బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 03, 2020 , 05:46:14

సార్‌..మా ఆయనతో తాగుడు మాన్పించండి

సార్‌..మా ఆయనతో తాగుడు మాన్పించండి
  • మా సంతోషం మీ చేతుల్లో ఉంది
  • తాగనంత వరకు బాగుంటారు తాగితే నరకం చూపిస్తారు
  • మంచి మనుషులుగా తీర్చిదిద్దండి
  • డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌లో పోలీసులకు గృహిణుల విజ్ఞప్తి
  • రాచకొండ కమిషనరేట్‌లో 5వేలకు పైగా వినతులు

‘సార్‌. మా ఆయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. మాకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. నన్ను, పిల్లలను బాగా చూసుకుంటాడు. కానీ తాగి వస్తే మాత్రం ఇంట్లో నరకం చూపిస్తాడు. ఇలా రోజూ తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాడు. ఆయన లేకపోతే నేనూ పిల్లలు రోడ్డున పడతాం. ఏదో ఒకటి చేయండి సార్‌. ఆయనతో తాగుడు మాన్పించండి. మిమ్మల్ని దేవుడిలా కొలుచుకుం టాం’ తమ భర్తలతో తాగుడు మాన్పించాలని గృహిణులు పోలీసులకు చేస్తున్న విజ్ఞప్తి ఇది. మద్యం సేవించి వాహనాలు నడిపి తనిఖీల్లో తమ భర్తలు పట్టుబడితే.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు హాజరైన సందర్భంగా గృహిణులు ఇలా పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. తమ భర్తలు మారితే తమ జీవితాలు ఆనందకరంగా ఉంటాయని వేడుకుంటున్నారు. గతేడాది నుంచి దాదాపు 5వేల మంది రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులకు ఇలా విన్నవించుకోవడం గమనార్హం. 


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  ‘మా ఆయన మంచోడు కానీ తాగుడే నాశనం చేస్తుంది. ఆ తాగుడు మాన్పించి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దండి సార్‌'..అంటూ కౌన్సెలింగ్‌కు వస్తున్న గృహిణులు రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. తాము ఏనాడూ పోలీసు స్టేషన్ల వద్దకు రావద్దనుకున్నా మీకు పట్టుబడి స్టేషన్‌మెట్లు ఎక్కిస్తున్నారని వాపోతున్నారు. వారి తాగుడు అలవాటుతో ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇంట్లో భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో తాగుడుకు పెడుతున్న ఖర్చుతో ఇంట్లో తినడానికి కూడా కరువు ఏర్పడుతుందని మహిళలు రోధిస్తున్నారు. తాగి డ్రైవింగ్‌ చేయకుండా చట్టపరంగా కఠిన చర్యలతో భయం పుట్టించాలని పోలీసులను కోరుతున్నారు.*మా ఆయన పనిచేస్తే మా కుటుంబానికి బువ్వ దొరుకుతుంది. కానీ ఎంత చెప్పినా వినడం లేదు సంపాదించిందంతా తాగుడుకు పెడుతున్నాడు. అడిగితే కొడుతున్నాడు. ఎలాగైనా తాగుడు మాన్పించండి సారూ..

*నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తాగనంతవరకు మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. తాగితే ఇక మేమంతా భయపడాల్సిందే. కొంచెం మద్యం జోలికి వెళ్లకుండా చేయండి ప్లీజ్‌..

*మా వారు మద్యం తాగనంతవరకు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు. పిల్లలకు, నాకు ఏమికావాలో సమకూరుస్తాడు.. కానీ మద్యం తాగితే ఇంకా అంతే మేము హడలిపోవాల్సిందే. తాగకుండా ఏమైనా అవకాశాలు ఉంటే చూడండి.

*నా భర్త ఇంటికి వచ్చే వరకు నేను, పిల్లలు మొక్కనిదేవుడు లేడు...ఎందుకంటే మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తుండడంతో ఎక్కడ విషాద వార్త వినాల్సి వస్తుందనే భయం. తాగి నడపకుండా చూడండి సారూ...


30 గ్రాముల మత్తు దాటితే 6నెలలు జైలు

100 మిల్లీలీటర్ల రక్తంలో 30గ్రాముల మత్తు దాటితే అది చట్టపరంగా నేరమే. మోటారు వెహికిల్‌ యాక్ట్‌లోనే శరీరంలో 30గ్రాముల మత్తు (బ్లడ్‌ ఆల్కాహాల్‌ కాన్‌సెంట్రేషన్‌) కౌంట్‌ దాటితే 6నెలలు జైలు శిక్ష ఉంది. కౌన్సెలింగ్‌లో మందుబాబుల భార్యలు వారి భర్తలకు తాగుడు మాన్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతుండడం బాధ కలిగిస్తుంది. మద్యం సేవించి వాహనం నడిపే ప్రతిఒక్కరికి శిక్ష పడితే వారిలో మార్పు వస్తుందని భావిస్తున్నాం. ఇప్పుడు చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత పడుతున్న శిక్షల సంఖ్య ఇంకా పెరుగాల్సిన అవసరం ఉంది. 

- జోసెఫ్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌, టీటీఐ కేంద్రం


భర్త ఎదుట చెబితే రచ్చ చేస్తాడని...

భర్త ఎదుట తాగుడు మాన్పించమని పోలీసులకు చెబితే మరోరచ్చ అవుతుందని గృహిణులు...కౌన్సెలింగ్‌ తర్వాత సంతకాలు పెట్టడానికి వెళ్లినప్పుడు ట్రాఫిక్‌ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఒక్కరుకాదు ఇద్దరుకాదు ఏకంగా 5వేల మంది గృహిణులు పోలీసులను కోరడం విశేషం. ఇలా ఎన్నో విజ్ఞప్తులను స్వీకరిస్తున్న ట్రాఫిక్‌ అధికారులు చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటున్నాయో వివరిస్తూ జైలుకు వెళ్లొస్తే ఎంత ప్రమాదమో...అవకాశాలను ఎలా కోల్పోతారో వెల్లడిస్తున్నారు. దీంతో చాలామంది మందుబాబులు మారుతున్నప్పటికీ ఇంకా కొంతమంది మారడం లేదని పోలీసులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ తీసుకున్న వారిలో 85శాతం మారుతుంటే కొత్తవారు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడడం పోలీసులను కలవరానికి గురిచేస్తుంది.

 

16,308 మందికి కౌన్సెలింగ్‌

2019లో డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారు 6,552మంది. 2020 లో పట్టుబడిన వారు 1652మంది ఉన్నారు. మందుబాబుల భార్యలు, తల్లిదండ్రులతో కలిపి 2019లో 13,004 మందికి, 2020 (ఫిబ్రవరి వరకులో 3,304 మందికి రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి మార్పు కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు తాగి నడిపితే కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాలపై వాస్తవ వీడియో దృశ్యాలతోపాటు మద్యం మత్తులో రోడ్లపై చేసే డ్రైవింగ్‌ను కూడా చూపిస్తున్నారు. అలాగే తాగుడు మాన్పించడానికి స్వచ్ఛంద సంస్థతో కలిసి చిట్కాలు, కుటుంబంతో కలిసి జీవిస్తే ఎంత సంతృప్తి ఉందో వివరిస్తున్నారు. 


logo
>>>>>>