మంగళవారం 07 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 04, 2020 , 01:53:31

రాష్ట్రంలో ‘ఆమె’కు భరోసా

రాష్ట్రంలో ‘ఆమె’కు భరోసా

ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రత్యేక భరోసా కల్పించిందని, మహిళలు ధైర్యంగా  తిరిగే పరిస్థితి  ప్రభుత్వం తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంపట్నం గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘ఆమె తన కోసం’, షీ.. ఫర్‌..హర్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు సంబంధించిన అనేక విషయాలను ఆమె ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, వాటితో వచ్చిన ఫలితాల గురించి ఆమె వివరించారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలతో నేడు తెలంగాణ మహిళలు సగర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఎక్కడైనా మహిళలకు ఆపద వచ్చిన వెంటనే సమాచారం అందిస్తే షీ టీమ్‌ పోలీసులు క్షణాల్లో అక్కడకు చేరుకుని వారికి అవసరమైన భద్రతలు కల్పిస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి మహిళా ఒంటరిగా తిరిగే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇటీవల కాలంలో మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించిన అనేక మందికి అనతికాలంలోనే శిక్షలు పడ్డాయని అన్నారు. ముఖ్యంగా మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించే మృగాల విషయంలో తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించి వారిని కటకటాల వెనుకకు పంపించడంతో పాటు తక్కువ సమయంలోనే విచారణ పూర్తిచేసి వారికి కోర్టుల్లో శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల గురించి ఆమె వివరించారు. యాదాద్రి భువనగిరిజిల్లా, ఆదిలాబాద్‌జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో ఇటీవల చోటుచేసుకున్న  సంఘటనలో మహిళలను వేధించిన వారికి మూడు నెలల్లో శిక్ష పడేలా తెలంగాణ పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు ఏదైనా సంఘటన జరిగితే భయపడకుండా ధైర్యంగా సెల్‌ఫోన్‌ ద్వారా తెలంగాణ పోలీసుల వాట్సప్‌కు మెసేజ్‌ పంపినట్లయితే షీ టీమ్‌ వారు తక్షణమే స్పందించి వారికి తగిన సాయం అందజేస్తారని చెప్పారు. షీ టీమ్‌ విభాగం మహిళల భద్రత తీసుకుంటున్న శ్రద్ధ, చేస్తున్న సాయం ఎంతో అభినందనీయమని ఆమె ప్రశంసించారు. మహిళల భద్రతే ధ్యేయంగా షీ టీమ్‌ విభాగం పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసు ఆధ్వర్యంలో వాట్సాప్‌ సమాచారం అందించడం కోసం 94906 17111ను రాచకొండ పోలీసులు ఏర్పాటు చేశారని, అలాగే, 100 డయల్‌ నెంబర్‌ను కూడా మహిళలకు అందుబాటులో ఉంచారని అన్నారు. ఎవరైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు ఈ నంబర్లను సంప్రదిస్తే మహిళలకు వెంటనే షీటీమ్‌ అందుబాటులోకి  వస్తుందన్నారు. 

 అర్ధరాత్రి ధైర్యంగా తిరిగే పరిస్థితి తీసుకువస్తాం.. 

-  మహేశ్‌భగవత్‌, రాచకొండ సీపీ

తెలంగాణాలో మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా ధైర్యంగా తిరిగే పరిస్థితి త్వరలోనే వస్తుందని, అందుకోసం తెలంగాణ పోలీసు తగు చట్టాలను అందుబాటులోకి తీసుకువస్తుందని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉందని, మరికొంతమందిలో భయం తీసుకువరావల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణాలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలను తీసుకువచ్చిందన్నారు. చట్టాలను అమలు పర్చడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణాలో మహిళలను వేధించే వారిని శిక్షించడం కోసం ప్రత్యేక షీటీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ షీ టీమ్‌లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని, మహిళల పట్ల దాడులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం తీసుకువచ్చిన అనేక చట్టాల గురించి ఆయన వివరించారు. దేశంలో మహిళల నిష్పత్తి గణనీయంగా తగ్గిపోతుందన్నారు. మహిళల నిష్పత్తి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నవారి పట్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఈ పరీక్షల వలన బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నారు. ఇప్పటికే రాచకొండ పోలీసు కమిషనర్‌రేట్‌ పరిధిలో ఈ పరీక్షలు చేస్తున్న సుమారు 20మందిని గుర్తించి కటకటాల వెనుకకు పంపించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు రాచకొండ కమిషనర్‌రేట్‌ పరిధిలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో మహిళల హక్కులను తెలియజేయడంతో పాటు చట్టాలల్లో వారి ప్రాధాన్యత వివరించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలను వేధించే వారి పట్ల తీసుకునే కఠిన నిర్ణయాలు, వరకట్న వేధింపులకు పాల్పడే వారి పట్ల తీసుకునే చర్యలపై వివరించనున్నట్లు తెలిపారు. రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షీ ఫర్‌ హర్‌ అనే నూతన కార్యక్రమాన్ని రాచకొండ కమిషనర్‌రేట్‌ పరిధిలో అనేక ప్రాంతాల్లో నిర్వహించి కళాశాలలో చదువుకునే విద్యార్థినులకు, మహిళలకు మరింత భద్రతను పెంచి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో  షీ టీమ్‌ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందన్నారు.  ప్రతి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇద్దరు సీనియర్‌ విద్యార్థులను ఎంపిక చేసి వారికి షీటీమ్‌ ద్వారా శిక్షణ ఇచ్చి మహిళల కోసం ఉన్న ప్రత్యేక చట్టాలను వాటికి పడే శిక్షలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న ఎల్‌బీనగర్‌ స్టేడియంలో రాచకొండ పోలీసుల  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి మహిళా మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. గురునానక్‌ యూనివర్సిటీ వైస్‌చైర్మన్‌ గగన్‌దీప్‌సింగ కోహ్లీ మాట్లాడుతూ.. మహిళల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపడం కోసం రాచకొండ పోలీసులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ముఖ్యంగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మహిళల కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు.  కార్యక్రమంలో విద్యాసంస్థల ఎండీ ఎస్‌హెచ్‌ షైనీ, ట్రైనీ ఐపీఎస్‌ స్నేహామేరా, క్రైమ్‌ డీసీపీ యాదగిరి, షీ టీమ్‌ రాచకొండ డీసీపీ సలీమా,  ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ గురువారెడ్డి పాల్గొన్నారు. 


logo