ఆదివారం 23 ఫిబ్రవరి 2020
సహకార ఎన్నికలకు సర్వంసిద్ధం

సహకార ఎన్నికలకు సర్వంసిద్ధం

Feb 14, 2020 , 23:51:21
PRINT
సహకార ఎన్నికలకు సర్వంసిద్ధం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ఇబ్రహీంపట్నం,శంషాబాద్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ
  • ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
  • న్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
  • 373 ప్రాదేశిక స్థానాల్లో ఓటేయనున్న 69,840 మంది రైతులు
  • జిల్లాలో 1 పీఏసీఎస్‌,99 డైరెక్టర్లు ఏకగ్రీవం
  • 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఆ వెంటనే ఫలితాలు
  • ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్‌

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధంచేశారు. నేడు ఉదయం 373 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్ర శాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరింది. ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పంపిణీచేశారు. ఇబ్రహీంపట్నంలో స్నేహ మహిళా సొసైటీ నుంచి 15 సొసైటీలకు, శంషాబాద్‌ బాలికల పాఠశాల నుంచి 21 సొసైటీలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని అందజేశారు. మొత్తం 15 రూట్లుగా విభజించారు. 15 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. ఇక్కడ నుంచి నిర్ణీత పోలింగ్‌ కేంద్రం సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రిని తీసుకుని బయలుదేరి వెళ్లారు. ఎన్నికల సిబ్బంది శుక్రవారం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు వెళ్లి రిపోర్టు చేసి తమకు కేటాయించిన సామగ్రిని తీసుకుని పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరి వెళ్లారు. సహకార సంఘాల ఎన్నికలను  కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. 

జిల్లాలో మొత్తం 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఏర్పాట్లు చేసింది. 37 సహకార సంఘాల్లోని 481 డైరెక్టర్‌ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 1 పీఏసీఎస్‌తో పాటు 99 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 36 పీఏసీఎస్‌లకు 373 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అదికారులు ఏర్పాట్లు చేశారు. 

373 పోలింగ్‌ కేంద్రాలు..

36 సహకార సంఘాల పరిధిలోని 373 స్థానాలకు 835 మంది బరిలో నిలిచారు. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని కేటాయించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి పోలింగ్‌ అధికారి, అదనపు పోలింగ్‌ అధికారి, ప్రీసైడింగ్‌ అధికారి, అదనపు ప్రీసైడింగ్‌ ఇద్దరు అధికారులతో సహా 1206 మంది సిబ్బందిని కేటాయించారు. వీరు కాకుండా 10 శాతం అదనంగా 120 మందిని అం దుబాటులో ఉంచారు. 15 బస్సులు,  15 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్ల, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 85,943 బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

 69,840 మంది ఓటర్లు..

  జిల్లాలో 37 సహకార సంఘాల పరిధిలోని 481 డైరెక్టర్‌ స్థానాల్లో 85,943 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీటిలో 99 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఈ డైరెక్టర్‌లో ఓటర్లు ఓటు వేయకపోవడంతో 16,103 మంది ఓటర్లు మినహాయింపు ఇచ్చారు. మిగిలిన 36 సొసైటీల పరిధిలో 373 డైరెక్టర్‌ స్థానాలకు 69,840 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

1 చైర్మన్‌.. 99 డైరెక్టర్లు ఏకగ్రీవం..

జిల్లా వ్యాప్తంగా 37 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చైర్మన్‌ అయ్యేందుకు అవసరమైన సంఖ్యకు అనుగుణంగా 36 సంఘాల్లో 99 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో బండ్లగూడ సొసైటీ చైర్మన్‌తో సహా డైరెక్టర్లను పూర్తిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలూరు, గుండాలలో సొసైటీల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 99 డైరెక్టర్‌ స్థానాల్లో 90 శాతం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

9 వార్డులకు ఎన్నికల నిల్‌ 

  జిల్లాలో 9 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదు. రెండు చోట్ల నామినేషన్లు దాఖాలు చేయలేదు. ఒక చోట ముగ్గురు పిల్లలు ఉండటంతో నామినేషన్‌ తిరస్కరించారు. మరో 6 చోట్ల ఎస్సీ రిజర్వు స్థానాల్లో అభ్యర్థులు లేకపోవడంతో అక్కడ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు వెల్లడించారు. 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: డీసీవో జనార్ధన్‌రెడ్డి 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల నిర్వహణకు 1300 మంది సిబ్బందిని నియమించాం. 373 మంది పోలింగ్‌ ఆఫీసర్లు, 746 మంది అసిస్టెంట్‌ పోలింగ్‌ అధికారులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నాం. భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ల ఆధ్వర్యంలోని డీసీపీలు, ఏసీపీలు తగిన ఫోర్స్‌ను ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.


logo