సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Mar 02, 2020 , 06:02:18

ఆరోగ్యం.. ఆహ్లాదం

ఆరోగ్యం.. ఆహ్లాదం
  • సిద్ధమవుతున్న ఆక్సిజన్‌ పార్కులు
  • హెచ్‌ఎండీఏ పరిధిలో 16 చోట్ల రిజర్వ్‌ ఫారెస్ట్రీ బ్లాకులు

ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పంచే ఆక్సిజన్‌ పార్కులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు   హెచ్‌ఎండీఏ  పరిధిలో 16 చోట్ల ఉద్యానవనాలు సిద్ధమవుతున్నాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని అటవీ భూములను 16 చోట్ల రిజర్వు ఫారెస్ట్‌ బ్లాకులుగా అభివృద్ధి చేస్తున్నారు. 


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది..ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నా రు..వాకింగ్‌, ఫిజికల్‌ యాక్టివిటీని పెంచుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆహ్లాదం, ఆక్సిజన్‌ పార్కుల వైపు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న కాలు ష్య తీవ్రత.. ఉద్యోగాల ఒత్తిడి.. పట్టణీకరణ.. వెరసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్స్‌కు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 16చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ (ఉద్యానవనా)లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీకెండ్‌ రోజుల్లో పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఔటర్‌ చుట్టూరా ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఈ పార్కులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. 

రంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో రూ.96.64 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇంటెన్వీవ్‌ మెథడ్‌ పద్ధతిలో లక్షలాది మొక్కలను ఇప్పటికే అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం అధికారుల పర్యవేక్షణలో నాటారు. అటవీ భూముల చుట్టూ(పార్కుల) కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రహరీ గోడ నిర్మాణం, కనువిందు చేసే ప్రవేశ ద్వారం పనులు చేపట్టారు. ఒకటి రెండు చోట్ల న్యాయపరమైన చిక్కులతో పనుల్లో అంతరాయం ఏర్పడుతుందని, పనులు పూర్తయిన చోట పార్కులను త్వరలోనే విడుతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నామని అర్బన్‌ఫారెస్ట్రీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.


ఆహ్లాదానికి చక్కని వేదిక.. 

ఇంతకాలం గుబురు పొదలతో, చెత్తా చెదారాలతో వృథాగా ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాలు ప్రకృతి రమణీయ వాతావరణాన్ని సంతరించుకోనున్నాయి. స్థానిక ప్రజలతో పాటు వీకెండ్‌ రోజుల్లో పట్టణ ప్రజలు రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు నడక కోసం వాకింగ్‌ పాత్‌వేలను సైకిలింగ్‌ కోసం సైకిల్‌ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్‌ కార్నర్‌లు రానున్నాయి. యోగా సెం టర్లను, జనం కూర్చోవడానికి భారీ వృక్షాల కింద రచ్చబండలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఔటర్‌ చుట్టూ జాతీయ రహదారుల వెంట ఈ పార్కులు ఉండడంతో ప్రయాణికులతోపాటు వనభోజనాలకు చక్కటి వేదికగా నిలువనున్నాయి. సెక్యూరిటీ రూం, టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న ఈ అర్బన్‌ ఫారెస్ట్రీ బ్లాక్స్‌ వద్ద కుటుంబ సమేతంగా కాసేపు సేద తీరేందుకు ఎంతగానో దోహదపడనున్నాయని అధికారులు తెలిపారు. 


logo