బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 26, 2020 , 01:09:26

భిక్షమెత్తుకోకుండా సుస్థిర పునరావాసం

భిక్షమెత్తుకోకుండా సుస్థిర పునరావాసం
  • యాచకుల కోసం జీహెచ్‌ఎంసీ ప్రణాళిక
  • పోలీసు శాఖ, ఎన్జీవోల ఆధ్వర్యంలో సర్వే
  • రోగులు, వృద్ధులు, అనాథలుగా విభజన
  • అర్హతల ఆధారంగా వృత్తి నైపుణ్య శిక్షణ
  • మానసిక, శారీరక వ్యాధులకు చికిత్స
  • సర్కిళ్ల వారీగా కమిటీలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : యాచకులకు సుస్థిర పునరావాసం కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. సర్కిళ్ల వారీగా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నది. ఈ నెలాఖరులోగా కార్యప్రణాళిక అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌ను కేంద్రం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు, ఎన్జీవోల సహకారంతో సర్వే నిర్వహించి యాచకులను గుర్తిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందిస్తారు. యాచకుల అర్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తారు. 


కేంద్ర ప్రభుత్వం యాచకులకు పునరావాసం కల్పించడం ద్వారా యాచకవృత్తి లేకుండా చేసే లక్ష్యంతో జాతీయస్థాయిలో ప్రచారోద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా యాచకుల రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌ సహా మరో పది నగరాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఎన్‌జీఓలు, పోలీసుశాఖ, జీహెచ్‌ఎంసీకి చెందిన అధికారులతో నగరంలో ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఓ కార్యప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యాచకుల పునరావాసానికి కార్యప్రణాళికను సిద్ధంచేసిన అధికారులు ఈ నెలాఖరులోగా ఇది అమల్లోకి వచ్చే విధంగా చూడాలని నిర్ణయించారు. సర్కిళ్లవారీగా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసుకొని కార్యప్రణాళికకు అనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. 


యాచకుల పునరావాస కార్యప్రణాళిక

  • పోలీసు శాఖ, ఎన్‌జీఓల సహకారంతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో యాచకుల గుర్తింపునకు సర్వే.
  • గుర్తించిన యాచకుల్లో పిల్లలు, వృద్ధులు, మానసిక రోగులు, ఇతర రోగులు, వికలాంగులు, కుటుంబాలు ఉన్నవారు, అనాథలు తదితరుల విభజన
  • దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న యాచకులకు సమీపంలోని ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా దవాఖానలు, రెఫరెల్‌ దవాఖానల ద్వారా వైద్య సౌకర్యం
  • వారి అవసరాలకు తగ్గట్టు కెరీర్‌ కౌన్సెలింగ్‌, వృత్తినైపుణ్య శిక్షణ, బ్రిడ్జి కోర్సుల్లో ప్రవేశం, అర్హతలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు
  • మానసిక రోగులు, వ్యాధులతో బాధపడుతున్నవారికోసం జోన్‌కి ఒకటి చొప్పున ట్రాన్సిట్‌ హోమ్‌ల ఏర్పాటు. ఉచిత భోజన సౌకర్యం
  • యాచకులకు గుర్తింపు నుంచి వారికి సుస్థిర పునరావాసం కల్పించేవరకు అన్ని దశల్లో ఎన్‌జీఓల సహకారంతో ముందుకు సాగడం
  • సీఎస్‌ఆర్‌ ద్వారా కానీ, వివిధ శాఖల ద్వారా కానీ, కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ద్వారా కానీ నిధుల సమీకరణకు గల అవకాశాలను అన్వేషించడం, నిధులు సేకరించడం జరుగుతుంది.


సర్కిళ్లవారీగా కమిటీలు

స్థానిక కార్పొరేటర్‌లు, పోలీసు, సివిల్‌, ట్రాఫిక్‌, షీ బృందాల ప్రతినిధులు, రెవెన్యూ, పౌరసరఫరాలు, ఐసీడీఎస్‌, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ప్రాథమిక, ఉన్నత, బస్తీ దవాఖానలు, ఏరియా దవాఖానలు, సాంఘిక సంక్షేమం, కార్మిక సంక్షేమం, స్థానిక ఎన్‌జీఓలు, నివాస, కాలనీ సంక్షేమ సంఘాలు, ఇతర సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు.


logo