గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 06, 2020 , 01:16:16

‘ట్రాన్స్‌పోర్ట్‌' నీళ్లు..నిర్వహణ ‘జోన్లు’

‘ట్రాన్స్‌పోర్ట్‌' నీళ్లు..నిర్వహణ ‘జోన్లు’

హైదర్‌నగర్‌ : మొక్కల పరిరక్షణకు బల్దియా మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. జోన్‌ కార్యాలయాల పరిధిలోని ట్యాంకర్ల నిర్వహణను బల్దియా ట్రాన్స్‌పోర్ట్‌ విభాగానికి అప్పగించనున్నది. ట్రిప్పులు తగ్గిస్తూ.. సరిగా మొక్కలకు నీళ్లు పోయడం లేదనే ఆరోపణల నేపథ్యంలో.. ట్యాంకర్ల నిర్వహణను ట్రాన్స్‌పోర్ట్‌ విభాగానికి అప్పగించాలని నిర్ణయించింది. ఇక మొక్కల నిర్వహణ మాత్రమే జోన్‌  కార్యాలయాల పరిధిలో ఉండనుంది.


 మొక్కల పరిరక్షణకు బల్దియా కొత్త ప్రతిపాదనతో ముందుకు వెళ్తుంది. పచ్చదనం పరిరక్షణకు ప్రత్యేక ట్యాంకర్లను టెండర్‌ ప్రక్రియ ద్వారా జోన్‌ల స్థాయిలో అద్దెకు తీసుకుంటుండగా.. అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలివ్వటం లేదని అధికారులు గుర్తించారు. టెండర్లు పొందిన గుత్తేదారులు అరకొరగా ట్యాంకర్లతో నీటిని పోస్తూ .. చాలా ట్రిప్పులను ఎగ్గొడుతూ అటు బల్దియా ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా.. మొక్కలు ఎండిపోయేందుకు కారణమవుతున్నారు. ప్రధానంగా నగరంలోని 5 జోన్లలో బయోడైవర్సిటీ వింగ్‌ ఉన్నప్పటికీ తగినంత సిబ్బంది లేకపోవటంతో వాటరింగ్‌ ప్రక్రియను సరిగా పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో కలుగుతున్న ట్యాంకర్ల టెండరింగ్‌ ప్రక్రియను జోన్ల నుంచి తొలగించి , బల్దియాలోని ట్రాన్స్‌పోర్టు విభాగానికి అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను  బయోడైవర్సిటీ విభాగం ఉన్నతాధికారుల నుంచి బల్దియా కమిషనర్‌ పరిశీలనకు పంపించారు. ఉన్నతాధికారుల ఆమోదం లభిస్తే ఈ నెలాఖరు నుంచే ట్యాంకర్ల టెండర్ల ప్రక్రియ బల్దియాలోని ట్రాన్స్‌పోర్టు విభాగం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. 


తద్వారా కేవలం జోన్లు టెండర్ల ప్రక్రియ నుంచి ఉపశమనం పొంది  వాటి పర్యవేక్షణకు పరిమితం కానున్నాయి. దీంతో  ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం టెండర్‌ ప్రక్రియను చేపట్టడం వల్ల  బల్దియాకు లక్షలాది రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంటుందని బయోడైవర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క ఇప్పటి వరకూ  ఆయా జోన్ల పరిధిలో వందలాది కిలో మీటర్ల మేర ఉన్న సెంట్రల్‌ మీడియన్‌లపై పర్యవేక్షణ సైతం జోన్లలోని బయోడైవర్సిటీ విభాగం నుంచి బల్దియాలోని  ప్రత్యేక విభాగానికి బదలాయింపు జరిగింది.  ఇక నుంచి జోన్లు కేవలం భారీ పార్కులు, కాలనీ వెల్ఫేర్‌ పార్కుల నిర్వహణ బాధ్యతలు , వాటిలో  పచ్చదనాన్ని కాపాడుతూ, పెంపొందించే పనులను మాత్రమే పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం వేసవి ప్రారంభమైనందున ఇప్పటికే ఆయా జోన్లు పచ్చదనం పరిరక్షణకు సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లను  క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాయి. ఈ అధికారం ట్రాన్స్‌పోర్టు విభాగం చేతుల్లోకి వెళ్లిన తర్వాత  జోన్ల స్థాయిలోని సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లు రద్దవుతాయి. 


మొక్కలు ఎండిపోకుండా..

వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. బయోడైవర్సిటీ విభాగం అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో పనులు చేపడుతున్నారు. ప్రధానంగా భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి వచ్చినా ...మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా వాటికి నీటిని అందిస్తాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే  బయోడైవర్సిటీ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. సుమారు రూ. 40 లక్షల లోపు నిధులతో తగిన చర్యలకు సిద్ధం అవుతున్నారు. మా పరిధిలోని సెంట్రల్‌ మీడియన్‌ పచ్చదనం అంతా జీహెచ్‌ఎంసీ ప్రధాన విభాగం ఆధీనంలోకి వెళ్తుంది. 

-నాగల్ల రవికిరణ్‌, కమిషనర్‌, శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌


logo