శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 09, 2020 , 04:31:46

ఐదేండ్లు.. రూ. 50 వేల కోట్లు

ఐదేండ్లు.. రూ. 50 వేల కోట్లు

పరుగులు పెట్టనున్న మహానగర అభివృద్ధి బల్దియాకు  బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే తొలిసారి నగరాభివృద్ధికి పెద్దపీట ఏటా కేటాయింపునకు నిర్ణయం డబుల్‌ ఇండ్లకు అదనంగా నిధులు ఏడాదిలో పూర్తి కానున్న మిగతా 45 వేల ఇండ్ల నిర్మాణం


భాగ్యనగరం.. విశ్వనగరం వైపు దూసుకుపోనున్నది.. రానున్న ఐదేండ్లలో.. రూ.50 వేల కోట్లతో ప్రగతి పరుగులు తీయనున్నది. ఇప్పటికే పలు పనులతో అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న మహానగరం.. మరిన్ని ప్రాజెక్టులతో ఆదర్శనగరంగా నిలువనున్నది. ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రేటర్‌కు పెద్దపీట వేస్తూ  రూ.10 వేల కోట్లు కేటాయించారు. వీటితో పాటు నగరంలో చేపట్టిన డబుల్‌ 

బెడ్‌ రూం ఇండ్లకు అదనంగా నిధులు రానున్నాయి. 


డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు  బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు జరిపారు. దీంతో ఈ ఏడాదిలోనే గ్రేటర్‌ పరిధిలోని మిగతా 45 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తికానున్నాయి. ఇప్పటికే పూర్తయిన 55 వేల ఇండ్లతో కలిపి సీఎం కేసీఆర్‌ ‘లక్ష ఇండ్ల లక్ష్యం ’ నెరవేరబోతున్నది.


మెట్రో విస్తరణ.. 

రెండో దశ 62 కిలోమీటర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ 

పాతబస్తీ మెట్రో వేగవంతం

త్వరలో మొదటిదశలో పెండింగ్‌లో ఉన్న 

5 కిలోమీటర్ల నిర్మాణం

నగర కేటాయింపుల్లో ‘మెట్రో’కూ భాగం

ఆర్టీసీకి వెయ్యి కోట్లు

గ్రేటర్‌కు వెన్నుదన్నుగా నిలిచిన సర్కారు

పదవీ విరమణ వయస్సు పెంపు

18 వేల మందికి ప్రయోజనం

జలమండలికి రూ.900 కోట్లు

తాగు, మురుగునీటి అవసరాలకు ప్రాధాన్యం

ఈ ఏడాది రూ.75 కోట్లు పెరిగిన కేటాయింపులు

ప్రగతికి బాటలు 

ఆరేండ్లలో గణనీయమైన అభివృద్ధి 

జీవన ప్రమాణాల పెంపునకు అర్బన్‌ పార్కులు 

పట్టణ భగీరథతో నీటి కష్టాలకు చెక్‌ 

రాష్ట్ర ఆదాయంలో గ్రేటర్‌దే అగ్రస్థానం

మూడు జిల్లాల నుంచే అత్యధిక జీఎస్‌డీపీ రాబడి

సామాజిక ఆర్థిక సర్వేలోవెల్లడి

వైద్యంలో ది బెస్ట్‌

బస్తీ దవాఖానలు, ఈవినింగ్‌ క్లినిక్స్‌ 

అట్టడుగు వర్గాలకూ అందుబాటులో వైద్యం

తగ్గిన మాతాశిశు మరణాలు

ఐటీలో మేటి

దిగ్గజాల పెట్టుబడులకు కేంద్రం

గణనీయమైన వృద్ధి సాధించిన నగరం

టీఎస్‌ ఐపాస్‌తో పెట్టుబడులకు మరింత ఊతం

టీ హబ్‌, వీ-హబ్‌లతో స్టార్టప్‌లకు ప్రోత్సాహం


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్‌లో  రూ. 10వేల కోట్లు కేటాయించింది. నగర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. ఐదేండ్ల పాటు ఏటా పది వేలకోట్ల చొప్పున కేటాయిస్తూ రూ. 50 వేల కోట్లతో నగరాన్ని సమగ్రాభివృద్ధి చేయాలని నిర్ణయించింది. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు నిధుల కేటాయింపు దీనికి అదనం.  


ఐదేండ్ల పాటు ఏడాదికి 10 వేల కోట్లు..

నగరాభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పనచేసి అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ అమలు చేసేందుకు కనీసం రూ. 50 వేల కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించగా, అందులో దశల వారీగా ఐదేండ్ల పాటు రూ. 10 వేల కోట్ల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ క్రమంలోనే వచ్చే 2020-21 బడ్జెట్‌లో నగరానికి రూ. 10 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇది కాకుండా నగరంలోని లక్షమంది పేదలకు దాదాపు రూ. ఎనిమిది వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తుండగా, అందులో దాదాపు సగం వరకూ పూర్తయ్యాయి. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం గృహాల నిర్మాణానికి రూ. 11వేల పైచిలుకు నిధులు కేటాయించగా, అందులో దాదాపు సగం గృహాలు గ్రేటర్‌లోనే నిర్మిస్తున్నారు. అంటే, ఇందులో కూడా దాదాపు రూ. మూడున్నర నుంచి నాలుగు వేల కోట్లు జీహెచ్‌ఎంసీలోని డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు లభిస్తాయి. రూ. 50 వేల కోట్ల వ్యయంతో నగరంలో చేపట్టిన, చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాల వివరాలు.


ప్రతిష్టాత్మకంగా ‘ఎస్‌ఆర్‌డీపీ’..

ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఇప్పటికే సుమారు రూ. 1000 కోట్లతో పలు 

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చాయి.  ఇవికాకుండా మరో రూ. 1949 కోట్లతో  ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీల నిర్మాణం పురోగతిలో ఉంది. మరో రూ. 571 కోట్ల విలువైన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులు టెండర్ల దశలో ఉన్నాయి. మొత్తం కలిపి రూ. రూ. 2520 కోట్ల విలువైన పనులు నిర్వహించాల్సిఉంది. భూసేకరణ ఖర్చులు ఇందుకు అదనం. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే మున్సిపల్‌ బాండ్ల జారీ ద్వారా రూ. 495 కోట్లు సేకరించగా, ఇటీవలే రూపే టర్మ్‌లోన్‌ ద్వారా మరో రూ. 2500 కోట్లు సేకరిస్తున్నది.


పూర్తయిన  పనులు..

 బయోడైవర్సిటీ సెకండ్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌తోపాటు మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్‌, చింతలకుంట అండర్‌పాస్‌, అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్‌, మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌, రాజీవ్‌గాంధీ సర్కిల్‌ ఫ్లైఓవర్‌, నాగోల్‌ కామినేని ఎడమవైపు ఫ్లైఓవర్‌, ఎల్బీనగర్‌ ఎడమవైపు ఫ్లైఓవర్‌ తదితర ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరోవైపు, దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జికి అనుసంధానంగా నిర్మిస్తున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-45 ఫ్లైఓవర్‌కు కూడా భూసేకరణ సమస్య పరిష్కారం కావడంతో పనులు ఊపందుకున్నాయి.


 పురోగతిలో ఉన్న ఫ్లైఓవర్లు..

ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌ (విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు)

బయోడైవర్సిటీ జంక్షన్‌(హైటెక్‌సిటీ వైపు నుంచి షేక్‌పేట్‌ వైపు)

జాబ్లీహిల్స్‌ రోడ్‌-45 ఫ్లైఓవర్‌(దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జికి అనుసంధానం)

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి

సెవెన్‌టూంబ్స్‌ జంక్షన్‌

ఒవైసీ హాస్పిటల్‌ జంక్షన్‌

బహదూర్‌పుర జంక్షన్‌

మొత్తం వ్యయం- రూ. 1889.64 కోట్లు

పురోగతిలో ఉన్న ఆర్‌యూబీ/ఆర్వోబీలు..

ఉప్పుగూడ జంక్షన్‌ ఆర్‌యూబీ, డ్రైనేజీ వ్యవస్థ

లాలాపేట్‌ ఆర్వోబీ పునరుద్ధరణ

తుకారాంగేట్‌ ఆర్‌యూబీ

ఉప్పుగూడ లెవల్‌ క్రాసింగ్‌ వద్ద వరదనీటి కాలువ నిర్మాణం


మొత్తం వ్యయం- రూ. 59.65కోట్లు

టెండర్‌ దశలో ఉన్న ఫ్లైఓవర్లు..

నల్గొండ క్రాస్‌రోడ్స్‌-ఒవైసీ జంక్షన్‌

ఇందిరాపార్క్‌- వీఎస్‌టీ

ఉప్పల్‌ జంక్షన్‌


మొత్తం వ్యయం- రూ. 311.00కోట్లు టెండర్‌ దశలో ఉన్న ఆర్‌యూబీ/ఆర్వోబీలు..

హైటెక్‌సిటీ-బోరబండ ఆర్‌వోబీ

సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా ప్యారలల్‌ ఆర్‌వోబీ

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ ఆర్‌యూబీ

మైలార్‌దేవ్‌పల్లి-ఫలక్‌నుమా మధ్య శాస్త్రీపురం వద్ద ఆర్‌వోబీ

మొత్తం వ్యయం-రూ. 260.25కోట్లు


కార్పొరేషన్‌ అమలుచేస్తున్న మరికొన్ని కార్యక్రమాలు

రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కల్వర్టుల నిర్మాణం

ఆరోగ్యం, పారిశుధ్యం, వ్యాధులు ప్రబలకుండా నగర పారిశుధ్య ప్రణాళిక రూపకల్పన, అమలు

డంప్‌యార్డుల నిర్వహణ, కంపోస్ట్‌ తయారీ యార్డులు, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్ల ఏర్పాటు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ అటవీ, లంగ్‌స్పేస్‌ పరిరక్షణ

మురికివాడల అభివృద్ధి

ఇల్లు లేని పట్టణ పేదలకు నైట్‌ షెల్టర్లు

శ్మశానవాటికల నిర్మాణం

జనన, మరణాల నమోదు, గణాంకాల నిర్వహణ

వీధిలైట్లు, పార్కింగ్‌ స్థలాలు, బస్‌స్టాప్‌లు, ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌ స్కీమ్‌లు

ఆధునిక, శాస్త్రీయ పద్ధతుల్లో కబేళాల నిర్వహణ

పౌరసేవల్లో ఐటీ సేవల వినియోగం

68 ప్రాంతాల్లో పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌ల నిర్మాణం


విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న భాగ్యనగరం.. రానున్న ఐదేండ్లలో రూ. 50 వేల కోట్లతో ప్రగతి పరుగులు పెట్టనున్నది. అందులో భాగంగా ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నగరాభివృద్ధికి రూ. 10 వేల కోట్లు కేటాయించారు. వీటితో పాటు  గ్రేటర్‌లో చేపడుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు  మరిన్ని అదనపు నిధులు రానున్నాయి. ఇప్పటికే నగరంలో 55 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పూర్తికాగా, 45 వేల ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. వీటికి పూర్తి స్థాయిలో నిధులు అందనున్నాయి. బడ్జెట్‌లో  నగరానికి భారీగా నిధులు కేటాయించడంతో మెట్రో విస్తరణ, ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు  పనులు పూర్తికానున్నాయి.  


55వేల ‘డబుల్‌' ఇండ్లు సిద్ధం...

గ్రేటర్‌లోని పేదలకోసం  లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 55,075 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన వాటి నిర్మాణం వివిధ దశల్లో పురోగతిలో ఉంది.  దాదాపు 38 ప్రాంతాల్లో సుమారు 10 వేల ఇండ్లు నగరంలో ఇన్‌-సిటూ (గుడిసెలను తొలగించి వాటి స్థానంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం) విధానంలో నిర్మిస్తుండగా, మిగిలినవి రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నిర్మిస్తున్నారు. కొల్లూరు, అహ్మద్‌గూడ, రాంపల్లి, గాజులరామారం, బాచుపల్లి, డీ పోచంపల్లి తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇండ్లున్న పెద్ద కాలనీలను నిర్మిస్తున్నారు. నాచారంలోని సింఘం చెరువు తండాలో ఇన్‌-సిటూ పద్ధతిలో నిర్మించిన సుమారు 176 ఇండ్లను ఇదివరకే లబ్ధిదారులకు కేటాయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 9964.59 కోట్లు కాగా, అందులో ఇప్పటికే రూ.  4450.00 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ. 5514.59 కోట్లు అవసరం కాగా, వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. గత ఆగస్టు నుంచి  దాదాపు రూ. 990 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి. మొత్తం 117లొకేషన్లలో ఒక లక్ష గృహాలు నిర్మిస్తుండగా, అందులో నగరం వెలుపల నిర్మిస్తున్న 55 కాలనీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. దీంతో ఈ 55 కాలనీల్లో ఎస్‌టీపీలు నిర్మించాలని ప్రతిపాదించారు.


 ‘డబుల్‌' ఇండ్ల వివరాలు..

డబుల్‌ బెడ్‌ రూం ప్రాజెక్టు వ్యయం వివరాలు (కోట్లలో)....

ప్రాజెక్టు వ్యయం- 8598.58

పెరిగిన స్టీలు ధరల సర్దుబాటుకు అదనపు మంజూరీ- 750.00

ఇతర విభాగాల మౌలిక సదుపాయాలకు- 616.01

మొత్తం ప్రాజక్ట్‌ వ్యయం- 9964.59

ఇప్పటివరకు గృహనిర్మాణ శాఖ నుంచి విడుదలైనవి- 4450.00

కాంట్రాక్టర్లకు జారీచేసిన బిల్లులు- 4450.00

పెండింగు బిల్లులు- 996.79

ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కావాల్సిన నిధులు- 5514.59


బస్‌బేలు, మహాప్రస్థానాల నిర్మాణం...

బస్టాండ్ల వద్ద తరచు జరుగుతున్న ప్రమాదాల నివారణకు బస్‌-బేలను నిర్మించాలని నిర్ణయించింది.  జోన్‌కు కనీసం 10 చొప్పున బస్‌-బేలు, అలాగే జోన్‌కు ఒకటి చొప్పున మహాప్రస్థానం  తరహా ఆధునిక శ్మశానవాటికలను అందుబాటులోకి తేవాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. వచ్చే వేసవిలోగా వీటిని పూర్తిచేయాలని కార్యప్రణాళిక రూపొందించారు. జీహెచ్‌ఎంసీ పరిథిలో సుమారు రూ. ఏడు కోట్ల వ్యయంతో చేపట్టిన ఆరు శ్మశానవాటికలు అందుబాటులోకి రానున్నాయి. 


రూ. 1827 కోట్లతో రోడ్ల నిర్వహణ....

ప్రధానరోడ్లలో 709 కిలోమీటర్ల మేర ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఐదేండ్లలో రూ. 1827 కోట్లు ఖర్చుచేయనున్నారు.  కాగా, ప్రధాన రోడ్లన్నింటినీ కలిపి పనులను జోన్ల వారీగా ఏడు ప్యాకేజీలుగా విభజించి ఏజెన్సీలను ఎంపికచేశారు. మొత్తం 1.8 లక్షల చదరపు మీటర్ల రోడ్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో 48.87చ.మీ.లు జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లు కాగా, 54.92చ.మీ.ల వైశాల్యం హెచ్‌ఆర్‌డీసీఎల్‌ పరిధిలో ఉన్నాయి. 


3000 టాయిలెట్ల నిర్మాణానికి ప్రణాళిక...

 నగరంలో జోన్‌కు 500 చొప్పున 3000 టాయిలెట్లు నిర్మించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవలే జీహెచ్‌ఎంసీ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రాజస్థాన్‌లో నిర్మిస్తున్న నమూనాల ప్రకారం ఇక్కడ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు, మహిళలు, వికలాంగులు, పిల్లలకు  అనువుగా ఉండే నమూనాలు ఇందులో ఉన్నాయి. పోర్టబుల్‌ టాయిలెట్స్‌, బస్‌స్టాప్‌, రైల్వే స్టేషన్‌, పేవ్‌మెంట్‌, హై-వే, అర్బన్‌, అంగన్‌వాడీ, కమ్యూనిటీ, పార్కు తదితర నమూనాలు ఇందులో ఉన్నాయి.


రోజూ 50 వేల మందికి రూ. 5కే భోజనం..

 నగరంలో ప్రస్తుతం 150 అన్నపూర్ణ క్యాంటిన్లు కొనసాగుతున్నాయి. ఒక్కోదాంట్లో సుమారు 300 మందిచొప్పున రోజుకు దాదాపు 45 నుంచి 50 వేలమంది భోజనం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. 25 ఖర్చవుతుండగా, అందులో రూ. 20 జీహెచ్‌ఎంసీ, మిగిలిన రూ. ఐదు లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇలా జోన్‌కు పదిచొప్పున 60 క్యాంటిన్లను విస్తరిస్తున్నారు. అంతేకాదు, వృద్ధులు, వికలాంగులు, దిక్కులేనివారు ఈ కేంద్రాల వద్దకు చేరుకోలేక భోజనాలకు దూరమవుతున్నవారికోసం ఇటీవలే మొబైల్‌ క్యాంటిన్లను ప్రారంభించారు. వారు ఉంటున్న చోటికే హాట్‌ క్యారేజ్‌ల ద్వారా భోజనాన్ని సరఫరాచేస్తున్నారు. 


యాచకులు లేని  నగరంగా...

కేంద్ర ప్రభుత్వం పైలెట్‌ ప్రాజక్టు కింద హైదరాబాద్‌ నగరాన్ని భిక్షాటకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 10 కోట్లు కేటాయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరికొంత మొత్తాన్ని కలిపి యాచకుల సంక్షేమానికి కృషి చేయాలని నిర్ణయించారు.  యాచకులకు వివిధ వృత్తుల్లో శిక్షణనిప్పించి వారు ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా తగిన చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా వారి ఉత్పత్తులకు మార్కెట్‌తో టై-అప్‌ చేయడమే కాకుండా వారికి పునరావాసం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


రూ. 170 కోట్లతో  సీసీరోడ్లు

 గ్రేటర్‌ ఏర్పడి 13 ఏండ్లు పూర్తవుతున్నా.. ఇంకా శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల మట్టి, కంకర రోడ్లు ఉన్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జోన్లవారీగా మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటైన 580 స్ట్రెచ్‌లలో మట్టిరోడ్లను 291

కిలోమీటర్లమేర సీసీరోడ్లుగా మార్చేందుకు రూ. 170.92 కోట్లు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


33 శాతం ‘హరితం’.

 గ్రేటర్‌ ఏర్పాటు అనంతరం అత్యంత భారీస్థాయిలో థీమ్‌ పార్కులకు ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. 33 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండగా, ఇదే క్రమంలో జీహెచ్‌ఎంసీ భారీస్థాయిలో థీమ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధంచేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 120 కోట్ల వ్యయంతో 50 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు కార్యప్రణాళికను సిద్ధం చేశారు. 7.50 లక్షల చదరపు మీటర్లలో వీటిని నెలకొల్పాలని నిశ్చయించారు.  నమూనాలు సిద్ధం కావడంతో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవికాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆరుచోట్ల థీమ్‌ పార్కులను అందుబాటులోకి తెచ్చింది జీహెచ్‌ఎంసీ. 


పాదచారుల వంతెనలు, స్కై వేలు...

 నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పాదచారుల సౌకర్యార్థం 38 పాదచారుల వంతెనలు(ఎఫ్‌వోబీ), ఎనిమిది స్కైవేలు నిర్మించనున్నారు. దీనికి రూ. 239.55 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీటి నిర్మాణానికి ఇదివరకే ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 52 పాదచారుల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, అందులో 38కే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మిగిలిన 14ఎఫ్‌వోబీల నిర్మాణం సాధ్యంకాదని నిపుణులు నివేదించడంతో వాటిని తిరస్కరించారు.


ప్రతిష్టాత్మక తీగల వంతెన....

 దుర్గం చెరువుపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తీగెల వంతెన పనులు తుది దశకు వచ్చాయి. రూ. 184 కోట్లతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇరువైపులా రెయిలింగు, రోడ్డు, లైటింగ్‌ తదితర పనులు కొనసాగుతున్నాయి. అయితే దీనికి అనుసంధానంగా నిర్మిస్తున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం-46 ఫ్లైఓవర్‌ పూర్తయితేనే ఈ తీగల వంతెన పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుంది.


దేశానికే ఆదర్శం..

యావత్‌ దేశానికే తెలంగాణ బడ్జెట్‌ ఆదర్శంగా నిలుస్తుంది.  అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్‌ రూపకల్పన చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించడం అభినందనీయం. సాగునీరు, తాగునీటికి అధిక ప్రాధాన్యం కల్పించారు.  హైదరాబాద్‌ అభివృద్ధికి పది వేల కోట్లు కేటాయించారు.  రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. 

-ముఠా గోపాల్‌, ఎమ్మెల్యే, ముషీరాబాద్‌


అత్యవసర పనులకు..

ఎమ్మెల్యే నిధులను నియోజకవర్గంలో అత్యవసర, ముఖ్యమైన పనులకు కేటాయిస్తాం. కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తున్న సమయంలో ఎదురయ్యే అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. కాలనీల్లో సీసీ  కెమెరాలు ఏర్పాటు చేసి మరింత భద్రత కల్పిస్తాం.

-దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌


బస్తీల అభివృద్ధికి ప్రాధాన్యం.. 

ఎమ్మెల్యేలకు రూ. 3 కోట్ల నిధులు బడ్జెట్‌లో  కేటాయించడం అభినందనీయం. ప్రత్యేక నిధులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తాం. ప్రజల సమస్యలను గుర్తించి పనులు చేపట్టేందుకు ఈ నిధులు ఉపయోగిస్తాం. బస్తీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం.

-మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే, మల్కాజిగిరి 


సంక్షేమం.. సాగునీటికి..

 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారు.  సంక్షేమ, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, సంక్షేమ రంగంలో ఎలాంటి కోతలు విధించకపోవడం శుభ పరిణామం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.

-ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్యే, రాజేంద్రనగర్‌


విశ్వనగరంగా..

 హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది. నగరాభివృద్ధికి బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయం. అదే విధంగా నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా పని చేస్తాం. 

      -కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, ఎమ్మెల్సీ 


అత్యవసర పనులకు ..

ఈ ధపా బడ్జెట్‌లో ఎమ్మెల్సీలకు సైతం రూ.3 కోట్ల నిధులను కేటాయించడం హర్షించదగ్గవిషయం. మేము ప్రజల్లోతిరిగే క్రమంలో కొన్ని అత్యవసర పనుల నిమిత్తం ఈ నిధుల ను కేటాయించేందుకు వెసులుబాటు కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు  ధన్యవాదాలు. స్థానిక ప్రజాప్రతినిధులు తెలియజేసే సమస్యల పరిష్కారానికీ ఈ నిధులను వినియోగియోగిస్తాం.              

-శంభీపూర్‌రాజు,ఎమ్మెల్సీ, రంగారెడ్డి జిల్లా 


నూతన  అధ్యాయం.. 

దేశంలో తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల సారథ్యంలో ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ  దూసుకువెళ్తుంది. ఓ వైపు దేశం మొత్తం ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ నిధుల కోత విధించలేదు. నగరాభివృద్ధికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. 

-కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్యే,కుత్బుల్లాపూర్‌ 


ప్రజా సమస్యల పరిష్కారానికి..

  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేక నిధులు ఉంటే ప్రజాక్షేత్రంలో చాలా సమస్యలు తీర్చేందుకు అవకాశం ఉంటుంది. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన సందర్భంలో పలు సమస్యలు వెలుగులోకి వస్తాయి, వీటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తాం. నగరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం అభినందనీయం.

-యెగ్గె మల్లేశం, ఎమ్మెల్సీ 


బంగారు తెలంగాణకు బాటలు 

బంగారు తెలంగాణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజల అభ్యన్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా అనేక పథకాలకు నిధులు కేటాయించారు. ఆసరా పింఛన్‌ దారుల వయో పరిమితిని 57 ఏండ్లకు కుదించడంతో చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. 

-చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి   


చిత్తశుద్ధికి నిదర్శనం

రాష్ట్ర బడ్జెట్‌లో నగరానికి భారీగా నిధులు కేటాయించడం అభినందనీయం. రానున్న ఐదేండ్లలో నగరాభివృద్ధికి రూ 50 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నగరాభివృద్ధి, మూసీ ప్రక్షాళన, కారిడార్ల నిర్మాణం తదితర పనులకు రూ. 10 వేల కోట్లు కేటాయించడం నగరాభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. 

-బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌


పాఠశాలలను అభివృద్ధి చేస్తాం.. 

నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన ప్రత్యేక నిధులను శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్మాణానికి, తాగునీటి వ్యవస్థ, ఎస్సీఎస్టీ కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణానికి వినియోగిస్తాం. ఇప్పటికే  ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిధులు మంజూరు చేశారు. ఇప్పడు కేటాయించిన నిధులతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.

-మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్‌పల్లి 


నగరాభివృద్ధికి అధిక నిధులు

 రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం పదివేల కోట్లను కేటాయించడం అభినందనీయం.  గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరాభివృద్ధి అత్యధికంగా నిధులు కేటాయించారు. కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో  ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. 

-మాగంటి గోపీనాథ్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే


‘సీడీఎఫ్‌' నిధులతో అభివృద్ధి.. 

బడ్జెట్‌ అన్నిరంగాలకు ప్రయోజనం చేకూరే విధం గా ఉంది. బడ్జెట్‌లో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపు హర్షనీయం.  సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.480 కోట్లు, సీడీఎఫ్‌ రూ.3 కోట్లు కేటాయించడం అభినందనీయం. సీడీఎఫ్‌ నిధుల ద్వారా  ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.

-బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే,  ఉప్పల్‌ 


ప్రత్యేక నిధులతో ప్రగతి పనులు

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం అభినందనీయం. నియోజకవర్గానికి రూ.3 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించడంతో అభివృద్ధి పనులు పూర్తి చేయవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌  విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. రూ.3 కోట్లతో  పలు ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

-కాలేరు వెంకటేశ్‌, ఎమ్మెల్యే, అంబర్‌పేట


అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి..

 రాష్ట్ర  బడ్జెట్‌లో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.3 కోట్లు కేటాయించడం సంతోషకరమైన విషయం. నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ మీద ఆధారపడకుండా సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయి. వీటిని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తాం.

- అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేlogo