మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Mar 05, 2020 , 01:23:30

ఇలా నివారిద్దాం..

ఇలా నివారిద్దాం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. వైరస్‌ దరిచేరకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది. పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నది. బుధవారం పలు పాఠశాలల్లో ప్రచారాన్ని నిర్వహించింది. కరపత్రాలు, పోస్టర్లు, మాస్కులను ప్రదర్శించి అవగాహన కల్పించింది. హైదరాబాద్‌ జిల్లాలో 2,973 పాఠశాలలున్నాయి. వీటిలో 8.50 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాపించకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ముందస్తు జాగ్రత్తల కోసం రూపొందించిన కరపత్రాలను పాఠశాల్లో పంచుతున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి 4 లక్షల కరపత్రాలను తెప్పించారు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అల్లం తినడం, వేడినీళ్లల్లో పసుపు, ఉప్పు వేసుకుని తాగాలని, బయటికి వెళ్లివచ్చాక వేడినీళ్లు పుక్కిలించి ఉమ్మివేయాలని, ఐస్‌క్రీమ్స్‌కు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. కాగా, మహింద్రాహిల్స్‌లో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పలు పాఠశాలలను మూసివేశారు. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, గురువారం నుంచి  పాఠశాలలను యథావిధిగా నిర్వహించాలని డీఈవో వెంకటనర్సమ్మ ఆదేశించారు.


దర్గా హుస్సేన్‌షావలిలో... : దర్గా హుస్సేన్‌షావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రాయదుర్గం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించారు. పరిశుభ్రతే వైరస్‌ నివారణకు చక్కటి మందని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలను వివరిస్తూ వాటిని తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలని చెబుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం జునైద్‌ మొహినుద్దీన్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వెంకటరమణ, ఉపాధ్యాయులు పావని, విజయలక్ష్మి, అశోక్‌ తదితరులు విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు.


logo
>>>>>>