ఆదివారం 06 డిసెంబర్ 2020
Rangareddy - Feb 24, 2020 , 01:52:01

అక్షరాస్యత లక్ష్య ం.. 100 శాతం

అక్షరాస్యత లక్ష్య ం.. 100 శాతం

సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు  హైదరాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత నగరంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిరక్షరాస్యులను గుర్తించడానికి సోమవారం నుంచి మార్చి  4 వరకు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో కార్పొరేటర్లు, శాసనసభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌  కోరారు. -సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ


సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునకు అనుగుణంగా హైదరాబాద్‌ను 100 శాతం అక్షరాస్యత ఉన్న నగరంగా తీర్చిదిద్దే సర్వే కార్యక్రమంలో కార్పొరేటర్లు, శాసన సభ్యులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని 150 వార్డులను, 5704 ఆవాస ప్రాంతాలుగా గుర్తించి, సర్వేకు అనుగుణంగా బ్లాకులుగా విభజించినట్లు తెలిపారు. నగరంలో ఒక కోటి జనాభా ఉండగా దాదాపు 24 లక్షల 78 వేల కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి బ్లాకుకు ఒకరు చొప్పున 8681 మంది ఎన్యుమరేటర్లను నియమించినట్లు తెలిపారు. అలాగే ప్రతి వార్డుకు ఒక సూపర్‌వైజర్‌ను వార్డులోని సర్వే ప్రక్రియ మానిటరింగ్‌ చేయుటకు ప్రతి సర్కిల్‌కు సంబంధిత యూసీడీ డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్‌ను సర్కిల్‌ సూపర్‌వైజర్‌గా, డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. నగరంలో 40వేల స్వయం సహాయక సంఘాలు, 1300 స్లమ్‌లెవెల్‌ ఫెడరేషన్స్‌ ఉన్నాయన్నారు. నూరు శాతం గృహాలను సర్వే చేసేందుకు సంఘాలను సమాయత్తం చేశారు. 

ప్రతి ఇంటికి తిరిగి నిరక్షరాస్యుల వివరాలు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించుటకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సర్కిల్‌స్థాయిలో శిక్షణ ఇచ్చారు. సర్వే రిజిస్టర్లు, ప్రొఫార్మాలను ఎన్యుమలేటర్లకు అందజేశారు. స్లమ్‌లెవెల్‌ ఫెడరేషన్లు, సెల్ప్‌ హెల్ఫ్‌ గ్రూపులకు చెందిన రిసోర్స్‌ పర్సన్స్‌, చదువుకున్న ఆఫీస్‌ బేరర్స్‌ను ఎన్యుమరేటర్లుగా నియమించారు.


 ఈ సర్వేలో రాయడం, చదవడం రాని వారి వివరాలు సేకరించడం జరుగుతుంది. నిరక్షరాస్యుల మాతృభాష వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. సర్వేతోపాటు నిరక్షరాస్యుల డేటాను 10 రోజుల్లో కంప్యూటరైజేషన్‌ చేస్తారు. ఇంట్లో ఉన్న విద్యావంతులతోనే నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయిస్తారు. అవసరమైతే బంధువులు, ఇంటి పక్కన ఉండేవారి సహకారం తీసుకుంటారు. స్వల్ప కాలంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించుటకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. నిరక్షరాస్యుల సర్వే ప్రక్రియలో పాల్గొని, ఎన్యుమరేటర్లకు సహకరించాలని కార్పొరేటర్లను మేయర్‌ కోరారు.