మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Mar 04, 2020 , 01:46:59

కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

చేవెళ్ల : కందుల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మీబాయి కోరారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కందుల కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ శాఖ ఏడీ ఛాయాదేవి, ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కందులను పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కందుల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌,ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్లు మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 1193 మంది రైతులకు గాను 7946 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. పత్తి కేంద్రాల్లో 12 లక్షల 22 వేల 929 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతులందరికి సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు పడుతున్నాయన్నారు.ఇప్పటి వరకు జిల్లాలో రూ.1 లక్ష 64 వేల మంది రైతులకు రైతుబంధు పథకం డబ్బులు వారి ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. రైతుబీమా పథకం కింద 360 మంది రైతులు మరణిస్తే ఇప్పటి వరకు 313 మందికి రైతుబీమా పరిహారం చెల్లించినట్లు వివరించారు.మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. పత్తి కొనుగోలు సెప్టెంబర్‌ వరకు చేస్తారని, రైతులు ఎలాంటి అందోళన చెందవద్దన్నారు. రైతులు తాము పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏడీఏ రమాదేవి, ఏవో రంగమ్మ, ఏఈవోలు శివ, రాజేశ్వరరెడ్డి, చేవెళ్ల మార్కెట్‌ కార్యదర్శి ఆపర్ణ, డీసీఎం గోదాం ఇన్‌చార్జి శివారెడ్డి, రైతులు  ఉన్నారు. 

శంకర్‌పల్లి : రైతుల వద్ద కందుల సేకరణలో ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డిప్యూటి డైరెక్టర్‌ లక్ష్మీబాయి అన్నారు.  మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి గీతతో కలిసి శంకర్‌పల్లిలోని కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. కందులు నింపడానికి నాణ్యమైన బస్తాలను వాడాలని డీసీఎంఎస్‌ ఇన్‌చార్జి వెంకటరాజుకు ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు తమ పంటల వివరాలను వ్యవసాయాధికారులకు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఈ ఇబ్బందులు కలిగాయని వెల్లడించారు. కంది పండిస్తామని చెప్పిన రైతులు వర్షాభావంతో ఇతర పంటలు పండించారని తెలిపారు. రైతులు, వీఆర్‌ఓలు, వ్యవసాయాధికారులకు తమ పంటల వివరాలు సక్రమంగా వివరించాలని చెప్పారు. ప్రస్తుతం జాబితాలో  పేర్లు నమోదు కాని రైతుల వద్ద కూడా కందులు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆమె మార్కెట్‌ కమిటీ ఆవరణలోని పశువుల మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్‌ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్యదర్శి వెంకటయ్యను ఆదేశించారు. ఏఎంసీ కార్యాలయ నూతన భవన నిర్వాహణ పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, ఆ పనులను త్వరగా జరిగేలా చూడాలని  చైర్మన్‌ రాజునాయక్‌ డిప్యూటీ డైరెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గీత, జిల్లా మార్కెట్‌ అధికారి ఛాయాదేవి, చేవెళ్ల  ఏడీఏ రమాదేవి, శంకర్‌పల్లి, షాబాద్‌, మొయినాబాద్‌ వ్యవసాయ అధికారులు కృష్ణవేణి, వెంకటేశ్‌, రాగమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>