శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 16, 2020 , 23:07:15

గ్రేటర్‌లో యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు

గ్రేటర్‌లో యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు

గండిపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పరిధిలో 14 ఏండ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి.. 9 నెలల క్రితం భూమి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్‌ చేశారు. బండ్లగూడ జాగీర్‌లో 300 చదరపు గజాల స్థలాన్ని చనిపోయిన వ్యక్తి విక్రయించినట్లుగా సృష్టించి మరొకరికి కట్టబెట్టారు.

  • సహకరిస్తున్న రిజిస్ట్రార్లు..!
  • గగ్గోలుపెడుతున్నఅసలు హక్కుదారులు
  • నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టిస్తున్న వైనం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: - గండిపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పరిధిలో 14 ఏండ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి.. 9 నెలల క్రితం భూమి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్‌ చేశారు. బండ్లగూడ జాగీర్‌లో 300 చదరపు గజాల స్థలాన్ని చనిపోయిన వ్యక్తి విక్రయించినట్లుగా సృష్టించి మరొకరికి కట్టబెట్టారు. ఆధార్‌కార్డులను పరిశీలిస్తే చనిపోయిన వ్యక్తి ఆధార్‌కార్డును మార్ఫింగ్‌చేసి, మరో వ్యక్తిపేరుతో ఆధార్‌కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించినట్లుగా తేలింది.

- ఇలాంటి వ్యవహారమే కూకట్‌పల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కేంద్రంగా సైతం జరిగింది. హైదర్‌నగర్‌లోని 300 గజాల స్థలాన్ని కాజేసేందుకు 1996లో చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు సృష్టించి మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇలా గ్రేటర్‌లో నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇది గమనించిన అసలు హక్కుదారులు మేల్కొని కేసులుపెట్టడం, పోలీసుల తమ స్థాయిలో కోటింగ్‌ ఇవ్వడంతో అక్రమాల గుట్టురట్టవుతున్నది. ఇలాంటి ఘటనలు కోకొల్లులుగా జరుగుతున్నా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. స్టాంప్స్‌, అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ అధికారులు ఇకనైనా తగు చర్యలు తీసుకుని ఇలాంటి వాటికి అడ్డుకట్టవేయాలని పలువురు కోరుతున్నారు.


ఉల్లంఘనలనేకం.. 

స్థలాలు, ఇండ్ల రిజిస్ట్రేషన్‌ సమయంలో కొనుగోలుదారులు, విక్రయదారుల ఆధార్‌నంబర్లను రిజిస్ట్రార్లు తనిఖీచేయాలి. ఈకేవైసీలోని ఆధార్‌లో ఎవరెవరున్నారో సరిపోల్చుకోవాలి. కానీ అలా జరగడంలేదని క్షేత్రస్థాయి వాస్తవాలు వెల్లడిస్తున్నాయి.ఇక రిజిస్ట్రేషన్‌ సమయంలో వీడియో రికార్డింగ్‌ చేయాలి. సేల్‌డీడ్‌ అయితే పాన్‌కార్డు ఉండాల్సిందే. మరో కిటుకేంటంటే రూ. 5లక్షలకు మించిన లావాదేవీలకు సైతం పాన్‌కార్డు తప్పనిసరి. ఇన్ని నిబంధనలు పెట్టినా తప్పుడు ఆధార్‌కార్డులతో రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది.  కొంత మంది రిజిస్ట్రార్లు, నిబంధనలను ఉల్లంఘించి, ఇవన్నీలేకుండానే రిజిస్ట్రార్లు కోట్ల విలువచేసే స్థలాలను ఎవరికిపడితే వారికి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నా రు. రిజిస్ట్రేషన్‌లో భాగంగా విక్రయదారులు, కొనుగోలుదారులు, విట్‌నెస్‌దారులకు సంబంధించిన అడ్రస్‌ఫ్రూఫ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌పాస్‌బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో దేనినైనా ఆధారంగా చూపించాల్సి ఉంటుంది. ఇటీవల  ఆధార్‌కార్డుకు ప్రామాణికంగా తీసుకుంటుండటంతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌శాఖలోనూ ఆధార్‌కార్డుతోనే ఎక్కువ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని అవకాశంగా మలుచుకుని పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. 


ఆధార్‌లో మార్పులతోనే అక్రమాలు..

ఆధార్‌కార్డు వివరాలను సులభంగా మార్చుకునే అవకాశమివ్వడంతోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నయి. ఆధార్‌లో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చాలా సులభంగా, మనకు సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు.దీనిని అక్రమార్కులు వరంగా మార్చుకుంటున్నారు. ఒకే ఆధార్‌ నంబర్‌తో ఇద్దరికి కార్డులను సృష్టిస్తున్నారు. వాస్తవికంగా ఏదైనా పేరు, చిరునామా, పుట్టిన తేదీలను ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవడానికి సవాలక్ష డాక్యుమెంట్లు అడుగుతారు. ఏవైనా  ఆధారాలు ఇవ్వమని కోరతారు.

   కానీ ఆధార్‌లో ఇలాంటి ఆప్షన్‌లేక పోవడంతో మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మార్పు లు చేర్పులు చేస్తున్నారు. వారు సంబంధీకులా.. కాదా.. అని నిర్ధారించుకోకుండానే మార్పులు చేస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని కొంత మంది ముఠాగా ఏర్పడి ఆధార్‌కార్డులను సృష్టిస్తున్నారు. వీటిని ప్రమాణికంగా తీసుకుని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.  


అన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నాం 

రిజిస్ట్రేషన్‌ సమయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మొదట ఈకేవైసీతో ఆధార్‌కార్డును వెరిఫికేషన్‌ చేసిన తర్వాతే ఫొటోలు తీసుకోవడం, రిజిస్ట్రేషన్‌ చేయడం జరుగుతున్నది. ఆధార్‌కార్డు ఒక్కటే కాకుండా మిగతా డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. 

          -రవీందర్‌,జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-1 రెడ్‌హిల్స్‌logo