సోమవారం 30 మార్చి 2020
Rangareddy - Feb 23, 2020 , 00:28:47

బల్దియాకు..నూతన చట్టం

బల్దియాకు..నూతన చట్టం
 • పచ్చదనం.. పారిశుధ్యం బాధ్యత మేయర్‌, కార్పొరేటర్లదే
 • జీహెచ్‌ఎంసీ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీలు
 • పౌరసేవల్లో జాప్యం జరిగితే అధికారులకు జరిమానాలు
 • ఏకీకృత సర్వీసు నిబంధనల అమలు
 • పన్నులు, ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉండేలా మార్పులు
 • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీ

సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఒక చట్టం ఉంటే జీహెచ్‌ఎంసీకి మరో చట్టం ఉంది.ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తించే నిబంధనలు, చట్టాలను జీహెచ్‌ఎంసీకి కూడా వర్తింపజేయడంతోపాటు బల్దియాకు కూడా ఏకీకృత సర్వీసు నిబంధనల పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. 


ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ...  

ప్రస్తుతం నగరంలో జీహెచ్‌ఎంసీ చట్టం-1955 అమల్లో ఉంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు దీంతో సంబంధం లేదు. దీన్ని మార్చాలని ఎంతోకాలంగా ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవలే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెచ్చింది. ఇదే క్రమంలో జీహెచ్‌ఎంసీ చట్టాన్ని కూడా సవరించడం ద్వారా నూతన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించారు.  మార్చిలో జరిగే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో జీహెచ్‌ఎంసీ నూతన చట్టానికి ఆమోదముద్ర పడనుంది. ఈ అంశాన్ని శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా వెల్లడించారు. నూతన జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఇదివరకే మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన మున్సిపల్‌ చట్టం స్ఫూర్తితో జీహెచ్‌ఎంసీ నూతన చట్టాన్ని రూపొందించాలని మంత్రి స్పష్టం చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా కసరత్తు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ఏడాది సమయం ఉండడంతో ఈలోగా చట్ట సవరణ పూర్తిచేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.


ప్రతిపాదిత ముఖ్యాంశాలు....

 • నూతన జీహెచ్‌ఎంసీ చట్టంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగించడంతోపాటు పారిశుధ్యం, పచ్చదనం, అక్రమ నిర్మాణాలు తదితరవాటికి వీరినే బాధ్యులను చేయాలని నిర్ణయించారు.  లేనిపక్షంలో కమిషనర్‌ ద్వారా, లేక జిల్లా కలెక్టర్‌ ద్వారా వారిని పదవినుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాదు, జీహెచ్‌ఎంసీ పాలకమండలి చేసే ఏ తీర్మానానైనా ప్రభుత్వం తిరస్కరించవచ్చు, రద్దు చేయవచ్చు. 
 • అంతేకాదు, పౌరసేవల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారిని బాధ్యుడిని చేస్తూ అతని నుంచి జరిమానా వసూలు చేసేలా నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం రూపకల్పనకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 
 • ప్రధానంగా ఏకీకృత సర్వీసుల పరిధిలోకి జీహెచ్‌ఎంసీని చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకాలం ఉద్యోగుల బదిలీలు కేవలం బల్దియా పరిధిలోనే జరుగుతుండగా, చట్ట సవరణ అనంతరం రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీలు చేసే అవకాశం కలుగుతుంది. 
 •  ఇంటి నిర్మాణ నిబంధనలు సైతం మారనున్నాయి. 75గజాల వరకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే 500 గజాల స్థలం, పదిమీటర్ల ఎత్తువరకు నిర్మించే వ్యక్తిగత గృహాలకు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుంది. అయితే, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేసేందుకు కూడా నిబంధనలు రూపొందిస్తున్నారు. 
 • ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సులు, ప్రకటనల పన్ను తదితరవాటిల్లోనూ సవరణలు ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మున్సిపల్‌ చట్టం ప్రకారం భూమి విలువ ఆధారంగా ఆస్తి పన్నులు నిర్థారిస్తున్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో మాత్రం అనేక రకాల కేటగిరీలు అమలు చేస్తున్నారు. ఇందులో పారదర్శకత లేకపోవడంతో భారీగా అవినీతి చోటు చేసుకుంటున్నది. దీంతో ఆస్తిపన్నును కూడా సమూల మార్పులు తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. భూమి విలువ ఆధారంగా రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ విధానాన్ని పక్కాగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 


logo