మంగళవారం 07 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 07, 2020 , 06:25:03

మీ బండి.. ఆపండి

మీ బండి.. ఆపండి
  • సిగ్నళ్ల వద్ద కార్బన్‌, శబ్దాల మోతలు
  • ఒక్కో సిగ్నల్‌ వద్ద 8వేల పీపీఎం కార్బన్‌
  • కాలుష్య తీవ్రత నమోదుకు ప్రత్యేక పరికరాలు
  • ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, డిస్‌ప్లేలో ప్రదర్శన
  • ఇంజిన్‌ ఆపాలంటూ విజ్ఞప్తి చేస్తూ మైక్‌ ద్వారా ప్రచారం
  • నగరంలో మూడు జంక్షన్లను ఎంపిక చేసిన పీసీబీ
  • మరో నెలరోజుల్లో అందుబాటులోకి

వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నళ్లు కాలుష్యపు కూడళ్లుగా అవతరించాయి. వాటి వద్ద ఓ 20 సెంకడ్లు ఆగితే చాలు కాలుష్య కోరల్లో చిక్కుకునేంతగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద నమోదవుతున్న కార్బన్‌, శబ్దాలమోతలు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కో సిగ్నల్‌ వద్ద సుమారుగా 8 వేల పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం) కార్బన్‌ విడుదలవుతున్నది. ఇక రయ్‌.. రయ్‌.. మోతలు, శబ్దకాలుష్యంతో కర్ణబేరి పగిలిపోతున్నది. దీన్ని నియంత్రించేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరికొత్త ప్రయోగాలను అమలుచేయబోతున్నది. సిగ్నళ్ల వద్ద కార్బన్‌, శబ్దకాలుష్యాన్ని నమోదుచేసే పరికరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపనున్నది. అంతేకాకుండా కాలుష్య తీవ్రతలు అధికంగా ఉంటే, మీరున్న చోట కాలుష్యం అధికంగా ఉంది, ఇంజిన్‌ ఆపండని మైక్‌లతో ప్రచారం చేయనున్నది. ఇందుకు మూడు కూడళ్లను అధికారులు ఎంపికచేశారు. పరికరాలను అమర్చేందుకు సరఫరాదారులను ఎంపికచేశారు. మరో నెల రోజుల వ్యవధిలో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి.


పరిమితి మించగానే.. 

కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన కాలుష్య నమోదు పరికరాలు పలు ప్రత్యేకతలతో కూడుకున్నవి. ఇవి ఏ సమయంలో కాలుష్య తీవ్రతలు ఎంత మేర ఉన్నాయో ఎప్పటికప్పుడు నమోదుచేయడంతో పాటు, డిస్‌ప్లే చేస్తాయి. ముఖ్యంగా కార్బన్‌, శబ్దకాలుష్యాలను మాత్రమే నమోదుచేస్తాయి. అంతే కాదు కాలుష్య తీవ్రతలు పరిమితికి మించగానే ఎక్కువగా ఉన్న కూడలిలో కాలుష్యం అధికంగా ఉందని ఆడియోల ద్వారా హెచ్చరికలు చేస్తాయి. క్షణాల వ్యవధిలో ఈ పరికరాలు కాలుష్య తీవ్రతలను పసిగట్టి, వాటి తీవ్రతలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించనున్నాయి. ఆయా సందేశాన్ని మైకుల ద్వారా వినిపించనున్నాయి. ఇలాంటివి ప్రస్తుతానికి మూడు ఏర్పాటు చేస్తుండగా, వీటి పనితీరు సక్రమంగా ఉంటే మరికొన్ని కూడళ్లలో ఏర్పాటు చేయాలని పీసీబీ అధికారులు భావిస్తున్నారు. 


* గ్రేటర్‌లో 3200 జంక్షన్లు ఉంటే 1400 జంక్షన్లల్లో 30 సెంకడ్లకు మించి సిగ్నల్స్‌ పడుతున్నాయి. కొన్ని సార్లు 2 నిమిషాలు, 90  -180 సెంకడ్లు కూడా పడుతున్నాయి.

* ఒక్కో సిగ్నల్‌ వద్ద గరిష్టంగా 200 వాహనాలు నిలుస్తున్నాయి. ఒక వాహనం 40 పీపీఎం కార్బన్‌డయాక్సైడ్‌ చొప్పున కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఇలా ఒక్కో సిగ్నల్‌ వద్ద ఆగేవారు 8 వేల పీపీఎం కార్బన్‌డయాక్సైడ్‌తో పాటు ఇతర కాలుష్యాన్ని పీల్చుకుంటున్నారు. గమ్యస్థానానికి చేరేవారు 4 -5 సిగ్నళ్లు దాటుతున్నారు. అంటే కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని పీలగా అయిపోయి.. నిస్సత్తువ ఆవహించి క్రమంగా రోగాలపాలవుతున్నారు.  


* 1992లో నగరంలో 500 టన్నులపొగ వెలువడగా, 2016కు 1500 టన్నులకు చేరింది.  

* ఇక నగరంలోని 585 ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద నమోదయ్యే కాలుష్యాన్ని నమోదుచేస్తే.. వీటిలో 125 కూడళ్లలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్నదని, 210 కూడళ్లలో కాలుష్య హెచ్చతగ్గులు, మిగతా 250 కూడళ్లలో సాధారణ స్థాయిలోనే ఉన్నట్లుగా తేల్చారు. 


కార్బన్‌ పొగలు.. ఆరోగ్యంపై ప్రభావం

గ్రేటర్‌లో నమోదువుతున్న కాలుష్యంలో 51 శాతం వాహనాల నుంచే పోగవుతున్నది. ముఖ్యంగా కూడళ్లలో పెద్దమొత్తంలో పొగలు పేరుకుపోతున్నాయి. దీనిపై పలుమార్లు అధ్యయనం చేయించిన పీసీబీ అధికారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కాలుష్యం భారీగా పెరుగడాన్ని గుర్తించారు. వాహనాల రద్దీ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లోనే, ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాలుష్యం అత్యధికంగా నమోదువుతున్నది. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం సైతం కాలుష్య తీవ్రతల పెరుగుదలకు కారణమవుతున్నది. గ్రేటర్‌లో 40 లక్షల పైచిలుకు వాహనాలు ప్రతీరోజూ రోడ్డెక్కుతున్నాయి. వీటి నుంచి అత్యధికంగా కార్బన్‌డయాక్సైడ్‌ పొగలు వెలువడి వాహనదారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నది. వాహనాల నుంచి వెలువడుతున్న శబ్దాలు సైతం ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా సిగ్నళ్ల వద్ద ఇంజిన్‌ ఆపాల్సి ఉన్నా.. వాహనదారులు రెట్టించిన ఉత్సాహంతో ఎక్స్‌లేటర్‌ను నొక్కుతున్నారు. ఫలితంగా కాలుష్య తీవ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. కాలుష్యాన్ని పీల్చుకుని, అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.


సిగ్నళ్లు ఇవే.. 

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో -  ఈసీఐఎల్‌ సిగ్నల్‌ 

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో -  ఖైరతాబాద్‌ / 

                                                       పోలీస్‌ కంట్రోల్‌ రూం సిగ్నల్‌

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో -  మాదాపూర్‌ సిగ్నల్‌ 


logo