బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 10, 2020 , 03:59:58

నేరం చేసి... తప్పించుకోలేరు!

నేరం చేసి... తప్పించుకోలేరు!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో నేరం చేస్తే.. నిఘా నేత్రానికి చిక్కాల్సిందే. తప్పు చేసిన వాళ్లు ఎంత చాకచక్యంగా వ్యవహరించినా.. ఏదో ఒక కెమెరాలో బందీ కావాల్సిందే.. సీసీ ఫుటేజీల ఆధారంగా 24 గంటల్లోపే కేసు చిక్కుముడి వీడాల్సిందే..  నగర వ్యాప్తంగా ఉన్న 5.6 లక్షల సీసీ 

కెమెరాలు.. నేరస్తులను వెంటనే గుర్తించి.. పోలీసుల దర్యాప్తునకు చేయూతనిస్తున్నాయి.. నేరగాళ్లలో వణుకు పుట్టిస్తూ, నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి తోడ్పడుతున్నాయి. 


హైదరాబాద్‌లో నేరాలు జరిగితే.. గంటల వ్యవధిలోనే చిక్కుముడులు వీడుతున్నాయి. సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు నేరస్తులను వెంటనే గుర్తించగలుగుతున్నారు. సీసీ కెమెరాలు ప్రతి కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషిస్తున్నాయి. నేరస్తులను పట్టించడంతో పాటు నేరం చేసిన వారికి తప్పని సరిగా శిక్షలు పడేలా చేయడంలోనూ సీసీ కెమెరాలు పక్కా సాక్ష్యాలను పోలీసులకు అందిస్తున్నాయి. ప్రజల సహకారంతో నగరంలో లక్షల సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పోలీసులు విజయం సాధిస్తున్నారు. సీసీ కెమెరాలతో వస్తున్న ఫలితాలతో ప్రజలు కూడా మీ వెంటనే మేమంటూ తమ కాలనీలు, బస్తీలు, వ్యాపార సముదాయాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.  90 నుంచి 95 శాతం సీసీ కెమెరాలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా కేసుల ఛేదనలో పోలీసులకు ఆధారాలను ఇస్తున్నాయి. ఎక్కువగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరాల్లో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉమారు 5.60 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సంఖ్యను మరింతగా పెంచేందుకు పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సీసీ కెమెరాలు నగరంలో అంతగా లేని సమయంలో ఒక ఘటన జరిగిందంటే ఆ ఘటనకు బాధ్యులెవరనే విషయంపై పోలీసులు భిన్న కోణాలలో విచారణ చేసేవారు.. ఇందులో కొన్ని సందర్భాలలో ఆయా కేసులకు సంబంధం లేని వారు కూడా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ నేడు ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది.. నేరం చేసిన వాళ్లు పక్కాగా దొరికిపోతున్నారు. ఎవరు ఎక్కడ.. ఎప్పుడు నేరం చేశారనే విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది. సీసీ ఫుటేజిలతో నిందితులను గుర్తించగలుతున్నారు.


నేరగాళ్లు దొరికిపోవడం ఖాయం..!

నగరంలోని ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయి.. ఈ విషయం హైదరాబాద్‌లో గతంలో దొంగతనాలు చేసే అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానికంగా నేరాలు చేసే వారికి తెలిసిపోయింది. ఈ  భయంతో వారు హైదరాబాద్‌ వైపునకు రావడం లేదు. నగర పోలీసులు తీసుకున్న సాంకేతిక సంస్కరణలతో నేరస్తులను పూర్తిస్థాయిలో కట్టడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో నేరం చేశామంటే పక్కాగా దొరికిపోతామనే భావన నేరస్తుల్లో నెలకొన్నది.  అయితే  కొన్ని ముఠాలు తాము సీసీ కెమెరాలకు దొరకకుండా పకడ్బందీగా వ్యవహరిస్తూ హైదరాబాద్‌లో దొంగతనాలు చేసేందుకు వస్తున్నాయి. అయితే అంతర్రాష్ట్ర ముఠాలు నేరాలు చేసి హైదరాబాద్‌ను విడిచిపెట్టే లోపే పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకుంటున్నారు. ఏ కేసులోనైనా పోలీసులు సీసీ కెమెరాలను విశ్లేషిస్తూ వేగంగా దర్యాప్తు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వేల సంఖ్యలోని సీసీ కెమెరాలను పోలీసులు విశ్లేషించి నేరగాళ్లను పట్టుకుంటున్నారు. నేరస్తులు  పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించి హైదరాబాదంతా తిరిగినా పోలీసులు మాత్రం నేరగాళ్లను గుర్తించగలుగుతున్నారు.


శిక్షతప్పదు..

నగరంలో టెక్నాలజీ పరమైన సంస్కరణలు తీసుకురావడం, కేసుల ఛేదనలోనూ పోలీసులు పకడ్బంధీగా వ్యవహారిస్తుండటంతో నేరాలు చేసిన వారికి శిక్షలు పడే సంఖ్య ప్రతి యేడు పెరుగుతూ వస్తున్నది. దీనికి తోడు పోలీస్‌స్టేషన్లలోని వివిధ రకాలైన పనులను 17 విభాగాలుగా విభజించి వాటికి ఒక్కో అధికారికి బాధ్యత అప్పగించడంతో పాటు ఉన్నతాధికారులు ప్రతి అంశంపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తుండడంతో కేసుల దర్యాప్తుతో పాటు ఆయా కేసులలో తీర్పుల వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతోనే హైదరాబాద్‌లో శిక్షల శాతం పెరుగుతున్నది. ఇందులో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంటుంది. 


ప్రజల సహకారంతోనే..

సీసీ కెమెరాల ప్రాధాన్యత ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు.  ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అందుతున్నది. హైదరాబాద్‌లో నేరాలను  కట్టడి చేయడంతో పాటు నేరస్తులను హైదరాబాద్‌ వైపు రాకుండా చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంది. ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఉండాలి. హైదరాబాద్‌లో నేరం చేసిన వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా చేస్తున్నాం. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ ప్రశాంతతకు నిలయంగా మారుతూ, దేశంలోనే బెస్ట్‌ సిటీగా గుర్తింపు           తెచ్చుకుంటున్నది.

-అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, 


నేరాల నియంత్రణ..

సీసీ కెమెరాలతో చాలామంది అమాయకులు వారిపై వచ్చిన ఆరోపణలతో బయటపడుతున్నారు. తప్పుడు సమాచారం వచ్చే వాటిని స్పష్టం చేసుకునేందుకు సీసీ ఫుటేజిలు దోహదపడుతున్నాయి. కేసు ఛేదనకు తక్షణమే తగిన ఆధారాలను సీసీ కెమెరాలు అందిస్తున్నాయి. సీసీ కెమెరాలను  చూసి నేరాలు చేయకుండా వెనక్కి తగ్గుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలు తగ్గుతున్నాయి. 

-మహేశ్‌భగవత్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌


24 గంటల్లోనే కేసుల ఛేదన

సీసీ కెమెరాలతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా భద్రత పెరిగింది. ఏ కేసునైనా ఛేదించడానికి సీసీ కెమెరాలు ఇచ్చే ప్రాథమిక ఆధారాలతో 24 గంటల్లోనే నేరస్తులను పట్టుకుంటున్నాం. పోలీసులకు సీసీ కెమెరాలు అత్యంత కీలక ఆయుధంగా మారాయి. ఇతర రాష్ర్టాల ముఠాలు ఇప్పుడు నగరానికి రావడానికి భయపడుతున్నారు. సీసీ కెమెరాలతో ప్రశాంత వాతావరణం నెలకొంది. 

-సజ్జనార్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌logo