శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rangareddy - Feb 21, 2020 , 03:58:01

ఓఎల్‌ఎక్స్‌ వద్దే వద్దు..!

ఓఎల్‌ఎక్స్‌ వద్దే వద్దు..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓఎల్‌ఎక్స్‌.. 90 శాతానికిపైగా సైబర్‌ నేరగాళ్ల ఫేక్‌ ప్రకటనలతోనే నిండిపోతున్నది. ఆర్మీ అధికారుల పేరుతో పెడుతున్న ఫేక్‌          ప్రకటనల పోస్టులే అధికంగా ఉంటున్నాయి. తక్కువ డబ్బులకు వస్తువులు వస్తున్నాయనే అత్యాశతో అమాయకులు నిండా మునుగుతున్నారు. సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గతేడాది ట్రై కమిషనరేట్‌ల పరిధిలో 3838 ఫిర్యాదులు అందగా,  సుమారు 14 కోట్ల సొమ్ము లూటీ అయ్యింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, అల్వార్‌ ప్రాంతాలకు చెందిన ముఠాలే ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 


ఓఎల్‌ఎక్స్‌లోని ప్రకటనలకు మీరు ఆర్షితులవుతున్నారా... అయితే ఆ యాడ్స్‌ గురించి ఒకటికి  10 సార్లు ఆలోచించండి.  లేదంటే మీ డబ్బులు పోవడం ఖాయం.. ఎందుకంటే ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనల్లో 90 శాతానికి పైగా సైబర్‌ క్రిమినల్స్‌ పెడుతున్న పోస్టులేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి రోజు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు ట్రై పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో అత్యధికంగా ఆర్మీ, మిలటరీ అధికారుల పేరు మీద పెడుతున్న పోస్టులే. తీరా ఆ ఫొటో పెట్టింది మిలటరీ వారు కాదని సైబర్‌ మోసగాళ్లని తెలిసి షాక్‌కు గురవుతున్నారు. మా డబ్బులు మాకు ఇప్పించగలరని వేడుకుంటున్నారు.  ఫిర్యాదులు చేస్తున్నారు. వీటి దరాప్తు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతున్నది.  తీరా పట్టుకొస్తే వారి నుంచి సొత్తు రికవరీ అసాధ్యంగా మారుతున్నది. దీంతో పోలీసుల పని తీరుపై బాధితులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  గత పదేండ్ల రికార్డులను పరిశీలిస్తే సైబర్‌ మాయగాళ్లు వారి మోసాలతో 100 కోట్లకు పైనే దోచేసి ఉంటారని  అంచనా.


రాజస్థాన్‌లోని అల్వార్‌... భరత్‌పూర్‌ గ్యాంగ్‌ పనే..

రాజస్థాన్‌లోని అల్వార్‌, భరత్‌పూర్‌ ప్రాంతాలు ఓఎల్‌ఎక్స్‌ మోసాలకు అడ్డాలుగా మారాయి. ఇక్కడి యువత పెద్దగా చదువుకోకపోయిన సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టు ఉన్నది. ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల వినియోగంపై అవగాహన ఉన్నది. దీంతో ఇంటర్నెట్‌ నుంచి ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, ఇతర పారా మిలటరీ దుస్తులలో ఉండే ఫొటోలు తీసుకొని వారికి సంబంధించిన వాహనాలు, కార్లు, స్మార్ట్‌ఫోన్లు ఫొటోలు తీసి వాటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నామని ప్రకటనలిచ్చి బోల్తా కొట్టిస్తున్నారు. దీనికి  ఉద్యోగ బదిలీని అత్యవసర కారణంగా చూపిస్తారు. మరికొన్ని సందర్భాల్లో వారి వాహనాలకు మన రాష్ట్రానికి సంబంధించిన నంబర్లను మార్ఫింగ్‌ చేసి అమాయకులను నమ్మిస్తారు. ఇవి విమానాశ్రయం పార్కింగ్‌లో ఉన్నట్లు మాయ చేస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టే వారికి ఫోన్‌ చేసి వారి దగ్గర నుంచి అన్ని పత్రాలు, ఆర్‌సీ కార్డులు  సేకరించి వాటిని తిరిగి అదే ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టి బురిడీ కొట్టిస్తారు. ఇలా ఇప్పుడు భరత్‌పూర్‌, అల్వార్‌ ప్రాంత యువత ప్రతి రోజు కనీసం పది వేలు, లేదా లక్ష సంపాదించాలనే టార్గెట్‌ పెట్టుకుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులను పట్టుకోవడానికి వెళితే దాడికి దిగేందుకూ వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలను ఛేదించుకుని ట్రై పోలీసు కమిషనరేట్‌ పోలీసులు అనేక మంది మోసగాళ్లను పట్టుకువచ్చారు.


అప్రమత్తంగా ఉండాలి.. 

  • ప్రకటనలో ఉన్న వివరాలను  సరి చూసుకోవాలి
  • మిలటరీ , ఇతర పారా మిలటరీ అధికారులమంటూ పెట్టే ఫొటోలను అసలు నమ్మొద్దు. 
  • అడ్వాన్స్‌ డబ్బును వాహనం రిజిస్ట్రేషన్‌ అవ్వగానే ఇస్తామంటే అసలు నమ్మొద్దు.
  • ప్రత్యక్షంగా కలవండి...పత్రాలన్నింటిని స్వయంగా పరిశీలించండి.
  • గుర్తు తెలియని వ్యక్తులు, ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌లు పంపిస్తే వాటిని క్లిక్‌ చేయొద్దు.
  • 20 వేల స్కూటీకి  రూ.1.30 లక్షలు చెల్లించారు...

తక్కువ ధరకు వస్తుందంటే అత్యాశకు పోతున్నారు. 13 లక్షలు విలువ చేసే కారును 6 లక్షలకు అమ్ముతున్నామనగానే ఏమి ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నారు. అంతేందుకు 20 వేలకు స్కూటీ అమ్ముతున్నామని బేరం ఆడిన దానికి 1.30 లక్షలు చెల్లించారు. అసలు మనం మాట్లాడుకున్న ధర ఎంత మనం ఎంత డబ్బు వేస్తున్నామని ఎవరు ఆలోచించడం లేదు. మోసపోయామని గ్రహించే సరికి లక్షల నగదు ఖాళీ అవుతుంది. 


త్వరలో ట్రాయ్‌ పరిధిలోకి

ఇంటర్నెట్‌ ద్వారా వెలుగుచూస్తున్న మోసాలను చూసి త్వరలో ఈ ఇంటర్నెట్‌ పరిధి కూడా ట్రాయ్‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు పోలీసులతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ కసరత్తు  చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసు అధికారులు పలుమార్లు వారితో సమావేశమయ్యారు. ప్రస్తుతం టెలికామ్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ సేవలన్నింటిని ట్రాయ్‌ మానిటరింగ్‌ చేస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ వ్యవహారాలపై నిఘా పెట్టే సరైన విభాగం లేదు. దీంతో మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ సహకారంతో ఇక ఓటీటీ (ఒవర్‌ థి టాప్‌)కింద ట్రాయ్‌ ఇంటర్నెట్‌ సేవలు వారి  పరిధిలోకి వచ్చేస్తాయి.


అసలు మీకు తెలుసా... 

ఓఎల్‌ఎక్స్‌ ప్రధాన కార్యాలయం నైజీరియాలో ఉన్నది.  మన దేశంలో కూడా వారు ఢిల్లీ కార్యాలయంగా రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సైబర్‌ మాయగాళ్లు నైజీరియా దేశానికి చెందిన వారు చాలా మంది ఉండడం పోలీసుల అరెస్టు,  సైబర్‌ నేరాల ఫిర్యాదులపై చేసిన దర్యాప్తులో తేటతెల్లమయ్యింది. కాబట్టి ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలతో తస్మాత్‌ జాగ్రత్త.. మరో విషయం ఏమిటంటే ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనలు ఉచితం కావడంతో వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూడకుండానే ప్రకటనలకు అనుమతి ఇస్తుండటంతో సమస్య వస్తున్నది. ఈ ప్రకటనలపై ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌కు వచ్చే మరికొన్ని పేమెంట్‌ ప్రకటనలకు మాత్రం రశీదులు ఇస్తారు. ఆ వెబ్‌సైట్‌లో వచ్చే ఇతర ప్రకటనలకు ఎలాంటి సమాచారం ఉండదు.  


ఓఎల్‌ఎక్స్‌కు లేఖలు

ఓఎల్‌ఎక్స్‌లో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రకటనలు ఇచ్చి మోసగిస్తున్న నేరాలను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఓఎల్‌ఎక్స్‌ సంస్థకు లేఖలు రాశాం. అమాయకులు మోసపోకుండా అవగాహన కార్యక్రమాలు, కరపత్రాలు, ప్రకటనల ద్వారా అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించి అమాయకంగా మోసపోవద్దు. 

-రోహిణి ప్రియదర్శిని, డీసీపీ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ 


రికవరీకి సహకరించరు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, అల్వార్‌ ప్రాంతాల నుంచి అరెస్టు చేసి తీసుకురావాలంటే ఓ పెద్ద సాహసం చేయాల్సిందే. చేసినా వారు రికవరీకి ససేమిరా సహకరించరు. పూర్తి ఆధారాలతో వెళితే వెయ్యి మంది అడ్డుపడి మోసం చేసిన వ్యక్తిని పట్టుకోనివ్వరు. ఆధారాలు ఉంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తామంటారు తప్పా అతడు మోసం చేశాడని అంగీకరించరు. వారి ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రాణ సంకటాలను ఎదురుకోవాల్సిందే. స్థానిక పోలీసులు కూడా సహకరించరు.

-సీహెచ్‌వై. శ్రీనివాస్‌కుమార్‌, ఏసీపీ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ 


భరత్‌పూర్‌ ముఠా.. పట్టుకోవాలంటే తంటా

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు.. రాజస్థాన్‌కు చెందిన టట్లూబాజీ ముఠా ఇప్పుడు సైబర్‌నేరాల్లో ఆరితేరిపోతుంది.. ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ అధికారులు, పోలీస్‌ కమిషనర్ల ఫొటోలు  పెట్టి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ ప్రాంతంలోని సైబర్‌ నేరగాళ్లు నగర వాసులను నిలువునా ముంచేస్తున్నారు. ఈ ముఠాలను పట్టుకోవడం కోసం వారం రోజుల క్రితం ప్రత్యేక వ్యూహాంతో భరత్‌పూర్‌ వెళ్లిన సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ బృందానికి అక్కడి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. భరత్‌పూర్‌ డివిజన్‌లో 9 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉండే గ్రామాల్లో ఈ సైబర్‌ నేరగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఈ ప్రాంతం హరియానా, ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లోఉంటుంది. మన పోలీసులు ఈ ముఠాలను పట్టుకోవడం కోసం అక్కడకు వెళ్తే స్థానిక పోలీసులు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు.  ఇతర రాష్ర్టాల పోలీసులు అక్కడకు వచ్చిన సమాచారం వెంటనే నేరగాళ్లకు తెలిసిపోతుంది. దీంతో నేరగాళ్లు పక్క రాష్ర్టాలకు పారిపోతున్నారు. ఆ సమీప గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం దర్యాప్తు బృందాలకు అందినా.. తిరిగి మరో రాష్ర్టానికి వెళ్లి అక్కడ దర్యాప్తు చేస్తూ పట్టుకోవాలి.. అక్కడకు వెళ్తే మరో రాష్ట్రంలోకి వెళ్లిపోతుంటారు.  ఇలా దర్యాప్తు కోసం వెళ్లిన పోలీసులను ఈ సైబర్‌నేరగాళ్లు ముప్పుతిప్పలు పెడుతుంటారు.


ఓఎల్‌ఎక్స్‌ మోసాలకు కేంద్రంగా..!

రాజస్థాన్‌కు చెందిన టట్లూ బాజీ ముఠా.. తమ పొలంలో బంగారు కడ్డీలు దొరికాయని, వాటిని తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ అమాయకులను బోల్తా కొట్టించి అక్కడకు పిలిపిస్తారు. అక్కడకు వెళ్లిన వారిని బంధించి దోపిడీ చేస్తారు. కుటుంబ సభ్యులను బెదిరించి బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్‌ చేయిస్తారు. ఇలాంటి మోసాల్లో ఆరితేరిన టట్లూ బాజీ ముఠా బంగారం దొరికిందనే  మాటలు ప్రజలు నమ్మడం లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన రావడంతో ఈ మోసాలు తగ్గాయి. మోసాల్లో ఆరితేరిన ఈ ముఠాలు ఇప్పుడు ప్రకటనల వెబ్‌సైట్స్‌ను వేదికగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, ఫేస్‌బుక్‌లలో ప్రకటనలు ఇస్తారు. కొందరు అమ్ముతున్నట్లు ప్రకటనలు ఇస్తే.. మరికొందరు వాస్తవంగా విక్రయించేందుకు ప్రకటనలు పెట్టే వారికి కొనుగోలుదారులుగా సంప్రదిస్తారు. క్రయ విక్రయాల విషయం మాట్లాడుకునే సమయంలో తాము ఆర్మీ ఉద్యోగులమంటూ నమ్మిస్తారు. ఇటీవల ఈ సైబర్‌నేరగాళ్లు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ ఫొటోను పెట్టి, వస్తువులు విక్రయించినట్లు ఒక ప్రకటన ఇచ్చారు. దీన్ని గుర్తించిన బెంగళూరు ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లి నిందితులను పట్టుకున్నది. బెంగళూరు పోలీసులు ఈ కేసులో స్పందించిన తీరును చూసి భరత్‌పూర్‌ వాసులు సైతం ఆశ్చర్యపోయారు. తెలంగాణ పోలీసులు మినహా .. ఇక్కడకు ఇతర రాష్ర్టాల పోలీసులు చాలా అరుదుగా వస్తుంటారు. ఇలాంటిది బెంగళూర్‌ పోలీసులు మెరుపువేగంగా రావడంపై అక్కడ చర్చకూడా జరుగుతుంది. నేరగాళ్లు బెంగళూర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఫొటో వాడటంతో అక్కడి పోలీసులు తక్షణమే స్పందించినట్లు తెలుస్తున్నది. అన్ని కేసుల్లోనూ అన్ని రాష్ర్టాల పోలీసులు ఇలాగే స్పందిస్తే ఓఎల్‌ఎక్స్‌ సైబర్‌నేరాలకు కేంద్రంగా ఉన్న భరత్‌పూర్‌ సైబర్‌చీటర్స్‌పై ఒత్తిడి పెరిగి నేరాలు కట్టడి చేసే అవకాశముంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


సహకరించని స్థానిక పోలీసులు..

ఓఎల్‌ఎక్స్‌ ప్రకటనల పేరిట జరిగే మోసాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఏడాది క్రితం హైదరాబాద్‌ పోలీసులు 40 మంది బృందంతో భరత్‌పూర్‌కు వెళ్లారు. అయితే అప్పుడే అక్కడి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో తాము పూర్తిస్థాయిలో మీకు సహాయం చేయలేమంటూ వారు  వెనుకంజ వేశారు. సైబర్‌నేరగాళ్లకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ సమీపంలో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అక్కడి పోలీసులు సాయం అందించేందుకు ముందుకురాలేదు. అయితే ఆ పరిస్థితిలో ఇంకా  మార్పు రావడం లేదు. తాజాగా వెళ్లిన బృందానికి సైతం పోలీసులు సహకరించడం  లేదు. హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులు అక్కడి అధికారులతో మాట్లాడారు. అయినా కిందిస్థాయి అధికార యంత్రాంగం మాత్రం సిటీ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు సాయం చేయడానికి  ముందుకురావడం లేదు. భరత్‌పూర్‌ డివిజన్‌కు చెందిన అదనపు డీసీపీతో అక్కడకు వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ బృందం మాట్లాడింది. మరో పక్క ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో హైదరాబాద్‌కు చెందిన పలువురు అధికారులు మాట్లాడారు. అయినా కూడా ఎలాంటి పురోగతి లేదని తెలుస్తుంది. అయితే ఎలాగైన ఓఎల్‌ఎక్స్‌ నిందితులను పట్టుకోవాలనే ఉద్దేశంతో సైబర్‌క్రైమ్‌ పోలీసు బృందం నిరంతరం ప్రయత్నాలు సాగిస్తున్నది. హైదరాబాద్‌ నుంచి వచ్చామని చెప్పగానే అక్కడి పోలీసులు స్పందిస్తూ.. మీకు మేం ఎలాంటి సహాయం చేయలేం.. ఇక్కడ ఉండేది మేము.. మా సార్లు ఎక్కడో ఉంటారు.. వాళ్లు చెప్పిన ప్రతి పనిని మేం చేయాలని లేదు.. అయినా మీరు ఫలాన గ్రామంలోకి వెళ్తే గొడవలు  అవుతాయి.. అది శాంతి భద్రతల సమస్యకు దారి తీస్తుంది. అందుకే మేము మీకు అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వమంటూ కొందరు క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు చెప్తున్నారని అక్కడ దర్యాప్తులో ఉన్న అధికారులు పేర్కొంటున్నారు. 


అప్రమత్తంగా ఉండాలి.. 

ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు ఇస్తూ  మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో చాలా మంది హిందీలో మాట్లాడుతారు.. ఈ నేరగాళ్లకు ఇది కలిసివస్తున్నది. దాంతో పాటు మోసాలు చేసేందుకు సైబర్‌నేరగాళ్లు తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. దీనికి గూగుల్‌ ఉపయోగిపడుతున్నది. ఆర్మీ ఉద్యోగుల పేరిట అమాయకులను బోల్తా కొట్టిస్తూ. అమ్మేవారిని.. కొనేవారిని నిలువునా ముంచేస్తున్నారు. అప్రమత్తంగా ఉండి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కొద్దు.

- కేవీఎం ప్రసాద్‌, సీసీఎస్‌ ఏసీపీ, సైబర్‌క్రైమ్స్‌


అవగాహన పెరగాలి.. అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌నేరాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు  సైబర్‌క్రైమ్‌ పోలీసులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్‌స్టాప్‌లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ప్రార్థన స్థలాలు, మెట్రో తదితర చోట్ల నేరుగా కరపత్రాలు పంచుతూ సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జరుగుతున్న నేరాలను వీడియో రూపంలో చూపిస్తూ, అలాంటి మోసాల బారిన పడవద్దంటూ సినీ ప్రముఖులతో వీడియోలు రూపొందించి, సోషల్‌మీడియా ద్వారా వాటిని ఏడాది క్రితం సర్క్యూలేట్‌ చేశారు. వీటికి మంచి స్పందన రావడంతో మరిన్ని కొత్త వీడియోలను తయారు చేయించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మ్యాట్రీమోనీ, జాబ్‌, ఫేస్‌బుక్‌, లోన్‌ తదితర మోసాలపై వీడియోలను రూపొందించిన పోలీసులు గిఫ్ట్‌, లాటరీల పేరుతో నైజీరియన్లు చేసే మోసాలపై అవగాహన కల్పించడానికి వీడియోలను రూపొందిస్తున్నారు.

 

అత్యాశ.. అవగాహన లేమితో.. 

ఓటీపీలు, యూపీఐ, కాల్‌సెంటర్‌ నంబర్‌ సర్చ్‌ చేయడం, ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, ఫేస్‌బుక్‌ లాంటి వెబ్‌సైట్లలో ప్రకటనలతో సైబర్‌నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది 45 రోజుల్లో 300 వరకు కేసులు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో నమోదయ్యాయి. అన్ని రకాల మోసాలు సైబర్‌లో జరుగుతుండటంతో ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావడం కోసం పోలీసులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు.  నిర్లక్ష్యం, అత్యాశ, అవగాహన లేమితోనే ఎక్కువగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి అవగాహన అవసరమని పోలీసులు భావిస్తున్నారు, ప్రతి ఒక్కరిలో అవగాహన వస్తే  సైబర్‌నేరాలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొంటున్నారు.


వీడియోలతో అవగాహన.. 

సైబర్‌ నేరగాళ్లు అమాయకులను దోచుకోవడానికి పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు నైజీరియన్లు ఆశ చూపి అందిన కాడికి దోచేస్తుంటారు. నైజీరియన్స్‌ ఎలాంటి మోసాలకు పాల్పడుతుంటారు, ఎలా గుర్తించాలనే అంశాలపై వీడియో రూపంలో  అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

- కేవీఎం ప్రసాద్‌, సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ