శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Feb 15, 2020 , 23:53:41

సహకార ఎన్నికల్లో కారు జోరు

సహకార ఎన్నికల్లో కారు జోరు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  సహకార ఎన్నికలో కారు దూసుకుపోయింది. ఈ ఎన్నికల్లో సైతం ప్రజలు, రైతులు టీఆర్‌ఎస్‌ కు పట్టం కట్టారు. జిల్లాలోని సహకార ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగిన ఎన్నికలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు బరిలో నిలిచిన వారందరూ భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్ధు లు, వారికి అండగా నిలిచిన వారు సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గెలిచిన అభ్యర్థులను భుజాలపై ఎత్తుకొని నృత్యాలు చేశారు. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపు అని ప్రకటించగానే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. రైతులందరూ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడంతో జిల్లా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు చేపట్టిన సంక్షేమ పథకాలకు రైతులు  బ్రహ్మరథం పట్టారు. టీఆర్‌ఎస్‌ మద్దతుతో నేడు ఎన్నిక కానున్న చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలతోనే భారీగా మెజార్టీ రావడం జరిగింది. సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. ఆదివారం నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరుగనున్నా యి. ఏవైనా అనివార్య సంఘటనలు చోటు చేసుకుంటే మరుసటి రోజున ఎన్నికలను నిర్వహిస్తా రు. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించడంతో గులాబీ దళంలో మరింత జోష్‌ పెరిగింది. 37 సొసైటీలకు గాను 26 సొసైటీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. చేవెళ్ల, ముడిమ్యాల, మోకిల, శంకర్‌పల్లి, నార్సింగి, సురంగల్‌, హయత్‌నగర్‌, నందిగామ సొసైటీలో నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. జిల్లాలోని 481 డైరెక్టర్లకు గాను టీఆర్‌ఎస్‌ 291, కాంగ్రెస్‌ 115, స్వతంత్రులు 18, బీజేపీ 37, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 11 చోట్ల విజయం సాధించింది. దాదాపు అన్ని సొసైటీలనూ టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఫలితాల్లో హోరాహోరీ పోరు సాగిచింది. టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు అత్యధికత  కొనసాగించి ఫలితాల్లో తడాఖా చూపించారు. సహకార ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోవడంతో  హోరాహోరీ పోరు సాగినప్పటికీ కారుదే స్పీడ్‌ కనిపించింది. కాంగ్రెస్‌ 8 సీట్లతో సరిపెట్టుకోగా.. బీజేపీ ఒక సీటును దక్కించుకుంది. టీడీపీకి, సీపీఐ, సీపీఎంలు ఈ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోయాయి.

సంబురాలు..

సహకార పోరులో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. జిల్లా లో సహకార పోరులో ‘గులాబీ దళం’ మంచి ఫలితాలతో జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. 37 సొసైటీల పరిధిలో 1 సొసైటీ ఏకగ్రీవంతోపాటు 99డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన  36 సొసైటీల పరిధిలో 373డైరెక్టర్‌ స్థానాలకు శనివా రం ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్‌కు 26, కాం గ్రెస్‌కు 8, ఫార్వార్డ్‌ బ్లాక్‌ 1, బీజేపీకి 1, ఇతరులు 1చొప్పున సొసైటీ స్థానాలు దక్కించుకుకోగా టీడీపీకి, సీపీఐ, సీపీఎం పార్టీలు ఖాతా తెరువలేదు. ఆయా సొసైటీల గెలుపొందిన అభ్యర్థులు టపాసులు పేలుస్తూ డప్పువాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరూ రంగులు చల్లుకుంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కొందరి అభ్యర్థులకు డిపాజిట్‌ దక్కలేవు. మరికొన్నిచోట్ల డబ్బులు, మద్యం పనిచేయలేదు.

టీఆర్‌ఎస్‌ ఖాతాలో..

   కొత్తపేట, చేగూరు, మేకగూడ, పోల్కంపల్లి, యాచారం, హైదర్‌షాకోట్‌, షాబాద్‌, కందుకూరు, ఫరూఖ్‌నగర్‌, శంషాబాద్‌, పాల్మాకుల, మల్కారం, మంచాల, ఆర్కెమైలారం, బాటా సింగారం, ఎంపీ పటేల్‌గూడ, ఉప్పరిగూడ, మాడ్గుల, ఆమనగల్లు, ఆలూరు, మహేశ్వరం, బండ్లగూడ, శంకర్‌పల్లి, రాయదుర్గం, కొందుర్గు, తుర్కయంజాల్‌ తదితర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై గులాబీ జెండా ఎగిరింది. 

కాంగ్రెస్‌ ఖాతాలో..

  మోకిల, ముడిమ్యాల, సురంగల్‌, చేవెళ్ల, చిన్నగోల్కోండ, హయత్‌నగర్‌, నందిగామ, నార్సింగి తదితర సొసైటీలు కాంగ్రెస్‌ దక్కించుకుంది. బీజేపీ భాగ్యనగర్‌, తలకొండపల్లి ఫార్వార్డ్‌ బ్లాక్‌, గుండాల 1 ఇతరులు చొప్పున గెలుచుకున్నారు.