బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 14, 2020 , 23:51:21

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర  కీలకం

మొయినాబాద్‌ : నేర పరిశోధనలో జాగిలాల పాత్ర చాలా కీలకమని ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌ అన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ శిక్షణ అకాడమి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 37 పోలీసు జాగిలాల పాసింగ్‌ అవుట్‌  పరేడ్‌ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనలకు సంబంధించిన అంశాలపై జాగిలాలకు శిక్షణ ఇవ్వడానికి గత 16 ఏండ్ల క్రితం మొయినాబాద్‌లో ఇంటిగ్రేటేడ్‌ ఇంటెలిజెన్స్‌ శిక్షణ అకాడమి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 885 జాగిలాలకు ప్రత్యేకమైన  శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని మొయినాబాద్‌లో ఉన్న  ఈ జాగిలాల శిక్షణ కేంద్రం దేశంలో ఉన్న అత్యున్నత శిక్షణ కేంద్రాల్లో ఒకటి ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఎన్నో కీలక కేసులను ఛేదించడంలో పోలీసుల జాగిలాల అందించిన సేవలు అమోగమని ఆయన ప్రశంసించాడు. శునకాలతో కేసులను త్వరితగతిన ఛేదించడం జరిగిందని పేర్కొన్నారు. మనిషి కంటే  జాగిలాలకు వాసన పట్టే శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అధికంగా ఉంటుందని చెప్పారు.  విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతాయని చెప్పారు.


హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడంలో, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి ప్రాణ, ఆస్తి నష్ట నివారణలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తాయని చెప్పారు. శాంతిభద్రల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సెక్యూరిటీ విభాగం ఐజీ ఎంకే సింగ్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ శిక్షణ కేంద్రం నుంచి 19 బ్యాచ్‌ల శిక్షణ పొందిన శునకాల పాసింగ్‌ అవుట్‌ జరిగిందన్నారు.మొయినాబాద్‌లోని శిక్షణ కేంద్రంలో తెలంగాణ రాష్ర్టానికి చెందిన 20 జాగిలాలు అక్రమ మద్యంను గుర్తించే విధంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. మరో 25 జాగిలాలకు శిక్షణ ఇవ్వాలని బీహార్‌ పోలీస్‌శాఖ కోరిందని పేర్కొన్నారు. పాసింగ్‌ అవుట్‌ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు  శిక్షణ పొందిన జాగిలాల వందనపరేడ్‌ స్వీకరించారు. శిక్షణ పొందిన జాగిలాల ప్రదర్షణ, జాగిలాల సాహాస కృత్యాలు ఆకట్టుకున్నాయి.శిక్షణా పొందిన జాగిలాలు ఇతరులు ఇచ్చిన ఆహారం స్వీకరించకపోవడం, కేవలం  శిక్షకుడు ఇచ్చే ఆహారాన్ని తినడం, పేలుడు పద్థారాలను వాసనతోనే గుర్తించడం, ఎన్నో బాక్సులు ఉన్న అందులో కేవలం బాంబు ఉన్న బాక్సును మాత్రమే గుర్తించడం ప్రమాదకర పరిస్థితుల్లో ఉగ్రవాదులను పట్టుకోవడం వంటి విన్యాసాలు అందరిని  ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ సీవీ ఆనంద్‌,  శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌తాజొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>