గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 13, 2020 , 23:34:12

మొక్కలు నాటుదాం విషెస్‌ తెలుపుదాం

మొక్కలు నాటుదాం విషెస్‌ తెలుపుదాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌ అనే నినాదంతో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా వాసులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని, రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కలు నాటి సీఎంకు అపురూపమైన కానుక ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. - రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

  • సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజున జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి
  • ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదిన జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. సీఎం పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ మొక్కను నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొని సంబురాలు జరుపాలని సూచించారు. ఈచ్‌ వన్‌ ప్లాంట్‌ వన్‌ అనే నినాదంతో జిల్లాలో పెద్దఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలోని సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, మండల, జిల్లా ప్రాదేశిక సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పోరేషన్‌ మేయర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను స్వీకరించాలని కోరారు.

జిల్లాలోని ప్రభుత్వ, ఫ్రైవేట్‌ విద్యాసంస్థల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కలు నాటడం ద్వారా ముఖ్యమంత్రికి అపురూపమైన కానుకను అందజేస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ ఈ నెల 17వ తేదిన మొక్కలు నాటాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. మొక్కలను నాటడంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరిసేలా జిల్లా ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. త్వరలోనే నిర్వహించనున్న పంచాయతీరాజ్‌ సమ్మేళనాల తర్వాత గ్రామాల రూపురేఖలే మారనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామాలను బాగుగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సహకాలను అందజేస్తామని మంత్రి వెల్లడించారు.


logo