దూర్‌, పలు గ్రామాల్లో వివిధ డివిజన్ల పంచాయతీ అధికారులు సునంద, శ్రీనివాస్‌, తరుణ్‌ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది అక్రమంగా వెలసిన వెంచర్లను జేసీబీలతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేఆవుట్‌ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా హెచ్‌ఏండీఏ అనుమతి పొందాలని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హెచ్‌ఏండీఏ అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం అక్రమ వెంచర్లను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలో మొత్తం 38 వెంచర్లను కూల్చివేసినట్లు చెప్పారు. జేసీబీలతో వెంచర్లలో నిర్మిస్తున్న బీటీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, డివైడర్‌లను పూర్తిగా ధ్వంసం చేశారు. మండలంలో ఏ ఒక్క వెంచర్‌కూ  అనుమతి లేదన్నారు. కూల్చివేసిన వెంచర్లలో మళ్లీ పనులు నిర్వహిస్తే కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీఓ హన్మంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఎల్లయ్య, నర్సింహారెడ్డి, ప్రభాకర్‌, రవి, మల్లేశ్‌, చంద్రకాంత్‌, శ్రీను  ఉన్నారు. 

 

శంకర్‌పల్లి రహదారిలో అక్రమణలు తొలగింపు

శంకర్‌పల్లి రూరల్‌ : రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, దాబాలను  హైద్రాబాద్‌ ఆర్‌అండ్‌బీ అధికారులు కూల్చివేశారు. శనివారం  ఏఈ సందీప్‌ మాట్లాడుతూ శంకర్‌పల్లి-కొల్లూరు వరకు శంకర్‌పల్లి-హైద్రాబాద్‌ ప్రధాన రహదారిపై అక్రమంగా ఆయా గ్రామాలకు చెందిన వ్యక్తులు ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కబ్జా చేసి రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, దాబాలు, హోటళ్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్‌అండ్‌బీ స్థలంలో వ్యాపారాలను నిర్వహించడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నారని పేర్కొన్నారు.  బీడీఎల్‌ చౌరస్తా నుంచి ఇంద్రారెడ్డి విగ్రహం వరకు 6 లైన్ల  రోడ్డు మంజూరు చేశారని, రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాల భవన సముదాయాలను  యజమానులే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆయన సూచించారు. 


logo