శనివారం 28 మార్చి 2020
Rangareddy - Mar 15, 2020 , 02:29:08

హై అలర్ట్‌..

హై అలర్ట్‌..

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలకు సర్కార్‌ సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కానప్పటికీ ముందస్తు భద్రతపై దృష్టి సారించింది. శనివారం సీఎం కేసీఆర్‌తో జరిగిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలన్నింటికీ ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించారు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లను సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ కావడంతో ఆ దిశగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను 24 గంటలు అందుబాటులో ఉంచారు. స్థానికంగా ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ బృందాలు అప్రమత్తమై తదుపరి చర్యలు తీసుకోనున్నాయి. ఆలాగే, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ నుంచి హెల్త్‌ సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్లు మొత్తం 18 మంది జిల్లాకు చేరుకుని ఎవరైనా అనుమాతులున్నారా..? విదేశాల నుంచి ఎవరొచ్చారు తదితర వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రభుత్వం వాల్‌పోస్టర్లు, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

  • వైరస్‌ వ్యాప్తి చెందకుండా అప్రమత్తమైన అధికారులు, వైద్య శాఖ
  • ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • షాపింగ్‌ మాల్స్‌, సినిమాహాళ్లు సైతం మూసివేత
  • భాస్కర, పట్నం, షాదాన్‌ దవాఖానల్లో ఐసొలేషన్‌ వార్డుల ఏర్పాటుకు కసరత్తు..!
  • జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు
  • 24 గంటలూ అందుబాటులో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు
  • ప్రసార మాధ్యమాల ద్వారా కరపత్రాలు పంచి అవగాహన కల్పిస్తున్న అధికారులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) భారత్‌లోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారి వ్యాప్తి కట్టడికి జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. జనసందోహాలకు దూరంగా ఉండాలంటూ కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంస్థలకు ఈ నెల 31వరకు మూసివేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఈ నెల 16నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించినప్పటికీ కరోనాతో ఈ నెల 31వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. శనివారం సాయంత్రం ఉన్నతస్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం అప్రత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌ను సైతం మూసివేయాలని నిర్ణయించారు. జిల్లాలోని నగర శివారు ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం, ఎల్బీ నగర్‌ తదితర నియోజకవర్గాలు పూర్తిగా పట్టణ ప్రాంతాలుగా ఉన్నా యి. గ్రామీణ జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంప ట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సైతం సినిమా థియేటర్లు మూసివేయనున్నారు. కొన్ని రోజులపాటు బహిరంగ సమావేశాలు వద్దని విందులు, వేడుకలు ఇంటికే పరిమితం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించింది. ఈ వైరస్‌వ్యాప్తిని కట్టడి చేసేందుకు జిల్లా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లాలోని దాదాపుగా 1500ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, 800ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలు మూసివేయాలని నిర్ణయించారు. అయి తే ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్‌ పరీక్షలు, 19నుంచి ప్రారంభంకానున్న పదో  తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాగే జిల్లాలోని మొయినాబాద్‌ మండలం అమ్డాపూర్‌ వద్ద ఉన్న భాస్కర్‌ మెడికల్‌ కళాశాల, చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్‌ కళాశాలలో ఐసోలేషన్‌ ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకు సం బంధించి ఇప్పటికే ఆయా దవాఖానల యాజమాన్యాలకు సమాచారం అందించారు. కరోనా వైరస్‌పై జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, లైన్‌ డిపార్టుమెంట్లు అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే కరోనా వైరస్‌పై కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ప్రజలను చైతన్యం చేసే కరపత్రాలను విడుదలచేశారు.


ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం ...

కరోనా ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లో కరోనా వైరస్‌ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరిస్తున్నారు. వైరస్‌ సోకకుండా, వ్యాధి లక్షణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, తీవ్రత, వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు వైద్యాధికారులు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. 


జిల్లాలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు ఏర్పాటు 

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్‌ ఆఫీసర్‌తోపాటు ఐదుగురు పారా మెడికల్‌ సిబ్బంది ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం, డివిజన్‌ స్థాయిలో డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓతో పాటు మెడికల్‌ ఆఫీసర్‌, పారా మెడికల్‌ సిబ్బంది ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం, జిల్లా స్థాయిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలో ఇద్దరూ డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓలు, ముగ్గురు సూపర్‌వైజర్లు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు 24/7 అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు స్పెషల్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి నేతృత్వంలో జిల్లా సర్వీలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లలిత, జిల్లా ఎపీడిమిక్‌ విభాగం ఆఫీసర్‌ డాక్టర్‌ కత్తి జనార్దన్‌ను నియమించారు. స్థానికంగా ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ బృందాలు అప్రమత్తమై తదుపరి చర్యలు తీసుకుంటాయి. 

అలాగే జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో ఎపీడిమిక్‌ విభాగం పనిచేస్తుండగా.. రాష్ట్రస్థాయిలో 104కు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించవచ్చు. అలాగే విదేశాల నుంచి వస్తున్న వారిని శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ టెస్టులు చేసి వికారాబాద్‌లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లుచేశారు. ఇందుకు సంబంధించి ఇక్కడ పలు బృందాలను రంగంలోకి దించారు. అలాగే జిల్లా నగర శివారు చుట్టూ విస్తరించి ఉండడంతో జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ నుంచి హెల్త్‌ సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్లు మొత్తం 18మందిని ఇక్కడికి రప్పించారు. వీరంతా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించి అనుమానితులు సంచరించిన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారి వివరాలు సేకరించడం, అవగాహన కల్పించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 


logo