శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 13, 2020 , 04:09:53

ఇంటి వద్దకే భోజనం..!

ఇంటి వద్దకే భోజనం..!
  • ఒక్కో జోన్‌లో 200మంది వరకు గుర్తింపు
  • ‘అన్నపూర్ణ’ భోజనశాలల ఆధునీకరణ
  • 60 చోట్ల ప్రారంభమైన పనులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉన్నచోట నుంచి కదల్లేని వారికి, వికలాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే భోజనం అందే ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఏ దిక్కూ లేక ఆకలితో అలమటించేవారికి కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం పెట్టే ప్రయత్నం చేయాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచన మేరకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా త్వరలోనే ఏర్పాటు చేయనున్న అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా వారందరికీ భోజనాన్ని అందించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా, జోన్‌కు పది చొప్పున భోజనశాలలను మరింత విస్తరించి ఆధునీకరించాలని నిర్ణయించారు. కూర్చునేందుకు, నిలబడి తినేందుకు ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణం, మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. 


స్థలాల లభ్యతను బట్టి ఏర్పాట్లు..

అన్నపూర్ణ భోజనశాలల ఆధునీకరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ పలు నిర్ణయాలు తీసుకున్నది. స్థలం లభ్యతనుబట్టి కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో కంచాలు పట్టుకొని నిల్చోని తినేవిధంగా ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఇలా జోన్‌కు పది చొప్పున 60 భోజనశాలలను అభివృద్ధి చేయాలని బల్దియా స్థాయీ సంఘంలో తీర్మానం చేశారు. జోనల్‌ కమిషన్ల ఆధ్వర్యంలో ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే వారం-పది రోజుల్లో ఎల్బీనగర్‌లో ఈ తరహా క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చాలా మంది వృద్ధులు, వికలాంగులు, దిక్కులేనివారు ఈ కేంద్రాల వద్దకు చేరుకోలేక భోజనాలకు దూరమవుతున్నారు. మరికొందరు ఫుట్‌పాత్‌లు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లపైనే ఉంటూ ఎవరో దాతలు ఇచ్చే ఆహార పదార్థాలు తిని జీవనం సాగిస్తున్నారు.


 ఇటువంటి వారందరినీ గుర్తించి వారికి కూడా ఒక పూట భోజనం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలోనే, తాజాగా వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల ప్రకారం అధికారులు దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జోన్‌కు కనీసం 200మంది చొప్పున అన్నార్థులను ఎంపిక చేసి ఏదైనా ఏజెన్సీకి భోజనాలు సరఫరా చేసే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవాలా? లేక సీఎస్‌ఆర్‌ నిధులతో ఎవరికైనా బాధ్యతలు అప్పగించాలా? అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. 


పేదలు పస్తులుండొద్దు..

పేదలు పస్తులుండకుండా కనీసం ఒక్క పూటైనా కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రూ.5లకే నాణ్యమైన భోజనాన్ని ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 150 అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. ఒక్కోదాంట్లో సుమారు 300 మంది చొప్పున రోజుకు దాదాపు 50 వేలమంది వరకు భోజనాలు చేస్తున్నారు. ఒక్కో భోజనానికి రూ. రూ.25 ఖర్చవుతుండగా, అందులో రూ.20జీహెచ్‌ఎంసీ భరిస్తున్నది. మిగిలిన రూ. 5 లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫుట్‌పాత్‌లు, ఇరుకు ప్రదేశాల్లో కొనసాగుతున్న ఈ క్యాంటీన్లను అవకాశాలకు అనుగుణంగా కొంత విశాలవంతంగా, కూర్చోని భోజనం చేసే విధంగా విస్తరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.


logo